Shamshabad Airport: విమానం ల్యాండయ్యేటప్పుడు ఎమర్జెన్సీ డోర్ తీయబోయాడు
ABN , Publish Date - Mar 26 , 2025 | 05:12 AM
శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అత్యవసర ద్వారం తెరవడానికి ప్రయత్నించిన మహ్మద్ ఖాద్రీ ఉస్మాన్‌పై కేసు నమోదు. ఈ చర్య వల్ల పెను ప్రమాదం తప్పింది.

ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి నిర్వాకం
శంషాబాద్ రూరల్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : విమానం ల్యాండ్ అవుతోన్న సమయంలో అత్యవసర ద్వారం తెరవడానికి యత్నించిన ఓ ప్రయాణికుడిపై కేసు నమోదైంది. ఈ ఘటన మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఔట్‌పోస్టు పోలీ్‌సస్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ బాల్‌రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. సౌదీ అరేబియా(దామస్) నుంచి వస్తున్న 6ఈ 86 ఇండిగో విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా నగరంలోని చార్మినార్ కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాద్రీ ఉస్మాన్(58) అత్యవసర ద్వారం తీయడానికి యత్నించాడు. దీంతో తోటి ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గమనించిన విమాన సిబ్బంది ఉస్మాన్‌ని అడ్డుకున్నారు. దీంతో ఆయన వారితో వాగ్వాదానికి దిగారు. ఈలోగా విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉదయం 10 గంటలకు సురక్షితంగా ల్యాండైంది. పైలెట్లు ఈ ఘటనపై ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఏవియేషన్ అసిస్టెంట్ మేనేజర్ ఔట్ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఉస్మాన్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. విమానం డోర్ తెరుచుకుంటే పెను ప్రమాదం జరిగేదని ఎయిర్‌లైన్స్ అధికారులు వెల్లడించారు. అదృష్టవశాత్తు డోర్ తెరుచుకోకపోవడం వల్ల ముప్పుతప్పిందని చెప్పారు. నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు చెప్పారు.