High Court: ఎల్పీజీ కంపెనీల కొత్త ‘బదిలీ విధానం’పై స్టే
ABN , Publish Date - Apr 06 , 2025 | 05:53 AM
అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఉమ్మడి పంపిణీ ఒప్పందం తయారు చేయాలని సూచిస్తూ విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): ఎల్పీజీ కంపెనీలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లు ఫిబ్రవరి 21న జారీ చేసిన ‘వినియోగదారుల బదిలీ-మార్కెట్ పునర్‌వ్యవస్థీకరణ పాలసీ’పై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. 40 లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న నగరాల్లో గ్యాస్ సిలిండర్ల రీఫిల్లింగ్‌ను గరిష్ఠ పరిమితి 20 వేలు, కనిష్ఠ పరిమితి 10 వేలుగా నూతన విధానంలో నిర్దేశించారని, ఇది తమకు ఆమోదయోగ్యం కాదంటూ గౌలిపురాకు చెందిన శ్రీనివాస ఎంటర్‌ప్రైజెస్ సహా 33 గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై జస్టిస్ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ నూతన పాలసీ వల్ల డిస్ట్రిబ్యూటర్లు వినియోగదారులను కోల్పోవాల్సి వస్తుందని, భారీగా పెట్టుబడులు పెట్టిన వారికి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఇదే అంశంపై బాంబే హైకోర్టు ఇప్పటికే స్టే ఇచ్చినందున ప్రస్తుత పిటిషన్‌పై సైతం మధ్యంతర స్టే ఇస్తున్నట్లు ప్రకటించింది. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఉమ్మడి పంపిణీ ఒప్పందం తయారు చేయాలని సూచిస్తూ విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.