Share News

TG Budget: 19న రాష్ట్ర బడ్జెట్‌

ABN , Publish Date - Mar 13 , 2025 | 04:36 AM

రాష్ట్ర శాసన సభా బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 27 వరకు.. 12 రోజులపాటు జరగనున్నాయి. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించి, సమావేశాలను ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

TG Budget: 19న రాష్ట్ర బడ్జెట్‌

  • 27 వరకు అసెంబ్లీ మొత్తం 12 పని దినాలు

  • నేడు, 15న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు, చర్చ

  • 17, 18 తేదీల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులు

  • చర్చించి ఆమోదించనున్న సభ 21, 22న బడ్జెట్‌పై చర్చ

  • ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదంతో 27న ముగింపు

  • సమావేశాల్ని మరో 4 రోజులు పొడిగించాలన్న బీఆర్‌ఎస్‌

  • 15 రోజులు నడపాలన్న బీజేపీ

హైదరాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసన సభా బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 27 వరకు.. 12 రోజులపాటు జరగనున్నాయి. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించి, సమావేశాలను ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసన సభా వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశం బుధవారం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సభావ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, విపక్ష పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మజ్లిస్‌ పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. బుధవారం గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ వెంటనే.. మధ్యాహ్నం బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సమావేశాలను ఈ నెల 27 వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. అంటే... బుధవారం గవర్నర్‌ ప్రసంగంతో కలుపుకొని సభ 12 రోజుల పాటు పని చేసినట్లవుతుంది.


తేదీల వారీగా సభలో కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈ నెల 13న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. 14న హోలీ పండుగ సందర్భంగా సభకు సెలవు ఉంటుంది. తిరిగి 15న సభ సమావేశమవుతుంది. ఆ రోజు కూడా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. రెండ్రోజులు జరిగే ఈ చర్చలో అధికార కాంగ్రెస్‌ పార్టీతోపాటు విపక్ష సభ్యులకు కూడా మాట్లాడే అవకాశం కల్పిస్తారు. అనంతరం గవర్నర్‌ ప్రసంగంపై జరిగిన చర్చకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానమిస్తారు. ఆయన అదే రోజు ఢిల్లీకి వెళ్తారు. 16న ఆదివారం సభకు సెలవు. 17న ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో.. విద్య, ఉద్యోగాల్లో 42ు రిజర్వేషన్లకు సంబంధించిన మరో రెండు బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెడుతుంది. అదే రోజు ఈ బిల్లులపై చర్చను ప్రారంభిస్తారు. 18న కూడా ఈ బిల్లులపై చర్చను జరిపి.. అదే రోజు ఆమోదిస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2025-26) సంబంధించి బడ్జెట్‌ను 19వ తేదీన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెడతారు. మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఉభయ సభలు ఆ రోజుకు వాయిదా పడతాయి. 21, 22 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. 24, 25, 26 తేదీల్లో వివిధ శాఖల బడ్జెట్‌ పద్దులపై చర్చ జరుగుతుంది. 27న తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లును సభ ఆమోదిస్తుంది. ఆ రోజుతో సమావేశాలు ముగుస్తాయి.


బడ్జెట్‌పై 5 రోజులేనా?

  • మహేశ్వర్‌రెడ్డి

బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై సభలో చర్చించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. బడ్జెట్‌, పద్దులపై చర్చించడానికి కేవలం ఐదు రోజులే కేటాయించారని, అలాగైతే బడ్జెట్‌పై కూలంకషంగా మాట్లాడే అవకాశం సభ్యులకు రాదని అభిప్రాయపడ్డారు. సభను అధికారపక్షం పూర్తిగా బుల్డోజ్‌ చేస్తోందని, బడ్జెట్‌ సమావేశాలను కనీసం 15 రోజుల పాటైనా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 13 , 2025 | 04:36 AM