లగచర్ల భూసేకరణ సరైనదే!
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:30 AM
లగచర్ల వంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.
పోలీసుల వైఖరి చట్టవిరుద్ధం
స్టేషన్లో కెమెరాలు పని చేయలేదు
గ్రామస్థుల్ని రాత్రంతా చితకబాదారు
నిబంధనలు పాటించకపోవడం వల్లే కలెక్టర్‌పై గ్రామస్థుల దాడి పరిస్థితి
జాతీయ హక్కుల కమిషన్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): లగచర్ల వంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. చట్ట ప్రకారం భూ సేకరణకు ప్రభుత్వ ఏజెన్సీలు ఉత్తర్వులు జారీ చేసిన మాట నిజమేనని, అయితే పోలీసు అధికారులు మాత్రం ఈ విషయంలో వ్యవహరించిన తీరు సరిగాలేదని ఎన్‌హెచ్‌ఆర్సీ వ్యాఖ్యానించింది. లాక్‌పలోనూ, సీఐ కార్యాలయంలోనూ సీసీ టీవీ కెమెరాలు పని చేయలేదని, రాత్రంతా గ్రామస్థులను పరిగి పోలీసు స్టేషన్‌లో ఉంచి చితక బాదారని, ఆ విషయం మెజిస్ట్రేట్ ముందు చెప్పకూడదని హెచ్చరించారని, ఎన్‌హెచ్‌ఆర్సీ గతవారం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన నోటీసుల్లో పేర్కొంది. పరిగి పోలీసు స్టేషన్‌లో గ్రామస్థులను నిర్బందించిన విషయాన్ని జనరల్ డైరీలోనూ ప్రస్తావించలేదని, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీకి చెందిన వారినే పోలీసులు అత్యధికంగా అరెస్టు చేశారని, ఒక్క కాంగ్రెస్ మద్దతుదారుని కూడా అరెస్టు చేయలేదని తెలిపింది.
అధికారులపై దాడులు చేయని అమాయకపు గ్రామస్థులపై చర్యలు తీసుకోరాదని ఎన్‌హెచ్‌ఆర్సీ స్పష్టం చేసింది. లగచర్ల గ్రామానికి చెందిన జర్పులా దేవితో పాటు మరో 11 మంది చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎన్‌హెచ్‌ఆర్సీ దర్యాప్తును ప్రారంభించింది. ఈ భూమిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన ప్రజలు సాగు చేసుకుంటున్నారని, గత నాలుగైదు నెలలుగా ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సంఘటన స్థలాన్ని, చుట్టుపక్కల ఉన్న గ్రామాలను సందర్శించిందని, సంగారెడ్డి, చర్లపల్లి జైళ్లలో ఉన్న వారిని కూడా విచారించిందని కమిషన్ వెల్లడించింది. జిల్లా కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారులపై గ్రామస్థులు దాడి చేసిన విషయంలో అధికార వర్గాలు సాక్ష్యాధారాలు సమర్పించినట్లు కమిషన్ చెప్పింది. చట్టబద్ధమైన మార్గదర్శక సూత్రాలను అనుసరించక పోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఎన్‌హెచ్‌ఆర్సీ అభిప్రాయపడింది.