Share News

Pochampally: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో చేనేత అందం!

ABN , Publish Date - Apr 19 , 2025 | 04:47 AM

హైదరాబాద్‌ వేదికగా జరగనున్న 72వ ప్రపంచ అందాల పోటీలను తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే వేదికగా ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Pochampally: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో చేనేత అందం!

తెలంగాణ చేనేత కళను ప్రపంచానికి చాటేందుకు ప్రభుత్వం కసరత్తు

  • పోటీల్లో రాష్ట్ర చేనేత వస్త్రాలను ధరించనున్న సుందరీమణులు

  • పోచంపల్లికి పోటీదారులు, ఐరోపా దేశాల ప్రతినిధులు

  • పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మే 15న పర్యటన

  • గొల్లభామ కాటన్‌, గద్వాల్‌ సిల్క్‌, నారాయణపేట వస్త్రాల ప్రదర్శన

  • యాదగిరిగుట్టకు మరో బృందం.. అతిథులకు బహుమతులుగా చేనేత వస్త్రాలు

హైదరాబాద్‌, యాదాద్రి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ వేదికగా జరగనున్న 72వ ప్రపంచ అందాల పోటీలను తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే వేదికగా ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా తెలంగాణ చేనేత వస్త్రాలను ఫ్యాషన్‌ ప్రపంచానికి మరింత చేరువ చేసి.. నేతన్నలకు అండగా నిలిచేందుకు ప్రణాళికలు చేస్తోంది. ఇందులో భాగంగా ఫ్యాషన్‌ ప్రపంచానికి ప్రతీకగా నిలిచే ఐరోపా దేశాల ప్రతినిధులతో పోచంపల్లి వస్త్రాలను ధరింప చేసి.. ఆ వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని అనుకుంటుంది. మే 7 నుంచి 31 వరకు జరిగే అందాల పోటీల్లో 140 దేశాల నుంచి పోటీదారులు పాల్గొంటారు. అందాల పోటీల ప్రారంభ, ముగింపు వేడుకలతోపాటు గ్రాండ్‌ ఫినాలే హైదరాబాద్‌లోనే జరగనున్నాయి. అయితే, ఈ పోటీలకు వచ్చే ఐరోపా దేశాల ప్రతినిధులు, పలువురు పోటీదారులను రాష్ట్ర ప్రభుత్వం మే 15న పోచంపల్లికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. వారితో పోచంపల్లి చేనేత వస్త్రాల ధరింప చేసి, వాటిని ప్రమోట్‌ చేయించాలని అనుకుంటుంది. ఇందుకోసం పోచంపల్లి చేనేత కళాకారులతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించనుంది. స్థానిక చేనేత కళపై అతిథులకు అవగాహన కల్పించడమే కాక ఆయా వస్త్రాల ప్రత్యేకతలను తెలియజేయనుంది. ఆ ప్రతినిధులు స్థానిక చేనేత కళాకారులతో మాట్లాడడానికి భాషాపరమైన సమస్యలు లేకుండా ట్రాన్స్‌లేటర్లను కూడా సిద్ధం చేస్తుంది. అలాగే, గద్వాల్‌ సిల్క్‌, సిద్దిపేట దగ్గరలోని గొల్లభామ కాటన్‌, నారాయణపేట వస్త్రాలకు సంబంధించిన స్టాల్స్‌ను కూడా పోచంపల్లిలో ఏర్పాటు చేస్తుంది. పోచంపల్లి పర్యటనకు వచ్చిన వారంతా ఈ స్టాల్స్‌ను కూడా సందర్శిస్తారు. ఆయా స్టాల్స్‌లో ప్రదర్శించే వస్త్రాల విశేషాలు కూడా విదేశీయులకు అర్థమయ్యేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ పర్యటన అంతా రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరగనుండగా.. విదేశీ అతిథుల కోసం పోచంపల్లిలో తెలంగాణ జానపద కళా ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.


పోటీల్లో చేనేత థీమ్‌ !

మిస్‌ వరల్డ్‌-2025 పోటీల్లో చేనేత థీమ్‌ ప్రత్యేకంగా నిలవనుంది. పోటీలో భాగంగా నిర్వహించే ఫ్యాషన్‌ రౌండ్‌, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాల్లో పోటీదారులు తెలంగాణ చేనేత వస్ర్తాలను ధరించనున్నారు. ఇందుకోసం సంప్రదాయ, ఆధునిక డిజైన్‌ల కలయికగా చేనేత వస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. అలాగే, మిస్‌ వరల్డ్‌ టాప్‌ మోడల్‌ అండ్‌ ఫ్యాషన్‌ ఫినాలేలో కూడా చేనేత వస్త్రాలను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.


చేనేత వస్త్రాలు ధరించి నృసింహుడి దర్శనం

ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొనే వివిధ దేశాల ప్రతినిధులతో కూడిన ఓ బృందం యాదగిరిగుట్టపై ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనుంది. ఆ బృందమంతా చేనేత వస్త్రాలు ధరించి స్వామివారిని దర్శించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతేకాక, అతిథులకు బహుమతిగా కూడా చేనేత వస్త్రాలనే ప్రభుత్వం బహుకరించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా చేనేత వస్త్రాలను తయారు చేయిస్తుంది. కాగా, పోచంపల్లి వెళ్లే యూరప్‌ బృందం, యాదగిరిగుట్టకు వెళ్లే మరో ప్రతినిధి బృందం ధరించే చేనేత వస్త్రాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా వీడియో ఆల్బమ్‌ రూపొందిస్తుంది. ఈ చర్యల ద్వారా తెలంగాణ చేనేత కళకు మరింత ప్రాచుర్యం లభించి నేతన్నకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వ ఆలోచన.

Updated Date - Apr 19 , 2025 | 04:47 AM