నేటి నుంచి ఎప్‌సెట్ హాల్‌టికెట్లు
ABN , Publish Date - Apr 19 , 2025 | 05:32 AM
తెలంగాణ ఎప్‌సెట్-2025 అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులు శనివారం(19వ తేదీ) నుంచి హాల్‌టికెట్లను జేఎన్టీయూ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సంబంధిత అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఎప్‌సెట్-2025 అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులు శనివారం(19వ తేదీ) నుంచి హాల్‌టికెట్లను జేఎన్టీయూ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులు ఈ నెల 22 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్షలు రాసే అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షాకేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ నెల 29, 30వ తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్, మే 2 నుంచి 4వ తేదీ వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జేఎన్టీయూలో యూనివర్సిటీ రెక్టార్, ఎప్‌సెట్ కో కన్వీనర్ డాక్టర్ విజయకుమార్ రెడ్డి విలేకర్లతో మాట్లాడారు.
పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయని ఉదయం సెషన్ 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తామని. ప్రతి సెషన్‌కు 90 నిమిషాల ముందే అభ్యర్థులను పరీక్షాకేంద్రాల్లోకి ఆనుమతిస్తామని చెప్పారు. అభ్యర్థులు ఎంచుకున్న జోన్ పరిధిలోనే పరీక్షాకేంద్రాలను కేటాయించామని, పరీక్షాకేంద్రాల లొకేషన్‌ను తెలుసుకునేందుకు వీలుగా అభ్యర్థుల హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించామని చెప్పారు. ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు ఈ నెల 24 వరకు ఆలస్య రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. హాల్‌టికెట్లలో వివరాలు ఏవైనా తప్పుగా నమోదైతే అభ్యర్థులు వీలైనంత త్వరగా ఎప్‌సెట్ ఆఫీసుకు మెయిల్ ద్వారా సమాచార ం పంపి అప్‌డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.