10 మంది వలంటీర్లు ఔట్‌

ABN , First Publish Date - 2021-02-24T06:46:23+05:30 IST

అద్దంకి మండలంలోని రెండు పంచాయతీల్లో పదిమంది వలంటీర్లపై వేటు పడింది. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఎంపీడీవో మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

10 మంది వలంటీర్లు ఔట్‌

రెండు గ్రామాల్లో వేటు

అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయలేదన్న 

అక్కసుతోనే అంటున్న కుటుంబసభ్యులు

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే

కారణమంటున్న ఎంపీడీవో 

తొలగింపు ఉత్తర్వులు తీసుకోని వలంటీర్లు

అద్దంకి టౌన్‌, ఫిబ్రవరి 23 : అద్దంకి మండలంలోని రెండు పంచాయతీల్లో పదిమంది వలంటీర్లపై వేటు పడింది. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఎంపీడీవో మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై వలంటీర్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అధికారపార్టీ మద్దతు అభ్యర్థులు ఓడిపోయారన్న అక్కసుతోనే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

అద్దంకి మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఈనెల 13న జరిగాయి. మండలంలోనే ధేనువకొండ, మోదేపల్లిలో టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. అది జరిగిన పది రోజులకే ధేనువకొండలో ఏడుగురు, మోదేపల్లిలో ముగ్గురు వలంటీర్లను తొలగిస్తూ ఎంపీడీవో రాజేందర్‌ ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై పలు అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి తప్పు చేయకపోయినా రాజకీయంగా కావాలనే వారిని విధుల నుంచి తొలగించారని వలంటీర్ల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వలంటీర్లు పనిచేయడం లేదని అధికారులకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, పంచాయతీ కార్యదర్శులను అడిగితే తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారని వారంటున్నారు. మండలంలోని ధేనువకొండలో మొత్తం 23మంది గ్రామ వలంటీర్లు ఉండగా వారిలో జొన్నలగడ్డ శ్రీకాంత్‌, తుమ్మలగుంట శ్రీమన్నారాయణ, పోకూరి వెంకటేశ్‌, వంగపల్లి సునీత, పి. సింధు, మాలెంపాటి త్రివేణి, జొన్నలగడ్డ అనితలను విధుల నుంచి తొలగించారు. వీరితోపాటు మోదేపల్లిలో కంకణాల ప్రియతమ్‌, భీమని తిరుపతమ్మ, అనపర్తి రోజాలను విధుల నుంచి తొలగిస్తూ ఎంపీడీవో ఉత్తర్వులు జారీచేశారు. వీటిని వలంటీర్లు తీసుకోలేదు. ఇచ్చిన సెల్‌ఫోన్లు, తంబ్‌ మిషన్లు వెనక్కి ఇవ్వాలని కార్యదర్శులు కోరినా ఇవ్వలేదు. సాయంత్రం వరకూ సూచిన కార్యదర్శులు విషయాన్ని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. 


విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నందునే తొలగించాం

ఎ.రాజేందర్‌, ఎంపీడీవో అద్దంకి

విధుల్లో నిర్లక్ష్యంగా ఉండటం వలన ధేనువకొండలో ఏడుగురు, మోదేపల్లిలో ముగ్గురు వలంటీర్లను తొలగించాం. వారు అడిగిన సమాచారం సకాలంలో ఇవ్వడం లేదు. పింఛన్లు, రేషన్‌ సక్రమంగా పంపిణీ చేయయడం లేదు. వీరితోపాటు మండలంలో మరికొన్ని గ్రామాల్లో 20 నుంచి 30మంది  గ్రామ వలంటీర్ల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నాం. 


Updated Date - 2021-02-24T06:46:23+05:30 IST