Share News

Srisailam Left Canal Tunnel Collapse: టన్నెల్‌ ప్రమాదం మల్లెల తీర్థం వల్లే

ABN , Publish Date - Mar 26 , 2025 | 04:55 AM

శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌ ప్రమాదానికి మల్లెల తీర్థం జలపాతం కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. జలపాతం నుండి వచ్చిన నీరు గ్రౌటింగ్‌ ద్వారా అడ్డుకోవడం, టన్నెల్‌పైకప్పు కూలడానికి కారణం అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు

Srisailam Left Canal Tunnel Collapse: టన్నెల్‌ ప్రమాదం మల్లెల తీర్థం వల్లే

  • టన్నెల్‌ నుంచి 20 కి.మీ లోపే ఉన్న జలపాతం.. ఒత్తిడి పెరిగి టన్నెల్‌లోకి రావడంతో ప్రమాదం

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ ప్రమాదానికి దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోని మల్లెల తీర్థం జలపాతమే కారణమా? ఆ జలపాతం నీరే టన్నెల్‌లోకి ఊటనీరుగా వెళ్లి సొరంగం పైకప్పును కూల్చిందా? అంటే.. నిపుణులు ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేవాదుల మూడో దశ టన్నెల్‌ను చలివాగు కమ్మేసినట్లుగానే.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను మల్లెల తీర్థం జలపాతం ముంచిందని అనుమానిస్తున్నారు. జలపాతం నుంచి వచ్చే ఊటనీటిని బయటకు పంపకుండా గ్రౌటింగ్‌ ద్వారా అడ్డుకోవడంతో.. ఆ నీరు అంతా ఒక్కచోటకు చేరి టన్నెల్‌ పైకప్పు కూలేందుకు కారణమయిందని అంటున్నారు. వాస్తవానికి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులకు మొదటి నుంచీ ఏదో ఒక రూపంలో ఆటంకం ఎదురవుతూనే ఉంది. దాంతో 2005లో మొదలైన ఈ సొరంగ మార్గం పనులు నేటికీ పూర్తికాలేదు. ఎస్‌ఎల్‌బీసీ పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్‌ స మీపంలోని నాగర్‌కర్నూల్‌జిల్లా దోమలపెంట నుంచి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి దాకా 43.930 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంది. దీనిని రెండు వైపుల నుంచి (ఇన్‌లెట్‌, ఔట్‌లెట్‌) తవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం రెండు టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్‌ (టీబీఎం)లను వినియోగిస్తున్నారు. ఒకటి మన్నెవారిపల్లి నుంచి, ఇంకొకటి దోమలపెంట నుంచి తవ్వుకుంటూ వస్తున్నారు. తవ్వకం పూర్తయ్యాక ఈ యంత్రాలను టన్నెల్‌లోనే పక్కకు తరలించి.. అక్కడే మట్టితో కప్పేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీటిని తీసుకునే ప్రాంతం నుంచి చేపట్టిన ఇన్‌లెట్‌ టన్నెల్‌ను 13.936 కిలోమీటర్లు తవ్వగా, అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి నుంచి 20.436 కిలోమీటర్ల వరకు తవ్వకం పూర్తిచేశారు. మరో 9.56 కిలోమీటర్ల మేర రెండువైపుల నుంచి తవ్వితే టన్నెల్‌ పూర్తవుతుంది.


2019 నుంచి ముందుకు సాగని పనులు..

