Sridhar Babu: కొట్టినా కేసులు పెట్టొద్దంటే ఎలా?
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:41 AM
అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వంపై నిందలు మోపే కార్యక్రమానికి ఇకనైనా స్వస్తి పలకాలని కౌశిక్‌రెడ్డికి సూచించారు.

కౌశిక్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్య
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ‘తోటి ఎమ్మెల్యేలను తిడతాం, కొడతాం అయినా మామీద కేసులు పెట్టొద్దు, మమ్మల్ని అరెస్టు చేయొద్దు’ అంటే ఎలా అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వంపై నిందలు మోపే కార్యక్రమానికి ఇకనైనా స్వస్తి పలకాలని కౌశిక్‌రెడ్డికి సూచించారు. అసెంబ్లీలో కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ, తన ఇంట్లోకి కొందరు గూండాలు వచ్చి తలుపులు పగలకొట్టారని, పండుగపూట తనను అరెస్టు చేయించారని చెప్పారు. సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరగా, దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు ఘాటుగా స్పందించారు. ఓ సీనియర్ నాయకుడు, మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో ఓ ప్రజాప్రతినిధిపై కౌశిక్‌రెడ్డి దాడి చేశారని చెప్పారు. ఆర్డీఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగానే ప్రివెంటివ్ అరెస్టులు చేస్తామని, గత ప్రభుత్వం లాగా నిర్బంధం చేయబోమని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సబిత మాట్లాడుతూ, ఓడిపోయిన వారికి ప్రొటోకాల్ ఎందుకు ఇస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏడాదిలో 22 మంది పోలీసులు ఆత్మహత్యలు చేసుకున్నారని, పోలీసులకు తరచూ కౌన్సిలింగ్ ఇప్పించాలని ప్రభుత్వానికి సబిత సూచించారు.
ఒకే ప్రాంగణంలో అసెంబ్లీ, మండలి: దుద్దిళ్ల
త్వరలో తెలంగాణ శాసనసభ, శాసన మండలి వ్యవహారాలు ఒకే ప్రాంగణం నుంచి నిర్వహిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శాంతి భద్రతలు, ఇతర అంశాలపై చర్చ సందర్భంగా మంత్రి సమాధానం ఇచ్చారు. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలో శాంతి, భద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. ఎవరో ఒకరిద్దరు చేసే తప్పులకు మొత్తం పోలీస్ శాఖను నిందించడం సరికాదన్నారు. మహిళా భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సైబర్ నేరాల కట్టడిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.