Share News

KTR: సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం

ABN , Publish Date - Apr 17 , 2025 | 03:47 AM

కంచ గచ్చిబౌలి భూముల్లో అడవిని పునరుద్ధరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు.

KTR: సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం

  • రేవంత్‌కు జ్ఞానోదయం అవుతుందని ఆశిస్తున్నాం: కేటీఆర్‌

  • కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చెంపపెట్టు: హరీశ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూముల్లో అడవిని పునరుద్ధరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. వన్యప్రాణులను కాపాడాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు రాష్ట్ర చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌కు ఆదేశాలివ్వడం గొప్ప విజయమని బుధవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు పర్యావరణ ప్రేమికులతోపాటు కంచ గచ్చిబౌలి భూముల కోసం పోరాడిన ప్రతి ఒక్కరి విజయమన్నారు. భూముల తనఖా వ్యవహారంలో పదివేల కోట్ల ఆర్థిక మోసం జరిగి ఉండొచ్చన్న కేంద్ర సాధికార కమిటీ సిఫారసులను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. 400 ఎకరాల కంచ గచ్చిబౌలి అటవీ భూముల్ని ప్రైవేట్‌ సంస్థకు తాకట్టు పెట్టడంలో ఆర్థిక మోసం జరిగిందని బీఆర్‌ఎస్‌ చేసిన ఆరోపణలకు సుప్రీంకోర్టు ఆదేశాలతో మరింత బలంచేకూరిందన్నారు. సుప్రీం ఆదేశాలతోనైనా రేవంత్‌రెడ్డికి జ్ఞానోదయం అవుతుందని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని పర్యావరణాన్ని ధ్వంసం చేసి తప్పించుకుందామనుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆటలు ఇకపై సాగవన్నారు. మూగ జీవాల కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమించిన హెచ్‌సీయూ విద్యార్థులు, బోధనా సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వారి అవిశ్రాంత కృషితోనే 400 ఎకరాల అడవిని కాపాడుకోగలిగామన్నారు. 10 వేల కోట్ల తెలంగాణ సంపదను సీఎం దోచుకోవాలనుకున్నారని బీఆర్‌ఎస్‌ చేస్తున్న వాదనలో వంద శాతం నిజం ఉందన్న సంగతి సుప్రీం ఆదేశాలతో తేటతెల్లమైందని చెప్పారు. తెలంగాణ ప్రజలకు, రాష్ట్రంలోని అడవులు, వన్యప్రాణులకు రేవంత్‌రెడ్డి ప్రధాన విలన్‌ అన్న సంగతి మరోసారి రుజువైందని తెలిపారు.


రేవంత్‌కు బుద్ధి చెప్పాలి: హరీశ్‌

కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటివని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం కావాలనే సెలవు దినాల్లో బుల్డోజర్లతో విధ్వంసానికి పాల్పడిందని ఆరోపించారు. విధ్వంసం చేసిన వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని సుప్రీం నిలదీయడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. ప్రభుత్వం చేసిన పర్యావరణ విధ్వంసం ఎంత భయంకరమైందో సర్వోన్నత న్యాయస్థానంలో జరిగిన వాదనల వల్ల ప్రపంచానికి తేటతెల్లమైందని చెప్పారు. వృక్షో రక్షతి రక్షితః అని పెద్దలంటే.. వృక్షో భక్షతి అన్నట్లుగా తయారైన రేవంత్‌కు బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఏకం కావాలని హరీశ్‌ పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

IAS Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్‍కు నోటీసులు.. విషయం ఏంటంటే..

Poisoning In School: విద్యార్థులపై విష ప్రయోగం.. సంచలనం రేపుతున్న ఘటన..

Chandanotsavam 2025: సింహాచలానికి సీఎం చంద్రబాబు వచ్చేది ఆ రోజే: మంత్రి ఆనం..

Updated Date - Apr 17 , 2025 | 03:47 AM