గిరిజన, ఆదివాసీలు చైతన్యంకావాలి
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:34 AM
గిరిజన, ఆదివాసీలు చైతన్యం కావాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ అన్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ
నాగార్జునసాగర్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): గిరిజన, ఆదివాసీలు చైతన్యం కావాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్‌కాలనీ విజయ విహార్ అతిథి గృహంలో ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు వారం రోజులపాటు నిర్వహించే అఖిల భారత గిరిజన ఆదివాసీల కాంగ్రెస్ ప్రతినిధుల శిక్షణా తరగతులను టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్, ఏఐసీసీ ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ కొప్పుల రాజు, ఎంపీలు బలరాం నాయక్, రఘువీర్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో గిరిజన ఆదివాసీల అభివృద్ధి కోసం రాహుల్ గాంధీ ఆశయాల సాధనకు, వారిని చైతన్యపరచడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. సాగర్‌లో వారం రోజులపాటు జరిగే శిక్షణ పొందిన నేతలు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయిలో గిరిజన ఆదివాసీలకు అవగాహన కల్పించాలన్నారు. గిరిజన, ఆదివాసీలు ఉన్నత విద్యనభ్యసించి ఉన్నత ఉద్యోగాలు పొందాలన్నారు. బౌద్ధమతానికి నిలయంగా ఉన్న సాగర్‌లో ఇలాంటి శిక్షణా తరగతులు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. దేశంలో గిరిజనులు, ఆదివాసీలకోసం కాంగ్రెస్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.
దేశ సంపద సంపన్నవర్గాలకు.. : మహే్‌షకుమార్ గౌడ్
దేశంలో ఉన్న విలువైన సంపదను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంపన్న వర్గాలకు కట్టబెట్టాలని చూస్తోందని, అలాంటి ప్రయత్నం జరగకుండా వ్యతిరేకించే శక్తి ఒక్క రాహూల్ గాంధీకే ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో గిరిజన ఆదివాసీల పాత్ర కీలకమైందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు గిరిజన ఆదివాసీలకోసం అనేక చట్టాలను అమలు చేసిందన్నారు. జల్, జంగిల్, జమీన్ నినాదానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఈ నినాదంతో రాహూల్ గాందీ పాదయాత్ర కూడా చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పీసా చట్టం వచ్చిందన్నారు. గిరిజన, ఆదివాసీల హక్కులకోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే రోల్ మోడల్‌గా మారిందన్నారు. ఆదివాసీల హక్కులను బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు హరించివేస్తున్నాయన్నారు. మతం పేరుతో ఓట్లు అడుక్కునే పార్టీలు దేశంలో ఉండటం దురదృష్టకరమన్నారు. రాహూల్ గాంధీని ప్రధానిగా చూడాలంటే అందరం కలిసి పనిచేయాలన్నారు. మాజీ మంత్రి, సీనియర్‌నేత కుందూరు జానారెడ్డి అడ్డా సాగర్ అని అన్నారు. ఆయన అనుభవంతోనే రాష్ట్రంలో ముందుకెళ్తున్నామని తెలిపారు. మొదట ఇటీవల మృతి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, బాలునాయక్, లక్ష్మారెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్‌రెడ్డి, నాయకులు నాగరాజు, శ్రీను, నరసింహరావు, మునినాయక్, నాగేశ్వర్ నాయక్, శంకర్ నాయక్, హరినాయక్, నాగేందర్‌నాయక్, సర్థార్, పాండు నాయక్ పాల్గొన్నారు.