Share News

Nizamabad: అడవి పందుల వేటకు వెళ్లి... విద్యుదాఘాతానికి ముగ్గురి బలి

ABN , Publish Date - Feb 21 , 2025 | 05:16 AM

నిజామాబాద్‌ జిల్లాలో ఘోరం జరిగింది. అడవి పందుల వేటకు వెళ్లిన ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డారు.

Nizamabad: అడవి పందుల వేటకు వెళ్లి... విద్యుదాఘాతానికి ముగ్గురి బలి

  • దంపతులు, కుమారుడి మృత్యువాత

  • నిజామాబాద్‌ జిల్లాలో ఘటన

బోధన్‌రూరల్‌/కోటగిరి/రెంజల్‌, ఫిబ్రవరి20 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌ జిల్లాలో ఘోరం జరిగింది. అడవి పందుల వేటకు వెళ్లిన ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డారు. నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం సాటాపూర్‌ గ్రామానికి చెందిన ఓర్సు గంగారాం(45)కు బాలమణి (40), శీల అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య బాలమణికి కుమారులు కిషన్‌ (21), ప్రవీణ్‌, కుమార్తె యశోద ఉన్నారు. అడవి పందుల వేట ఈ కుటుంబ జీవనాధారం. అయితే, గంగారాం, తన భార్య బాలమణి, కుమారుడు కిషన్‌తో కలిసి గురువారం తెల్లవారుజామున బోధన్‌ మండలంలోని పెగడాపల్లి గ్రామ శివారులోని ఓ పొలంలోకి వేటకు వెళ్లాడు. అక్కడ ఓ విద్యుత్‌ తీగను తాకి షాక్‌కు గురై ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. తెల్లవారిన తర్వాత పొలానికి వచ్చిన సదరు పొలం యజమాని ప్రకాశ్‌రావు మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌, రూరల్‌ సీఐ విజయ్‌ బాబు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కాగా, ఘటనాస్థలికి చేరుకున్న మృతుల కుటుంబసభ్యులు తమకు న్యాయం చెయ్యాలని ఆందోళనకు దిగారు. ప్రకాశ్‌రావు కోరిక మేరకే తమవారు పందుల వేటకు వచ్చారని ఆరోపించారు. పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు వారిని శాంతింపజేశారు. మరోవైపు, మృతులు ఎవరో తనకు కనీసం తెలియదని ప్రకాశ్‌రావు స్పష్టం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పొలంలోని విద్యుత్‌ తీగలను కత్తిరించడం వల్లే ప్రమాదం జరిగిందని తమ ప్రాథమిక విచారణలో తేలిందని బోధన్‌ ట్రాన్స్‌కో డీఈ ముక్తార్‌ అహ్మద్‌ తెలిపారు. తడిగా ఉన్న కర్రకు కత్తిని కట్టి వేలాడుతున్న విద్యుత్‌ తీగలను కత్తిరించారని చెప్పారు. అంతేకాక, మృతుల కుటుంబసభ్యులపై విద్యుత్‌ తీగల చౌర్యం కేసులు ఉన్నాయని డీఈ పేర్కొన్నారు.


మృతదేహాలను మోసిన సీఐ

విద్యుత్‌ షాక్‌కు గురై పొలంలో మరణించిన వారి మృతదేహాలను బోధన్‌ రూరల్‌ సీఐ విజయ్‌ బాబు స్వయంగా మోశారు. మృతదేహాల ఉన్న చోటుకి వాహనం వచ్చే అవకాశం లేకపోవడంతో మృతదేహాలను తన భుజాలపైకి ఎత్తుకుని ఇతరులతో కలిసి 150 మీటర్ల దూరంలో రహదారిపై ఉన్న ట్రాక్టర్‌ వద్దకు మోసుకొచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

Updated Date - Feb 21 , 2025 | 05:16 AM