పనీర్... పారాహుషార్
ABN , Publish Date - Mar 09 , 2025 | 01:09 PM
సరైన పనీర్ మైల్డ్, మిల్కీ టేస్టుతో ఉండి కొద్దిగా తీయదనంతో ఉంటుంది. ఒకవేళ పులుపు రుచితో, గొంతు ఇబ్బంది పడితే కల్తీ జరిగిందని గుర్తించాలి. తాజా పనీర్ పరిశుభ్రమైన, పాల వాసనతో ఉంటుంది. ఒకవేళ రసాయనాలు కలిస్తే వాసన వేరేగా ఉంటుంది.

పనీర్... హోటల్, రెస్టారెంట్ల నుంచి ఇప్పుడు ప్రతీ వంటింట్లోకి వచ్చేసింది. పనీర్ టిక్కా, పనీర్ మఖానీ, పనీర్ బట్టర్ మసాలా, పాలక్ పనీర్... ఇలా అనేక రకాల పనీర్ వంటకాలు నోరూరి స్తున్నాయి. సూపర్ మార్కెట్లలో పలు పనీర్ ప్యాకెట్లు ఆకర్షిస్తున్నాయి.అయితే వాటిలో నకిలీలు కూడా ఉండొచ్చు. సరైన పనీర్‌ను ఎంచుకోవడం ఎలా?
స్వచ్ఛమైన పనీర్ కన్నా నకిలీ పనీర్‌కే మెరుగులు ఎక్కువ. అది రసాయనాలతో మెరిసిపోతూ ఆకర్షిస్తుంది.అందుకే మెరిసిపోయేది తాజాగా ఉందని తీసుకుంటే అనారోగ్యం ‘కొని’ తెచ్చుకున్నట్టే.
పనీర్ కొనేప్పుడు తప్పకుండా దాని తయారీ సమాచారం చదవాల్సిందే. ప్యాకెట్‌పై తయారీలో వాడిన పదార్థాల (ఇంగ్రీడియెంట్స్) సమాచారం లేకుంటే వాటి జోలికి వెళ్లొద్దు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) సర్టిఫికేషన్ ముద్ర ఉంటే భరోసాగా కొనొచ్చు.
సరైన పనీర్ మైల్డ్, మిల్కీ టేస్టుతో ఉండి కొద్దిగా తీయదనంతో ఉంటుంది. ఒకవేళ పులుపు రుచితో, గొంతు ఇబ్బంది పడితే కల్తీ జరిగిందని గుర్తించాలి. తాజా పనీర్ పరిశుభ్రమైన, పాల వాసనతో ఉంటుంది. ఒకవేళ రసాయనాలు కలిస్తే వాసన వేరేగా ఉంటుంది. అలాంటివాటి వైపు చూడొద్దు.
సాధారణంగా పనీర్‌ను వేడి నీళ్లలో వేయగానే దాని గుణం ఎలాంటిదో తెలిసిపోతుంది. లేదంటే పనీర్ ముక్కపై కొన్ని అయోడిన్ చుక్కలు వేస్తే... ఒకవేళ అది నీలి రంగులోకి మారితే కల్తీదిగా గుర్తించాలి.
సాధ్యమైనంత మేరకు పేరెన్నికగల బ్రాండెడ్ పనీర్‌నే తీసుకోవాలి. సూపర్‌మార్కెట్లో వరుసగా ఉండే ప్యాకెట్లలో ఏదైనా ఒకటే అని, ధర తక్కువ అని ఊరు పేరు లేని పనీర్ కొంటే మొదటికే మోసం. ఎప్పుడైనా సరే ఎక్స్‌పైరీ తేదీని చూడటం మరవొద్దు.
అచ్చమైన పనీర్ తాజా పాలతో తయారై ప్రొటీన్, కాసైన్లను అందిస్తుంది. పనీర్‌ను వెజిటబుల్ ఆయిల్, పామాయిల్, స్ట్రాచ్, బేకింగ్ పౌడర్, సోడియం బై కార్బోనేట్, సల్ఫ్యూరిక్ యాసిడ్, డిటెర్జంట్, సాచ్యూరేటెడ్ ఫ్యాట్‌లతో కల్తీ చేస్తారు.
నకిలీ పనీర్‌ను గుర్తించేందుకు కొన్ని టెస్టులున్నాయి. అవేమిటంటే...
వేడినేటితో: వేడి నీటిలో పనీర్ ఉడికినప్పుడు కొద్దిగా సైజు తగ్గి, మెత్తబడుతుంది. నకిలీదైతే చెక్కుచెదరకుండా రబ్బరులా అలాగే ఉంటుంది.
వాసన: మంచి పనీర్ పాల వాసనతో తాజాగా ఉంటుంది. సింథటిక్ పనీర్ వాసన ఉండదు.
రుచి: సహజమైన పనీర్ రుచి క్రీమ్‌లా ఉంటుంది. నకిలీది చప్పగా లేదంటే పులుపుగా ఉంటుంది.