మునుగోడులో దొంగల హల్‌చల్
ABN , Publish Date - Jan 10 , 2025 | 12:29 AM
నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో బుధవారం రాత్రి దొంగలు హల్‌చల్ చేశారు.
మునుగోడు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో బుధవారం రాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడ్డారు. ఆయా ఇళ్లలో బంగారు నగలు, నగదుతో పాటు బైక్‌ను అహరించారు. ఈ ఘటనపై పోలీసులు, బాధిత కుటుంబాలు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలకేంద్రంలోని జిట్టగోని వెంకటయ్య, లింగస్వామిలకు చెందిన నాగార్జున స్వీట్ షాపు మూసివేసి భవనంపైన ఉన్న ఇంటికి వెళ్లారు. ఆ దుకాణంలోకి ప్రవేశించిన దొంగలు రూ.65వేల నగదు, స్వీట్లను సైతం అపహరించారు. ఆ పక్కనే ఉన్న వారి ఇంటి తాళం విర గ్గొట్టి ఇంట్లోకి చొరబడి సుమారు 12 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. అనంతరం ఆ పక్కనే ఉన్న వెనిగల పురుషోత్తం ఇంట్లో చొరబడి రూ.60వేలు నగదుతో పాటు సుమారు అరకిలో వెండి సైతం అపహరించారు. అదే వరుసలో ఉన్న అద్దె భవనంలో కొనసాగుతున్న అటవీ శాఖ కార్యాలయంలోకి చొరబడి వస్తువులు చిందర వందర చేసి వెళ్లారు. అనంతరం పెద్దవాగు సమీపాన ఉన్న రాసమళ్ల శ్రీరాములు ఇంటి ముందు ఉంచిన బైక్‌ను ఎత్తుకెళ్లారు.
కేకలు వేయడంతో పొలం గట్ల వెంబడి..
మునుగోడు నుంచి నార్కట్‌పల్లి వైపున గల వడ్డెరగూడెంలో ఆర్‌అండ్‌బీ రహదారి వెంట ఉన్న ముద్దంగుల నర్సింహా ఇంట్లో తాళం విరగ్గొట్టి చొరబడ్డారు. ఆ సమయంలో కుక్కలు అరిచాయి. దీంతో కాలనీకి చెందిన ఒకరు నిద్రలేచి బయటకు వచ్చాడు. ఇద్దరు దుండగులు రాళ్లు పట్టుకొని కుక్కలను బెదిరిస్తుండటం చూసి భయపడి ఇంట్లోకి వెళ్లాడు. ఆ తర్వాత పక్క ఇంటివారికి ఫోనలో సమాచారం ఇచ్చారు. అందరూ వెంటనే నిద్రలేచి ఇంటి బయటకు ఒక్కసారిగా వచ్చి కేకలు వేసే క్రమంలో పొలం గట్ల వెంట దొంగలు పారిపోయారు. కాగా చోరీకి పాల్పడే సమయాల్లో దొంగలు సీసీ కెమెరాలను కర్రలతో పైకి ఎత్తి వెళ్లారు. ఇది చూస్తే పక్కా ప్రణాళికతో దొంగతనాలు చేసినట్లు తెలుస్తోంది. ఉదయం లేచాక దొంగతనం జరిగిందని గుర్తించిన బాధితులు ఒక్కొక్కరు లబోదిబోమంటున్నారు. సుమారు రూ.10 లక్షల బంగారు నగలు, రూ.1.25 లక్షల నగదు, బైక్ చోరీకి గురైంది.
పోలీసు అధికారుల పరిశీలన
చోరీల విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఇరుగు రవి పోలీసులతో చోరీలు జరిగిన ఇళ్లను పరిశీలించారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి చోరీ జరిగిన ఇళ్లను సందర్శించారు. బాధిత కుటుంబీకులతో మాట్లాడారు. దుండగుల కోసం పోలీసులు వేర్వేరు బృందాలుగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ విభాగాల పోలీసులు వచ్చి చోరీలు జరిగిన ఇళ్లు, పరిసర ప్రదేశాలను పరిశీలించాయి. ఆయా చోట్ల వేలి ముద్రలను సేకరించారు. అంతకుముందు చండూరు సీఐ వెంకటయ్య వివరాలు సేకరించారు.