TGSPDCL: విద్యుత్ చార్జీలు పెంచడం లేదు
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:51 AM
రానున్న ఆర్థిక సంవత్సరం, 2025 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచడం లేదని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ ప్రకటించారు.

టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషార ఫ్ అలీ ఫారూఖీ.. టీజీఈఆర్సీ బహిరంగ విచారణలో వెల్లడి
పలు ఫిర్యాదులు స్వీకరించిన టీజీఈఆర్సీ చైర్మన్
హైదరాబాద్ సిటీ, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రానున్న ఆర్థిక సంవత్సరం, 2025 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచడం లేదని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ ప్రకటించారు. సంస్థ ఆదాయానికి, అవసరానికి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం టారిఫ్ సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. పవర్ స్వాపింగ్ ఒప్పందాల(డిమాండ్ లేని సమయంలో మన విద్యుత్ ఆ రాష్ట్రాలకు, డిమాండ్ ఉన్న సమయంలో ఆ రాష్ట్రాల నుంచి విద్యుత్ మనకు అందించేలా) వల్ల టీజీఎస్పీడీసీఎల్‌కు రూ.1614 కోట్లు ఆదా అయ్యిందన్నారు. ఈ ఒప్పందాల వల్ల పీక్ సీజన్‌లో యూనిట్ రూ.10 వెచ్చించి కొనుగోలు చేయాల్సిన అదనపు భారం తగ్గిందన్నారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ) చైర్మన్ డి.నాగార్జున్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని విద్యుత్ నియంత్రణ భవన్‌లో శుక్రవారం జరిగిన బహిరంగ విచారణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ సి. శ్రీనివాసరావు, విద్యుత్‌రంగ నిపుణులు వేణుగోపాల్, రైల్వే, హెచ్‌ఎంఆర్‌ఎల్ , వాటర్‌బోర్డుతో పాటు పలు విభాగాల ప్రతినిధులు ఈ బహిరంగ విచారణలో పాల్గొన్నారు. కాగా, డబ్బులిస్తేనే పొలాల్లో విద్యుత్ స్తంభాలు వేస్తామని లైన్‌మెన్ తమని బెదిరిస్తున్నారంటూ ఈ బహిరంగ విచారణకు హాజరైన వనపర్తి గోపాల్‌పేట మండలం బుద్ధారం గ్రామానికి చెందిన పలువురు రైతులు టీజీఈఆర్సీ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. డిస్కమ్‌లకు డీడీలు చెల్లించినా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుచేయడం లేదని, వ్యవసాయ భూముల్లో విద్యుత్ తీగలు చేతికి అందె ఎత్తులో ఉన్నా సిబ్బంది పట్టించుకోవడం లేదని మరికొందరు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ఈఆర్సీ చైర్మన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక, నిబంధనల ప్రకారం విద్యుత్ సంస్థలకు అవసరమైన ఆర్థిక మద్దతును సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇంధనశాఖ డిప్యూటీ కార్యదర్శి ప్రియదర్శిని పేర్కొన్నారు.
2019 నాటి ఘటనకు తక్షణ పరిష్కారం..
బహిరంగ విచారణకు హాజరైన నారాయణ్‌పేట కోస్గి మండలానికి చెందిన చిన్నయ్య సరిత.. తన భర్త సంజీవరెడ్డి విద్యుత్ ప్రమాదంలో 2019లో మరణిస్తే ఇప్పటిదాకా పరిహారం ఇవ్వలేదని ఈఆర్సీ చైర్మన్‌కు వివరించింది. స్పందించిన చైర్మన్.. తక్షణమే పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. దీంతో డిస్కం అధికారులు వెంటనే ఆ పైల్‌ను పంపించి రూ.5 లక్షల పరిహారానికి సంబంధించిన పత్రాలను చైర్మన్ చేతులమీదుగా సరితకు అందజేశారు.