Share News

Online Gambling Addiction: ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగులకు యువకుడి బలి

ABN , Publish Date - Mar 26 , 2025 | 04:34 AM

ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లకు బానిసైన సోమేశ్వర్‌రావు మూడు సంవత్సరాల్లో 3 లక్షల వరకు డబ్బులు పోగొట్టాడు. ఈ సందర్భంగా అతను డబ్బులు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Online Gambling Addiction: ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగులకు  యువకుడి బలి

  • మూడేళ్లలో రూ.3 లక్షల వరకు పొగొట్టుకున్న వైనం

  • సోమవారం ఐపీఎల్‌ మ్యాచ్‌లోనూ 2 లక్షలు నష్టం

  • మనోవేదనతో రైలు కింద పడి సోమేశ్వర్‌ ఆత్మహత్య

  • మెదక్‌ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఘటన

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌/ మేడ్చల్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగులకు బానిసైన ఓ యువకుడు అందులో డబ్బులు పొగొట్టుకొని తీవ్ర మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ అనకాపల్లికి చెందిన సోమేశ్వర్‌రావు (27) కుటుంబం మేడ్చల్‌ గుండ్లపోచంపల్లిలో స్థిరపడింది. సోమేశ్వర్‌రావు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగులకు అలవాటు పడిన అతను వచ్చిన సంపాదనంతా దాంట్లోనే పెట్టేవాడు. అలా మూడేళ్ల కాలంలో రూ. 3 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. సోమవారం ఢిల్లీ- లఖ్‌నవూ మధ్య జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లోనూ బెట్టింగ్‌ వేసి రూ. 2 లక్షలు పోగొట్టుకున్నాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం గౌడవెల్లి గ్రామ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చనిపోవడానికి ముందు లొకేషన్‌ను కుటుంబసభ్యులకు, స్నేహితులకు చేరవేయడంతో వారు అక్కడకు చేరుకుని రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలి నుంచి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. సోమేశ్వర్‌రావు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 26 , 2025 | 04:36 AM