Share News

మామిడిముక్కలతో చేపల పులుసు

ABN , Publish Date - Mar 09 , 2025 | 11:51 AM

మండు వేసవిలో ఆకాశం నిప్పులు కక్కుతుంటే, ఇంట్లో చల్లగా కూర్చుని భోగులు తరుణ దశ దాటిన తాజా లేత మామిడికాయ ముక్కల్ని అలాగే, నీళ్ళు ఎండి, వట్టిపోయిన చెరువుల్లోంచి తెచ్చి తరిగి శుభ్రపరచిన చేప ముక్కలతో కలిపి ఉడికించి, కమ్మని తాలింపు పెట్టి ఆస్వాదిస్తూ తిన్నారంటారు రాయలవారు.

మామిడిముక్కలతో చేపల పులుసు

తారుణ్యాతిగ చూత నూత్న ఫలయు

కే్ౖతలాభిఘార స్వన

ద్దారా ధూపిత శుష్యదంబు హృత

మాత్స్య చ్చేద పాకోద్గతో

ద్లారంపుంగన రార్చు భోగులకు

సంధ్యా వేళలం గేళి కాం

తారాభ్యంతర వాలుకాస్థిత హిమాంత ర్నారి కేళలాంబువుల్‌

వేసవి కాలంలో లేత మామిడికాయల ముక్కలతో చేపల కూర గురించి శ్రీకృష్ణదేవరాయలు ఈ పద్యంలో వర్ణించాడు. నిజానికి వింత వంటకాల్ని వర్ణించటంలో రాయలవారు శ్రీనాథుణ్ణి ఒకింత మించిన వాడనే చెప్పాలి. శ్రీనాథుడైనా, రాయలవారైనా తమ భోగాన్ని కాదు, ఆహారాన్ని ఆస్వాదించే ప్రజల భోగాన్ని వర్ణించారు. భోజనాన్ని రుచిమంతంగా, ఆరోగ్యదాయకంగా వండుకుని ఆస్వాదిస్తూ, తినేవాడు భోగి. అనుభవం, సుఖం, భోజనం అని భోగానికి మూడు అర్థాలున్నాయి. ఆహారాన్ని ఆహా...ఓహో అంటూ ఆస్వాదిస్తూ తినాలి!


మండు వేసవిలో ఆకాశం నిప్పులు కక్కుతుంటే, ఇంట్లో చల్లగా కూర్చుని భోగులు తరుణ దశ దాటిన తాజా లేత మామిడికాయ ముక్కల్ని అలాగే, నీళ్ళు ఎండి, వట్టిపోయిన చెరువుల్లోంచి తెచ్చి తరిగి శుభ్రపరచిన చేప ముక్కలతో కలిపి ఉడికించి, కమ్మని తాలింపు పెట్టి ఆస్వాదిస్తూ తిన్నారంటారు రాయలవారు.

విస్తట్లో అన్నీ వడ్డించాక, ఆఖర్న నెయ్యి తెచ్చి అన్నం మీద కొద్దిగా వేయటాన్ని ‘అభిఘారం’ అంటారు. ఈ పద్యంలో నూనెని అభిఘరించి తాలింపు పెట్టినట్టు రాయలవారు రాశారు. తాలు అంటే ‘తిరుగు’ అని! బోర్లించి తిప్పటం తాలింపు. తిరగపో(బో)త ప్రక్రియ ఇది. గవ్వల్ని చేతిలో అటూ ఇటూ పొర్లించి, చెయ్యి బోర్లించి వేస్తారు కాబట్టి నాచన సోమన ఉత్తర హరివంశంలో గవ్వల్ని సత్యభామ తాలించి వేసిందన్నాడు. దీన్నే సాతాలింపు లేదా తాలింపు అన్నారు. కూర, పప్పు, పులుసు, పచ్చడి వగైరా వంటకాల మీదకు తిరగబొయ్యగానే చుయ్యిమనే మోత వస్తుంది కాబట్టి, తిరగమోత అనీ, వెంటనే మూతపెడతారు కాబట్టి తిరగమూత అనీ పిలుస్తారు. తాలింపును పొయ్యగానే పొగలు వస్తాయి కాబట్టి పొగపు, పోపు, అన్నారు. ‘‘తిరిగి వచ్చిన భార్య, తిరుగబోత వేసిన కూర బహు రుచి’’ అని తెలుగు సామెత!


అసలే ఎండ. తిన్నదేమో చేపల కూర. దాంతో సాయంత్రం అయ్యే సరికి ఉద్గత ఉద్గారాల కనరు అంటే విపరీతంగా కారపు త్రేన్పులు రావటం మొదలెట్టాయట. ఈ కారానికి గ్రామాల్లో అప్పటికప్పుడు దొరికే విరుగుళ్లు కొబ్బరి నీళ్లు. ఎండ తగలకుండా నీడ ఉండే స్థలంలో పెద్ద గొయ్యి తీసి కొంత ఇసుక నింపి, దాని పైన కొబ్బరి బోండాల్ని పరిచి వాటి పైన మళ్ళీ ఇసుక పోసి మూయటాన్ని ఇసుక పాతర వెయ్యటం అంటారు. ఈ ఇసుకని మాటిమాటికీ నీళ్ళతో తడుపుతుంటే కొబ్బరి బోండాలలో నీళ్లు చల్లబడతాయి. రెఫ్రిజిరేటర్లు, ఐసు తయారు చేసే యంత్రాలేవీ లేని ఆ రోజుల్లో చల్లదనానికి గ్రామీణులు ఆశ్రయించిన పద్ధతి ఇది. కొబ్బరి బోండాల్ని, తాటికాయల్నీ రాత్రంతా ఓ బావిలో వేసి ఉంచి, మర్నాడు మధ్యాహ్నం తీసి చల్లగా తాగటమూ తినటమూ ఖుద చేసేవారట... నీళ్ళలో నానిన తాటి కాయల్లో ముంజలు అమిత చల్లగా ఉంటాయి.


కూపోదకం (బావి నీరు), వటచ్ఛాయ, (మర్రి చెట్టు నీడ), తరుణీ కుచమండలం (స్త్రీస్తనద్వయం) ఈ మూడూ వేసవికాలం చల్లగా, శీతాకాలం వెచ్చగా ఉంటాయట. బావిలో నానేయటం వలన అదీ ప్రయోజనం.

అప్పుడే టెంకె పడ్తున్న మామిడికాయని ‘తారుణ్యాతిగ చూత నూత్న ఫలం’ అనీ, చెరువు ఎండిపోతుంటే ఆఖరున మిగిలిన చేపల్ని ‘‘శుష్యదంబు హృత మాత్స్య’ అని, చుయ్యని మోగేలా వేసిన తిరగపోతని ‘తైలాభిగార స్వనద్దారా ధూపితం’ అనీ వర్ణించి, పాణింధమములు లాంటి పదాలు వాడిన శ్రీనాథుణ్ణి మించిపోయారు రాయలవారు.

భోజనం ఒక భోగం! ఒక యోగం కూడా!

- డా. జి వి పూర్ణచందు, 94401 72642

Updated Date - Mar 09 , 2025 | 11:51 AM