Sridhar Babu: రూపాయి వెనక్కి పోతే.. వంద తెచ్చే దమ్ముంది
ABN , Publish Date - Mar 28 , 2025 | 03:35 AM
తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోయాయన్న ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి శ్రీధర్‌బాబు కొట్టిపారేశారు.

పరిశ్రమలు వెళ్లిపోయాయన్నది అవాస్తవం: శ్రీధర్ బాబు
హైదరాబాద్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోయాయన్న ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి శ్రీధర్‌బాబు కొట్టిపారేశారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో ఒక్క రూపాయి వెనక్కి పోయినా.. వంద రూపాయలు తెచ్చే దమ్ము, ధైర్యం తమ ప్రభుత్వానికి ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి తప్పుబట్టారు. పోర్టు పరంగా అవసరమైన సంస్థలు తెలంగాణకు రావాలనడం సరైంది కాదన్నారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒకటి తర్వాత మరొకటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ ఎన్నికల హామీలు అమలు చేసే.. వచ్చే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని.. లేదంటే తమది కాంగ్రెస్ ప్రభుత్వమే కాదన్నారు. 2014లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది పాలన, ఇప్పటి కాంగ్రెస్ మొదటి ఏడాది పాలనపై బేరీజు వేద్దామా అని ప్రశ్నించారు.