Share News

Fee Reimbursement: దశల వారీగా ఫీజు బకాయిలు చెల్లిస్తాం

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:46 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. గత 15 నెలల్లో రూ.829.12కోట్లను చెల్లించామని వెల్లడించారు.

Fee Reimbursement: దశల వారీగా ఫీజు బకాయిలు చెల్లిస్తాం

  • పదిహేను నెలల్లో రూ.829 కోట్లు చెల్లించాం

  • మరో రూ.1200కోట్లకు టోకెన్‌ నంబర్లు ఇచ్చాం

  • బీఆర్‌ఎస్‌ హయాం నాటి బకాయిలే 4341కోట్లు

  • ప్రస్తుతం రూ.5520కోట్లకు పెరిగాయి: మంత్రి సీతక్క

  • ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పండి: ఎమ్మెల్యే కూనంనేని

  • మేము సకాలంలోనే చెల్లించాం: ఎమ్మెల్యే హరీశ్‌రావు

హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. గత 15 నెలల్లో రూ.829.12కోట్లను చెల్లించామని వెల్లడించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా శనివారం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీపీఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు చెప్పారు. ఇప్పటికే రూ.1200కోట్ల చెల్లింపుల కోసం టోకెన్‌ నంబర్లు ఇచ్చామని, త్వరలోనే మరిన్ని బకాయిలు చెల్లిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాక ముందు బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో రూ.4,341కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ బకాయిలు రూ.5520.60కోట్లకు పెరిగాయని తెలిపారు. విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దని కాలేజీలను కోరామని, బకాయిలన్నీ దశలవారీగా విడుదల చేస్తామని పేర్కొన్నారు.


ఈ విషయమై హరీశ్‌రావు మాట్లాడుతూ నోట్ల రద్దు, కరోనా వంటి పరిస్థితులను ఎదుర్కొంటూనే బీఆర్‌ఎస్‌ పాలనలో ఫీజు బకాయిలను సకాలంలో చెల్లించామని తెలిపారు. ఏటా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో బకాయిలు చెల్లించేవారమని గుర్తు చేశారు. బకాయిలు చెల్లించకపోతే కాలేజీలు ఆగమైపోతాయని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నాటికి రూ.1508కోట్ల మేర బకాయిలు ఉన్నాయని, ఏటా ఫీజులకు రూ.2300కోట్లు అవుతాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.8వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు. ఇదిలాగే కొనసాగితే కాలేజీలు మూతపడే పరిస్థితి వస్తుందన్నారు. ఫీజు బకాయిలను ఎప్పట్లోగా, ఎన్ని వాయిదాల్లో చెల్లిస్తారో చెప్పాలని సీపీఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, చిన్న కాలేజీలకు జీవన్మరణ సమస్యగా మారిందన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 04:46 AM

News Hub