Share News

ఎస్సీ వర్గీకరణ చట్టం.. రాజ్యాంగ విరుద్ధం

ABN , Publish Date - Apr 22 , 2025 | 04:40 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తెచ్చిన ఎస్సీ వర్గీకరణ చట్టం-2025ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రైవేటు రంగంలో పనిచేసే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఎస్సీ వర్గానికి చెందిన కనుకుంట్ల మంగ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఎస్సీ వర్గీకరణ చట్టం.. రాజ్యాంగ విరుద్ధం

  • క్రీమీలేయర్‌ ఉండాలని సుప్రీంకోర్టు చెప్పినా.. కమిషన్‌ సిఫార్సు చేసినా సర్కారు పట్టించుకోలేదు

  • ఈ చట్టాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వండి

  • హైకోర్టులో ఎస్సీ మహిళ పిటిషన్‌

  • విచారణకు స్వీకరించిన కోర్టు.. సర్కారుకు నోటీసులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తెచ్చిన ఎస్సీ వర్గీకరణ చట్టం-2025ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రైవేటు రంగంలో పనిచేసే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఎస్సీ వర్గానికి చెందిన కనుకుంట్ల మంగ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ రేణుక ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఆకాశ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటిఫై చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టం.. ‘దావిందర్‌సింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆప్‌ పంజాబ్‌’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ (సంపన్న కుటుంబాలను రిజర్వేషన్ల నుంచి మినహాయించడం) ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు.


మా పేద కుటుంబాలకు నష్టం

‘‘ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న పేద కుటుంబాల్లోని నా లాంటి మొదటితరం వారు తీవ్రంగా నష్టపోతున్నారు. రిజర్వేషన్ల ద్వారా ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు పొంది, ఆర్థికంగా ముందడుగు వేసిన కుటుంబాల్లోని రెండో తరం, మూడో తరం వారే మళ్లీ లబ్ధి పొందుతున్నారు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ, ఉపాధి కోసం ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడుతున్న నా వంటి మొదటితరం అభ్యర్థులకు అవకాశాలు అందడం లేదు. ‘దావిందర్‌సింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆప్‌ పంజాబ్‌’ కేసులో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలోని మెజార్టీ సభ్యులు క్రీమీలేయర్‌ ఉండాలని తీర్పుల్లో పేర్కొన్నారు’’ అని పిటిషనర్‌ కోర్టుకు వివరించారు. ఆ కేసులో తీర్పు ఆధారంగానే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిషన్‌ కూడా ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ ఉండాలని సిఫార్సు చేసిందని.. కానీ ఈ అంశాన్ని పక్కనపెట్టి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమల్లోకి తేవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు వర్గీకరణ చట్టం అమలును నిలిపేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఈ అంశంలో సుదీర్ఘంగా వాదనలు వినాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది.

Updated Date - Apr 22 , 2025 | 04:40 AM