Share News

NagarKurnool: కొనసాగుతున్న అన్వేషణ!

ABN , Publish Date - Mar 11 , 2025 | 04:22 AM

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఆదివారం ఒక మృతదేహాన్ని వెలికితీయగా.. సోమవారం కూడా 12 ఏజెన్సీల ఆధ్వర్యంలో సహాయక బృందాలు తవ్వకాలు కొనసాగిస్తున్నాయి.

NagarKurnool: కొనసాగుతున్న అన్వేషణ!

  • సహాయక బృందాలు గుర్తించిన డీ1, డీ2 ప్రాంతాల్లో తవ్వకాలు

  • డీ2 ప్రాంతానికి చేరుకున్న ఎర్త్‌ మూవర్‌

  • డీ1 షీర్‌ జోన్‌ కావడంతో ఆచితూచి తవ్వకాలు

మహబూబ్‌నగర్‌, దోమలపెంట, మార్చి 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఆదివారం ఒక మృతదేహాన్ని వెలికితీయగా.. సోమవారం కూడా 12 ఏజెన్సీల ఆధ్వర్యంలో సహాయక బృందాలు తవ్వకాలు కొనసాగిస్తున్నాయి. దాదాపు 15 అడుగుల మేర మట్టి పేరుకుని ఉండటం.. తవ్వుతున్న కొద్దీ నీరు రావడం, వచ్చిన నీటిని పంపింగ్‌ చేసిన తర్వాతే మళ్లీ తవ్వకాలు చేపట్టాల్సి రావడం, మరోవైపు తవ్విన మట్టిని బయటకు తరలించే అవకాశం లేకపోవడంతో ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, క్యాడవర్‌ డాగ్స్‌, జీపీఆర్‌ గుర్తించిన కామన్‌ ప్రాంతాలకు డీ1, డీ2గా నెంబరింగ్‌ ఇవ్వగా.. డీ1 మొత్తం షీర్‌ జోన్‌ పరిధిలో ఉండడంతో అక్కడ తవ్వకాలను ఆచితూచి చేపడుతున్నారు. డీ1 నుంచి డీ2 మధ్య 20 మీటర్ల దూరం ఉంది.


డీ2 ప్రాంతంలో ఆదివారం ఒక మృతదేహం లభ్యం కాగా.. ఆ ప్రాంతంలో ఇంకా మట్టి తవ్వకం జరుగుతోంది. డీ1 నుంచి డీ2 వరకు సింగరేణి ఆధ్వర్యంలో ట్రెంచ్‌ కట్‌ చేస్తున్నారు. టీబీఎం భాగాలను కట్‌ చేస్తూ ఒక పక్కకు వేస్తుండటంతో.. డీ2 ప్రాంతం వరకు సోమవారం సాయంత్రం ఒక జేసీబీ ఎర్త్‌ మూవర్‌ వెళ్లింది. దీంతో ఆ ప్రాంతంలో తవ్వకాలు వేగంగా జరిగే అవకాశం ఉంది. మంగళవారం లేదా బుధవారం మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉన్నట్లు సహాయక బృందాలు చెబుతున్నాయి. క్యాడవర్‌ డాగ్స్‌ సోమవారం కూడా లోపలకు వెళ్లాయి.. కానీ మరే ఇతర ప్రాంతాలను గుర్తించలేదు. కాగా కన్వేయర్‌ బెల్టు పనిచేస్తున్న ప్రాంతం వరకు మట్టిని తరలించే వీలు లేకపోవడం, తవ్వుతున్న మట్టిని అక్కడే వేస్తుండడంతో ఆలస్యమవుతోంది. ఆదివారం లభ్యమైన గుర్‌ప్రీత్‌ సింగ్‌ మృతదేహాన్ని పంజాబ్‌లోని చీమాకలాన్‌కు తరలించారు.

Updated Date - Mar 11 , 2025 | 04:22 AM

News Hub