Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్‌కు అంతిమ వీడ్కోలు
ABN , Publish Date - Mar 28 , 2025 | 05:02 AM
క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల అంతిమ కార్యక్రమాలు సికింద్రాబాద్‌లో జరిగాయి. ప్రవీణ్ పగడాల భౌతికకాయాన్ని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సమీపంలోని క్రైస్తవ శ్మశాన వాటికలో గురువారం సాయంత్రం ఖననం చేశారు.

సికింద్రాబాద్‌లోని క్రైస్తవ శ్మశానవాటికలో ఖననం
భారీగా తరలివచ్చిన జనం
వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు, నిరసన
ప్రవీణ్‌కు నివాళులర్పించిన బ్రదర్ అనిల్, కేఏ పాల్
రెజిమెంటల్‌బజార్, రాంగోపాల్‌పేట, నల్లకుంట, మార్చి 27(ఆంధ్రజ్యోతి): క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల అంతిమ కార్యక్రమాలు సికింద్రాబాద్‌లో జరిగాయి. ప్రవీణ్ పగడాల భౌతికకాయాన్ని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సమీపంలోని క్రైస్తవ శ్మశాన వాటికలో గురువారం సాయంత్రం ఖననం చేశారు. ఏపీలోని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం ప్రవీణ్ పగడాల మృతదేహం గురువారం తెల్లవారుజామున సికింద్రాబాద్‌లోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చికి వచ్చింది. ప్రవీణ్ పగడాలకు తుది వీడ్కోలు పలికేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు, క్రైస్తవ బోధకులు చర్చికి తరలివచ్చారు. బ్రదర్ అనిల్, కేఏ పాల్, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, మైనంపల్లి హనుమంతరావు తదితర ప్రముఖులు కూడా ప్రవీణ్ భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఇక, ప్రవీణ్ పగడాలకు నివాళులర్పించిన ఆయన అభిమానులు.. వీవాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ చర్చి బయట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం ప్రవీణ్ పగడాల భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో స్మశానవాటికకు ఊరేగింపుగా తరలించి ఖననం చేశారు.
ఈ అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాగా, తమకు ఎవరి మీద కోపం లేదని, తన భర్త ఆశయాలను కొనసాగిస్తామని పాస్టర్ ప్రవీణ్ పగడాల భార్య జెస్సీకా పగడాల విలేకరులతో అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇక, ప్రవీణ్ పగడాల మృతిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. ప్రవీణ్ పగడాల మృతి అంశంపై కోర్టుకు వెళతానని ఆయన చెబుతుండగా ప్రవీణ్ భౌతికకాయం వద్ద ఉన్న క్రైస్తవ ప్రముఖులు పాల్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ప్రవీణ్ పగడాల మృతికి కారకులను తక్షణమే అరెస్ట్ చేయాలని, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న యూట్యూబ్ చానళ్లను కట్టడి చేయాలని క్రైస్తవ ధర్మప్రచార పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు జేరూసలెం మత్తయ్య ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కోరారు. కాగా, తన వ్యక్తిగత దర్యాప్తు మేరకు ప్రవీణ్‌ది ముమ్మాటికీ హత్యేనని, ప్రవీణ్ మృతదేహానికి హైదరాబాద్‌లో రీపోస్టుమార్టం చేయించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరుతానని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు.
ప్రవీణ్‌కు నివాళులర్పించేందుకు వెళ్తూ.. లారీ ఢీకొని పాస్టర్ మృతి
ఉప్పల్, మార్చి27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో మాచర్ల జోసెఫ్(45) అనే పాస్టర్ ప్రాణాలు కోల్పోయారు. ఘట్‌కేసర్ మండలం కొర్రెముల గ్రామానికి చెందిన మాచర్ల జోసెఫ్.. పాస్టర్ ప్రవీణ్ పగడాలకు నివాళులర్పించేందుకు ద్విచక్రవాహనంపై సికింద్రాబాద్ వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. జోసె్‌ఫకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.