Share News

Caste Survey: వివరాలివ్వని వారికి మళ్లీ కులగణన

ABN , Publish Date - Feb 13 , 2025 | 03:28 AM

సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల (సమగ్ర ఇంటింటి కుటుంబ) సర్వే విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకు నిర్వహించిన సర్వేలో మిగిలిపోయిన 3.1 శాతం కుటుంబాల కోసం మరోమారు సర్వే చేపట్టాలని నిర్ణయించింది.

Caste Survey: వివరాలివ్వని వారికి మళ్లీ కులగణన

మిగిలిపోయిన 3.1% కుటుంబాల కోసం ఈ నెల 16 నుంచి 28 వరకు ఇంటింటి సర్వే

  • ఆన్‌లైన్‌, ఎంపీడీవో వద్ద, టోల్‌ఫ్రీ నంబర్‌

  • 3 మార్గాల ద్వారా వివరాల నమోదు!

  • వచ్చేనెల అసెంబ్లీ ప్రత్యేక భేటీలో బీసీ బిల్లు

  • సీఎం వద్ద సమీక్షలో ప్రభుత్వం నిర్ణయం

  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం

  • బిల్లును ఆమోదించి.. కేంద్రానికి పంపిస్తాం

  • పార్లమెంటులో ఆమోదించేలా ఒత్తిడి

  • బృందంగా వెళ్లి ప్రధానిని కలుస్తాం: భట్టి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల (సమగ్ర ఇంటింటి కుటుంబ) సర్వే విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకు నిర్వహించిన సర్వేలో మిగిలిపోయిన 3.1 శాతం కుటుంబాల కోసం మరోమారు సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి 28 వరకు ఈ సర్వేను చేపట్టనుంది. సర్వే పూర్తయిన తర్వాత బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందనుంది. దీనికి ముందు క్యాబినెట్‌ ఆమోదం కూడా తీసుకోనుంది. ఈ బిల్లు ఆమోదం కోసం మార్చి మొదటి వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం తర్వాత బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించి, పార్లమెంటులో ప్రవేశపెట్టేలా ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి విజ్ఞప్తి చేయనుంది. కేంద్రంలోని ఇతర రాజకీయ పార్టీలు, రాష్ట్ర అసెంబ్లీలోని పార్టీల మద్దతును కూడగట్టనుంది. బిల్లుకు చట్టబద్ధత కల్పించాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నామని, మార్చి మొదటి వారంలో ఇంటింటి సర్వే వివరాలను సంపూర్ణంగా ప్రకటిస్తామని తెలిపింది.


బుధవారం ఉదయం స్థానిక సంస్థల ఎన్నికలపై కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసుకోవడం, పార్లమెంటుకు బిల్లును పంపడం వంటి పలు అంశాలపై చర్చించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త గ్రామపంచాయతీలు ఏర్పడినందున ఆయా చోట్ల బీసీలకు ఏవైనా రిజర్వేషన్లు పెరిగాయా? అని అధికారులను అడిగారు. అయితే హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మునిసిపాలిటీల్లో విలీనం కావడంతో బీసీలకు కేటాయించిన పంచాయతీల సంఖ్య పెరగలేదని వారు బదులిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీలకు ఎక్కువ శాతం రిజర్వేషన్లు ఎలా ఇవ్వగలిగారని సీఎం ప్రశ్నించగా.. ఉమ్మడి రాష్ట్రంలో చివరి స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చే నాటికి రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలు అమల్లో లేవని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం ఉన్నతాధికారులందరినీ బయటకు పంపి.. సీఎం, మంత్రులు, సలహాదారులు మాత్రమే సుమారు రెండున్నర గంటలపాటు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


మిగిలిపోయిన వారి కోసమే సర్వే..

ఇంటింటి సర్వేలో మిగిలిపోయిన 3.1 శాతం కుటుంబాల కోసమే మరోసారి సర్వే చేయనున్నామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రకటించారు. కులగణనలో వివరాలు ఇచ్చేందుకుగాను వారికి మూడు రకాల మార్గాలను సూచిస్తున్నామని తెలిపారు. మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) వద్ద గానీ, ఆన్‌లైన్‌లోగానీ, టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా గానీ వివరాలను నమోదు చేసుకోవచ్చునని అన్నారు. సీఎం సమీక్ష అనంతరం వివరాలను మంత్రి పొన్నంతో కలిసి డిప్యూటీ సీఎం మీడియాకు వివరించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఇంటింటి సర్వే 2024 నవంబరు 6న ప్రారంభమై డిసెంబరు 25న ముగిసింది. హౌస్‌ లిస్టింగ్‌ చేసిన మొత్తం 1,15,71,457 కుటుంబాలకుగాను 1,12,15,134 కుటుంబాల (96.9ు)ను సర్వే చేయడం జరిగింది. ఇంకా 3.1 శాతం (3,56,323) కుటుంబాలను సర్వే చేయలేదు. ఈ 3.1 శాతం కుటుంబాల కోసం ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి సర్వేను చేపడుతున్నాం’’ అని భట్టివిక్రమార్క వివరించారు. ఇప్పటికే ఈ సర్వేపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో లెక్కలతో సహా వివరించారని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలు, రాష్ట్రంలోని కొన్ని బీసీ సంఘాలు పలు రకాల సలహాలు, సూచనలు ఇచ్చాయన్నారు. ప్రభుత్వం ఈ సర్వేను చాలా శాస్త్రీయంగా, సహేతుకంగా చేసిందని తెలిపారు. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా లెక్కలు తీసి, శాసనసభలో పెట్టామన్నారు. 3.1 శాతం గృహాల సర్వే జరగకపోవడానికి కారణాలను కూడా వివరించామన్నారు. ‘‘కొంత మంది తమ వివరాలు ఇవ్వడానికి ఉద్దేశపూర్వకంగా ముందుకు రాలేదు. కొందరు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లారు. ఇలాంటి కారణాల వల్ల 3.1 శాతం కుటుంబాలు మిగిలిపోయాయి. కేసీఆర్‌, కేటీఆర్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వంటివారు సర్వేకు సహకరించలేదు. అయినా.. అలాంటివారి కోసం మరోసారి అవకాశం ఇవ్వొచ్చు కదా! అని శాసనసభలో అడిగారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం.. ఆ మిగిలిన 3.1ు కుటుంబాలకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. కేసీఆర్‌, కేటీఆర్‌ సహా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు జనాభా లెక్కల్లోకి వచ్చేటట్లు చూసుకొని జనజీవన స్రవంతిలోకి వస్తే మంచిదని చెబుతున్నాం. తప్పిపోయినవారు తిరిగి నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని భట్టివిక్రమార్క అన్నారు.

  • కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణపై రేపు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

  • టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహణ

  • హాజరు కానున్న సీఎం రేవంత్‌రెడ్డి

కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌ నేతలకు అవగాహన కోసం శుక్రవారం గాంధీభవన్‌లోని ప్రకాశం హాల్లో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. మంత్రి ఉత్తమ్‌ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఈ ప్రజెంటేషన్‌ ఇవ్వనుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆఫీస్‌ బేరర్లు, ముఖ్యనాయకులు పాల్గొననున్నారు.


అందరూ మద్దతు తెలపాలి..

బీసీల చిరకాల వాంఛ అయిన 42 శాతం రిజర్వేషన్లను కల్పించడమే తమ ముందున్న లక్ష్యమని డిప్యూటీ సీఎం తెలిపారు. ఓబీసీలకు మేలు జరగకూడదని కుట్ర చేసేవారికి కూడా స్పష్టంగా చెబుతున్నామని, రాజకీయాలను పక్కన పెట్టి మద్దతు తెలపాలని కోరారు. మేఽధావులు, రాజకీయ నేతలు, ప్రగతిశీల భావాలు కలిగిన వారందరూ కలిసి రావాలని, సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. 56 శాతం ఉన్న ఓబీసీల కోరిక బలమైనదని, వారికీ న్యాయం చేయడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఈ విషయంలో తాము తప్పకుండా విజయం సాధిస్తామన్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా 50 శాతానికి పైగా ఉన్న ప్రజల ఆలోచనల్ని మన్నించాల్సిందేనన్నారు. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిందిగా దేశంలోని రాజకీయ నేతలను కలిసి కోరతామని చెప్పారు. మార్చి మొదటి వారంలో కులగణనకు సంబంధించి సంపూర్ణ సమాచారాన్ని ప్రకటిస్తామని తెలిపారు. కొంత మంది నాయకులు రీసర్వే చేయాలని కోరుతున్న విషయాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకురాగా.. దేశమంతా కులగణన జరగాలని తాము కోరుకుంటున్నామన్నారు.కానీ, దేశమంతా చేయాల్సి వస్తుందేమోనని భయపడేవాళ్లే రీసర్వే కోరుతున్నారని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సర్వేలో పాల్గొననివారు ఇది తప్పుడు సర్వే అంటున్నారని విమర్శించారు. బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటే... సర్వేలో పాల్గొననివాళ్లు ఇప్పటికైనా పాల్గొనాలని సూచించారు.


మార్చి మొదటి వారంలో శాసనసభ భేటీ

కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను మార్చి మొదటి వారంలో అమలు చేయాలన్న దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ లెక్కలను మొదట క్యాబినెట్‌లో ఆమోదించి, శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదింపజేస్తామన్నారు. దీని కోసం మార్చి మొదటి వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. బీసీలు, ఓబీసీలకు రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బలహీనవర్గాల వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బిల్లును అసెంబ్లీలో ఆమోదించడమే కాకుండా.. కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. పార్లమెంటులో కూడా బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో తమ పార్లమెంటు సభ్యుల సహాయ సహకారాలతో ఒక ప్రతినిధి బృందంగా ప్రధానిని కలుస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఇతర పెద్దలను, పార్లమెంటులోని అన్ని రాజకీయ పార్టీల నేతలను కలుస్తామని, వారందరి మద్దతు కూడగడుతామని చెప్పారు. పార్లమెంటులో కూడా ఈ బిల్లును పాస్‌ చేయించుకుని, పూర్తి చట్టబద్ధత కల్పించేలా ప్రక్రియను మొదలు పెడుతున్నామని వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ములుగు మన్నెంలో జాతరల సందడి

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు రద్దు

మేడారం మినీజాతర.. మొక్కులు చెల్లించకోనున్న భక్తులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 13 , 2025 | 03:28 AM