2019 నుంచి టన్నెల్‌లోకి ఊటనీరు వచ్చిచేరడమే కా కుండా.. మట్టి, రాళ్లు కూలుతుండటంతో సొరంగం తవ్వకం పనులు ముందుకు సాగలేదు. ఊటనీటిని తోడేస్తూ, మట్టిని తొలగించడంతో పాటు ఊటనీరు మళ్లీ రాకుండా, మట్టి, రాళ్లు పడకుండా సిమెంట్‌, పాలియేరిథిన్‌ గ్రౌటింగ్‌ చేయించారు. అయితే ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదానికి ఇదే కారణమయిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీపేజీ (ఊటనీరు)ని గ్రౌటింగ్‌ చేయడంతో.. ఆ నీరు టన్నెల్‌ ఉదర భాగంలో ఒకే ప్రాంతంలో చేరి, ఒత్తిడితో టన్నెల్‌లోకి వచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవానికి దోమలపెంటలోని టన్నెల్‌ నుంచి 20 కిలోమీటర్ల లోపే మల్లెల తీర్థం జలపాతం ఉంది. ఇది వటువర్లపల్లి నుంచి కొద్దిదూరం లోపలికి వెళ్లాక ఉండే సహ జ జలపాతం. ఇక్కడ ఏడాదిలో 365 రోజులూ జలపాతంలో నీళ్లుంటాయి. ఆ నీళ్లన్నీ క్రమంగా శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో కలుస్తాయి. అయితే దోమలపెంట నుంచి లోపలికి 13.95 కిలోమీటర్ల దాకా టన్నెల్‌ తవ్వగా.. అక్కడి నుంచి 4.7 కిలోమీటర్ల దూరంలోనే మల్లెల తీర్థం జలపాతం ఉంది. ఆ జలపాతంలో దూకే నీరే క్రమంగా టన్నెల్‌లోకి వస్తుందని, నిమిషానికి 3వేల లీటర్ల ఊటనీరు రావడం వెనుక కారణం ఇదేనని నిపుణులు గుర్తించారు. ఇప్పటిదాకా శ్రీశైలం జలాశయంలోని నీరే సీపేజీగా మారుతుందని అనుమానించగా.. తాజాగా ఆ నీరు మల్లెల తీర్థం జలపాతం నుంచి వస్తోందని నిర్ధారించారు.


పరిష్కారానికి 3 మార్గాలు..

టన్నెల్‌ తవ్వకం ముందుకు సాగాలంటే.. మూడు పరిష్కార మార్గాలున్నాయని అధికారులు అంటున్నారు. ఇందులో ఒకటి.. వచ్చిన సీపేజీని వచ్చినట్లే తోడి శ్రీశైలం జలాశయంలోకి పంపడం, మరొకటి మల్లెల తీర్థం దిగువన ఒక చెక్‌డ్యామ్‌ లేదా హెడ్‌ను అభివృద్ధి చేసి, ఆ నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా వటువర్లపల్లి పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సాగునీరుగా అందించడం అని పేర్కొంటున్నారు. మరో ప్రత్యామ్నాయం.. టన్నెల్‌లోకి సీపేజీ దిగుతున్న ప్రదేశం నుంచే నీటిని దారిమళ్లించడమని చెబుతున్నారు. వాస్తవానికి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో దోమలపెంట వైపునుంచి లోపలికి 13.6 కిలోమీటర్ల తర్వాత ముందుకెళ్లడం ఏమాత్రం సురక్షితం కాదని, ఏదైనా జరిగే అవకాశం ఉందని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎ్‌సఐ) ఇప్పటికే హెచ్చరించింది. సరి గ్గా టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్‌ 13.6 కిలోమీటర్ల వద్ద ఉన్నప్పుడే సొరంగం పైకప్పు కూలింది. కాగా, దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా మూడో దశలో చలివాగు కిందినుంచి టన్నెల్‌ తవ్వుతుండగా.. చలివాగు నీరంతా టన్నెల్‌లోకి చేరి పలువురు గల్లంతయ్యారు. సరిగ్గా అదే పరిస్థితి శ్రీశైలం టన్నెల్‌లోనూ సంభవించింది.


ఇవి కూడా చదవండి:

ఇది కారు లాంటి గేట్..

Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి

Stock Market Update: స్వల్ప లాభాల్లో గట్టెక్కిన నిఫ్టీ, సెన్సెక్స్ రెడ్ లో బ్యాంక్ నిఫ్టీ

Updated Date - Mar 26 , 2025 | 04:55 AM