Sridhar Babu: బయో ఏషియా సదస్సుకు రండి
ABN , Publish Date - Feb 15 , 2025 | 03:47 AM
హైదరాబాద్‌లో ఈ నెల 26న నిర్వహించబోయే బయో ఏషియా-2025 సదస్సుకు రావాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు.

కేంద్ర మంత్రి గోయల్‌కు శ్రీధర్ బాబు ఆహ్వానం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఈ నెల 26న నిర్వహించబోయే బయో ఏషియా-2025 సదస్సుకు రావాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. జీవ విజ్ఞాన రంగంలో ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు, విధానాల రూపకర్తలు, పారిశ్రామిక నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. అలాగే, తెలంగాణలో జీవ విజ్ఞాన రంగ అభివృద్థికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి ప్రశంసించారని, బయో ఏషియా సదస్సుకు హాజరవుతానని చెప్పారని శ్రీధర్ బాబు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో మంత్రి శ్రీధర్ బాబు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి కలిశారు.
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులతోపాటు ఇతర ప్రధాన అంశాలపై చర్చించారు. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్, జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లలో మెగా లెదర్ పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. జాతీయ పారిశ్రామిక మార్గ అభివృద్ధి సంస్థ(ఎన్‌ఐసీడీసీ) పరిధిలోని జహీరాబాద్ ప్రాంత అభివృద్ధిపై కేంద్ర మంత్రితో చర్చించారు. అలాగే, అంతర్జాతీయ వేదికగా తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులు, పరిశ్రమల సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు జపాన్‌లో జరిగే ఎక్స్ పో-2025లో తెలంగాణ పాల్గొననున్నట్టు కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తరఫున లేఖను ఆయనకు అందజేశారు.