ఎన్నికల ప్రచారంపై వ్యయ పరిమితి 10% పెంపు

ABN , First Publish Date - 2020-10-21T09:00:11+05:30 IST

లోక్‌సభ, అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల గరిష్ఠ వ్యయ పరిమితిని కేంద్రం 10 శాతం పెంచింది. ఈమేరకు ..

ఎన్నికల ప్రచారంపై  వ్యయ పరిమితి 10% పెంపు

లోక్‌సభ అభ్యర్థి ఖర్చు రూ. 77 లక్షలు

ఎమ్మెల్యే అభ్యర్థి వ్యయ పరిమితి రూ. 30.8 లక్షలు


న్యూఢిల్లీ, అక్టోబరు 20: లోక్‌సభ, అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల గరిష్ఠ వ్యయ పరిమితిని  కేంద్రం 10 శాతం పెంచింది. ఈమేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ సోమవారం రాత్రి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజా నిబంధనలను అనుసరించి...అభ్యర్థుల ఎన్నికల గరిష్ఠ ప్రచార వ్యయం రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య తేడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో గరిష్ఠ వ్యయపరిమితి రూ. 20 లక్షలుగా ఉన్న రాష్ట్రాల్లో ఈ పరిమితి రూ. 22 లక్షలకు పెరిగింది. రూ. 28 లక్షలు ఉన్న బిహార్‌ లాంటి రాష్ట్రాల్లో  ఈ పరిమితి 30.8 లక్షలకు పెరిగింది. అదేవిధంగా, లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థి ఇప్పుడు 77 లక్షల రూపాయల వరకూ  ఖర్చుచేయొచ్చు.




గతంలో ఈ పరిమితి 70 లక్షలుగా ఉండేది. అదే చిన్న రాష్ట్రాల్లో అయితే ఈ పరిమితి రూ. 54 లక్షల నుంచి రూ. 59కి పెరగనుంది. బీహార్‌ అసెంబ్లీతోపాటు, ఒక ఎంపీ, 59 అసెంబ్లీ స్థానాలకు త్వరలో జరగనున్న ఉప ఎన్నికలకూ తాజా వ్యయ నిబంధన వర్తించనుంది. తాజా చర్య శాశ్వతం కాదని, కొవిడ్‌ కాలానికి మాత్రమే ఈ నిబంధనలు అమలులో ఉంటాయని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. కొవిడ్‌ నియంత్రణల నేపథ్యంలో ఎన్నికల ప్రచార ఖర్చును పెంచాలని వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని  అభ్యర్థించారు. అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణలోనికి తీసుకున్న ఈసీ గరిష్ఠ వ్యయపరిమితిని పెంచాలంటూ కేంద్రానికి సిఫార్సు చేసింది. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్రం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2020-10-21T09:00:11+05:30 IST