Share News

Seethakka: సీతక్క జీవన విధానం మారింది

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:49 AM

మంత్రి సీతక్క జీవన విధానం మారిందని, ఆమె ఇప్పుడు ఐదు ఎకరాల విశాల భవనంలో ఉంటున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.

Seethakka: సీతక్క జీవన విధానం మారింది

  • ఆమె 5ఎకరాల భవనంలో ఉంటున్నారు

  • నేను చిన్న, 500 గజాల ఇంట్లో ఉంటున్నా

  • ఆమె స్థాయి వేరు.. నా స్థాయి వేరు: పాడి

  • ప్రభుత్వ క్వార్టర్స్‌పై రాజకీయమా: దుద్దిళ్ల

హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): మంత్రి సీతక్క జీవన విధానం మారిందని, ఆమె ఇప్పుడు ఐదు ఎకరాల విశాల భవనంలో ఉంటున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. సీతక్క మంత్రిగా ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఉంటున్నారని, దాన్ని కూడా రాజకీయం చేయడం ఏంటని మంత్రి శ్రీధర్‌బాబు కౌశిక్‌రెడ్డిని ప్రశ్నించారు. ఆయన సీతక్కను అగౌరవపర్చారని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై శనివారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నేను హుజూరాబాద్‌లో ప్రజాక్షేత్రంలో ఉంటున్నానా.. లేదా.. అని మంత్రి సీతక్క అడుగుతున్నారు. నేను ప్రజల్లోనే ఉంటున్నాను. సీతక్క జీవన విధానమే మారింది.


ఆమె ములుగులో తిరుగుతున్నట్లు లేరు. అందుకే ప్రజాక్షేత్రంలో రైతుల సమస్యలు ఆమెకు అర్థం కావడం లేదు. సీతక్క ఇప్పుడు ఐదెకరాల విశాల భవనంలో ఉంటున్నారు. నేను చిన్న, 500గజాల ఇంటిలో ఉంటున్నాను. మీ స్థాయి వేరు. నా స్థాయి వేరు’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై సీతక్క స్పందిస్తూ.. ‘‘కౌశిక్‌ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నేను ఉంటున్న నివాసం ప్రభుత్వం మంత్రులకు కేటాయించిన క్వార్టర్స్‌. అంతే తప్ప నేను సొంతంగా నిర్మించుకుంది కాదు. నేనెప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉంటాను. మీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే రాళ్లు, గుట్టలున్న 500 ఎకరాల ఆసామికి రైతు బంధు ఇచ్చారు. మీ లైఫ్‌ స్టైల్‌ వేరు. నా లైఫ్‌ స్టైల్‌ వేరు. నా స్థాయికి ఆ ప్రభుత్వ క్వార్టర్స్‌ చాలా ఎక్కువ’’ అని కౌశిక్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 04:49 AM