Share News

CAG Report: ఆదాయం 2, వ్యయం 1.97

ABN , Publish Date - Apr 17 , 2025 | 05:10 AM

2024-25 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల రాబడుల కింద రూ.2,00,632.26 కోట్లు వచ్చాయి. అలాగే, అన్ని పద్దుల కింద ప్రభుత్వం రూ.1,97,066,32 కోట్లు ఖర్చు చేసింది.

CAG Report: ఆదాయం 2, వ్యయం 1.97

  • రాష్ట్ర వ్యయం రూ.1.97 లక్షల కోట్లు

  • రాబడి రూ.2 లక్షల కోట్లు

  • 130 శాతం మేర మార్కెట్‌ రుణాలు

  • ‘కాగ్‌’ ఫిబ్రవరి నివేదిక విడుదల

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): 2024-25 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల రాబడుల కింద రూ.2,00,632.26 కోట్లు వచ్చాయి. అలాగే, అన్ని పద్దుల కింద ప్రభుత్వం రూ.1,97,066,32 కోట్లు ఖర్చు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలకు సంబంధించి ఫిబ్రవరి నెల నివేదికను కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) బుధవారం విడుదల చేసింది. 2024- 25కి గాను ప్రభుత్వం రూ. 2,91,159 కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభుత్వ పథకాలు, వడ్డీ చెల్లింపులు, ఉద్యోగుల జీత భత్యాలు, పెన్షన్లు, సబ్సిడీల వ్యయంతోపాటు మూలధన వ్యయం కలిపి మొత్తం రూ.2,54,431.31 కోట్లను ఖర్చు చేస్తామని పేర్కొంది. అయితే, ఫిబ్రవరి నాటికి రూ. 1,97,066.32 కోట్లను ఖర్చు చేసింది. 2023-24 బడ్జెట్‌లో ఇదే ఫిబ్రవరి నాటికి రూ.75.18 శాతం మేర నిధులను ప్రభుత్వం ఖర్చు చేసింది. అంటే.. 2023-24తో పోలిస్తే వ్యయం లో 2.27 శాతం మేర వృద్ధి నమోదైంది. కాగా, ఈ 1.97 లక్షల కోట్లలో పథకాల కోసం రూ.73,455.82 కోట్లు, వడ్డీ చెల్లింపులకు రూ.24,078.06 కోట్లు, జీత భత్యాలకు రూ.38,962.53 కోట్లు, పెన్షన్లకు రూ.15,480.84 కోట్లు, సబ్సిడీలకు రూ.12,291.60 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. మూలధన వ్యయం కింద రూ.33,486.50 కోట్లను ఖర్చు చేస్తామని అంచనా వేయగా ఫిబ్రవరి నాటికి అందులో 97.58 శాతం రూ.32,797.47 కోట్లు వ్యయం చేసింది. 2024-25లో మొత్తం వ్యయం రూ.2.20 లక్షల కోట్ల మేర ఉంటుందని సీఎం ఇదివరకే ప్రకటించారు. అలాగే, 2025-26 బడ్జెట్‌ ప్రకటన సందర్భంలో 2024-25 బడ్జెట్‌ రూ.2,91,159 కోట్ల ను రూ. 2,65,934.51 కోట్లకు ప్రభుత్వం సవరించింది. మార్చి వివరాలు వెలువడితే లెక్కలు తేలుతాయి.


రాబడులు రూ.2 లక్షల కోట్లు

2024-25 ఏడాదిలో ఫిబ్రవరి నాటికి అన్ని రకాల రాబడుల కింద ప్రభుత్వానికి రూ.2,00,632.26 కోట్లు వచ్చాయి. ప్రతిపాదిత రాబడులు రూ.2,74,057.64 కోట్లలో ఇది 73.21 శాతం. ఇందులో రెవెన్యూ రాబడుల కింద రూ.1,36,136.01 కోట్లు, వస్తు సేవల పన్నులు రూ.46,440.07 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల కింద రూ.7,033.38 కోట్లు, అమ్మకం పన్ను కింద రూ.29,238.45 కోట్లు, ఎక్సైజ్‌ సుంకాల కింద రూ.16,808.29 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.17,243.22 కోట్లు, ఇతర పన్నులు, సుంకాల కింద రూ.7,290.14 కోట్లు ఉన్నాయి. పన్నేతర రాబడి కింద రూ.6,071.98 కోట్లు సమకూరాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద రూ.6,009.65 కోట్లు వచ్చాయి. మూలధన రాబడుల్లో భాగంగా రూ.49,255.41 కోట్ల మేర మార్కెట్‌ రుణాలను తీసుకుంటామని ప్రభుత్వం అంచనా వేయగా రూ.64,456.79 కోట్ల అప్పులు తీసుకున్నది. ఇది ప్రతిపాదిత అప్పులో 130.86 శాతం కావడం గమనార్హం.

Updated Date - Apr 17 , 2025 | 05:10 AM