Sangareddy: పాపం.. పిల్లలు..
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:14 AM
ఆ దంపతులకు పదేళ్లలోపు వయసున్న ముగ్గురు పిల్లలున్నారు. రాత్రి చిన్నారులతో కలిసి భోజనం చేసి పడుకున్నారు. తెల్లవారుజామున భార్య కడుపునొప్పి భరించలేక హాహాకారులు చేయగా.. పడుకున్న ముగ్గురు పిల్లలు పడుకున్నట్లుగానే చనిపోయి ఉన్నారు.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ముగ్గురి మృతి
రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన పిల్లలు
తెల్లవారుజామున తల్లికి తీవ్ర అస్వస్థత
ఆస్పత్రిలో చికిత్స.. అప్పటికే పిల్లల మృతి
దారుణానికి విషాహారమే కారణం?
భర్తతో గొడవల నేపథ్యంలో పిల్లలతో కలిసి చనిపోవాలనుకుందని ఊహాగానాలు
భర్తపనేనని బాధితురాలి తరఫు బంధువుల ఆరోపణ
అమీన్‌పూర్, తలకొండపల్లి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ఆ దంపతులకు పదేళ్లలోపు వయసున్న ముగ్గురు పిల్లలున్నారు. రాత్రి చిన్నారులతో కలిసి భోజనం చేసి పడుకున్నారు. తెల్లవారుజామున భార్య కడుపునొప్పి భరించలేక హాహాకారులు చేయగా.. పడుకున్న ముగ్గురు పిల్లలు పడుకున్నట్లుగానే చనిపోయి ఉన్నారు. భర్తకు ఎలాంటి హానీ జరగలేదు. అతడే భార్యను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాడు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. ముగ్గురు పిల్లల మృతికి, తల్లి తీవ్ర అస్వస్థతకు విషాహారమే కారణమా? పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకోవాలనుకుందా? లేదంటే.. ఈ ఘటనలో భర్త ప్రమేయం ఉందా? కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో ఘటనపై ఇలా తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్‌పల్లికి చెందిన అవురిచింతల చెన్నయ్య ఉపాధి కోసం 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లాడు. మొదటి భార్య చనిపోవడంతో 2005లో రజితను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు సాయికృష్ణ (12), గౌతమ్ (8), మధుప్రియ (10) సంతానం. ఈ కుటుంబం అమీన్‌పూర్ రాఘవేంద్రకాలనీలోని అద్దె ఇంట్లో ఉంటోంది. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, రజిత ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేస్తోంది. అయితే రజితపై అనుమానం పెట్టుకున్న చెన్నయ్య ఆమెతో తరచూ గొడవ పడేవాడు. అతడి వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
పెద్దలు నచ్చజెప్పడంతో చెన్నయ్య, రజిత మళ్లీ ఒక గూటికింద చేరారు. భర్త తనను మళ్లీ వేధిస్తే.. పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని అప్పట్లోనే రజిత హెచ్చరించినట్లు తెలిసింది. గురువారం రాత్రి 8 గంటలకు చెన్నయ్య, రజిత.. పిల్లలతో కలిసి భోజనం చేశారు. రజిత, పిల్లలు పెరుగన్నం తినగా, చెన్నయ్య పప్పుతో భోజనం చేశాడు. అనంతరం వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్‌ను తీసుకుని చెన్నయ్య చందానగర్ వెళ్లి, రాత్రి 11గంటలకు ఇంటికి వచ్చి పడుకున్నాడు. తెల్లవారు జామున 3 గంటలకు రజిత కడుపునొప్పి అంటూ నిద్రలేచి.. బిగ్గరగా రోదించడంతో చెన్నయ్య, ఇరుగుపొరుగు వారి సహకారంతో ఆమెను ఆస్పత్రికి తరలించాడు. అయితే.. ఇంట్లో అప్పటికే ముగ్గురు పిల్లలు నిద్రలోనే ప్రాణాలు విడిచారు. ఇంట్లో పెరుగన్నం, ఇతర ఆహార పదార్థాలను క్లూస్ టీం సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపింది. నివేదిక వచ్చాక.. వాస్తవాలు తెలుస్తాయని, తల్లిదండ్రుల్లో ఎవరు దారుణానికి పాల్పడ్డారనేది విచారణలో తేలాల్సి ఉందన్నారు. రజిత తల్లిదండ్రులు, బంధువులు చెన్నయ్యపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ చెప్పారు. ఆ రోజు రాత్రి చెన్నయ్య పెరుగన్నం తినకపోవడంపైనా, రాత్రి పదకొండింటికి ఇంటికొచ్చి నురగలు కక్కుకున్న స్థితిలో విగతజీవులుగా పడివున్న పిల్లలను గమనించకుండానే నిద్రకు ఉపక్రమించడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చెన్నయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..
కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి టులెట్ బోర్డు..
Read Latest Telangana News And Telugu News