Sridhar Babu: 2లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం
ABN , Publish Date - Mar 25 , 2025 | 04:38 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పారిశ్రామిక, ఐటీ రంగంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని ఆ శాఖ మంత్రి దుద్దిశ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

అవన్నీ త్వరలోనే వాస్తవరూపం దాలుస్తాయి.. యువతకు 91 వేల ఉద్యోగాలు లభిస్తాయి
బీఆర్‌ఎస్ హయాంలో పడిపోయిన ఐటీ ఎగుమతులు.. మేం వచ్చాక పెరిగాయి
మూసీ సుందరీకరణ కాదు.. పునరుజ్జీవం
శాసనసభలో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, మార్చి 24, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పారిశ్రామిక, ఐటీ రంగంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని ఆ శాఖ మంత్రి దుద్దిశ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. అవన్నీ వాస్తవరూపం దాల్చనున్నాయని, ఫలితంగా దాదాపు 91 వేల ఉద్యోగాలు కల్పించనున్నామని చెప్పారు. టీజీ-ఐపాస్ గణాంకాల ప్రకారం ఇప్పటికే కొత్తగా 2,332 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్నారు. వీటి ద్వారా రూ.23,608 కోట్ల పెట్టుబడులు రాగా, 69,900 ఉద్యోగ అవకాశాలు అభిస్తాయని పేర్కొన్నారు. సోమవారం శాసనసభలో పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖలకు సంబంధించి చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ఐటీ ఎగుమతులు 31 శాతం నుంచి 11 శాతానికి పడిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎగుమతులు ఎంత ఉన్నాయనేది త్వరలో రాబోయే ప్రగతి నివేదికలో తెలుస్తుందన్నారు. ప్రస్తుతం ఐటీ ఎగుమతులు 26 శాతంగా ఉన్నాయని వెల్లడించారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ఏడాదిలో రూ.36 వేల కోట్ల పెట్టుబడులతో దాదాపు 140కి పైగా కొత్త ప్రాజెక్టులను ఆకర్షించామని తెలిపారు. వీటిలో రూ.17 వేల కోట్లతో పలు ఫార్మా సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నామని చెప్పారు.
కలెక్టర్‌ను చంపాలనుకున్నారు
రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని తాము ప్రయత్నిస్తుంటే.. బీఆర్‌ఎస్ వాళ్లు మాత్రం కలెక్టర్‌నే చంపించేందుకు ప్రయత్నించారని మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. మూసీపై తమ ప్రభుత్వం చేపట్టిందని సుందరీకరణ కాదని, పునరుజ్జీవం అని చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 11 జిల్లాల్లోని 72 గ్రామాలను కలిపి హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరించామని మంత్రి తెలిపారు. ఇక మెట్రో రైల్ రెండో దశ డీపీఆర్‌ను కేంద్రం అనుమతి కోసం పంపామన్నారు. ఇక మునిసిపల్ శాఖ ద్వారా జీఐఎస్ హబ్‌ను నెలకొల్పామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. దీని ద్వారా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆస్తులు, సమగ్ర బేస్ రిపోర్టు, ఇంటింటి సర్వే నిర్వహించనున్నామన్నారు. నగరంలో ఆధునిక లైటింగ్ వ్యవస్థను, ఆధునిక టెక్నాలజీతో కూడిన సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు తెలిపారు. రూ.17,212 కోట్ల వ్యయంతో నగరంలో 7,444 కి.మీ మేర మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటుకు సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేశామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. రూ.1,964 కోట్లతో గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్టు-1ని ప్రారంభించడం, రూ.1,700 కోట్లతో జీహెచ్‌ఎంసీ పరిధిలో నీటి సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. రూ.1,500 కోట్లతో రాష్ట్రంలో మిస్సింగ్ లింకు రహదారులను నిర్మించనున్నట్టు తెలిపారు. వరంగల్ అభివృద్ధి కోసం కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.
మునిసిపాలిటీల ఏర్పాటు బిల్లుల ఆమోదం
ములుగు జిల్లాలో ములుగు, ఖమ్మం జిల్లాలో కల్లూరు, మేడ్చల్ జిల్లాలోని అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపల్లి, కామారెడ్డి జిల్లాలోని బిచ్కుందను కలిపి మొత్తం 6 కొత్త మునిపాలిటీలను ఏర్పాటు చేసే బిల్లును శాసనసభ సోమవారం ఆమోదించింది. దీంతోపాటు కొత్తగూడెం నగరపాలక సంస్థను ఏర్పాటుచేసే బిల్లుకూ ఆమోదం తెలిపింది. మరోవైపు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని 12,848 గ్రామ పంచాయతీల్లో నుంచి 79 పంచాయతీలను తొలగించి మునిసిపాలిటీల్లో కలిపే బిల్లునూ ఆమోదించింది.
రియల్ ఎస్టేట్ కంపెనీలా ఐఐసీ: ఏలేటి
టీజీఐఐసీ రియల్ ఎస్టేట్ కంపెనీలా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రభుత్వం ఎంచుకున్న మార్గమేంటో తెలియడంలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సుమారు 6లక్షల పెళ్లిళ్లయ్యాయని, వారందరికీ తులం బంగారం ఎప్పుడిస్తారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు నిర్వహించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కోరారు.