48 రోజుల్లోనే 11 రెట్ల విస్ఫోటం

ABN , First Publish Date - 2021-04-06T08:20:43+05:30 IST

దేశంలో కరోనా వ్యాప్తి వేగాన్ని పుంజుకుంది. తొలిసారిగా ఆదివారం ఒక్కరోజే లక్షకు పైగా (1,03,844) కొవిడ్‌ కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది.

48 రోజుల్లోనే 11 రెట్ల విస్ఫోటం

అమెరికా తర్వాత ఒక్కరోజులో లక్ష కేసులు నమోదైన రెండో దేశంగా భారత్‌


దేశంలో కరోనా వ్యాప్తి వేగాన్ని పుంజుకుంది. తొలిసారిగా ఆదివారం ఒక్కరోజే లక్షకు పైగా (1,03,844) కొవిడ్‌ కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది. దీంతో కేవలం 24 గంటల వ్యవధిలో లక్ష పైచిలుకు ‘పాజిటివ్‌’లు నిర్ధారణ అయిన రెండో దేశంగా భారత్‌ నిలిచింది. గతేడాది అక్టోబరు 30న అమెరికాలో అత్యధికంగా 1,00,233 మందికి ఇన్ఫెక్షన్లు సోకినట్లు గుర్తించారు. వాస్తవానికి ఇది జరగడానికి 43 రోజుల ముందే (సెప్టెంబరు 17న).. భారత్‌లో కేసులు 97,894కు చేరాయి. అయితే ఆ తర్వాత క్రమంగా కొవిడ్‌ కేసులు తగ్గుతూ వచ్చాయి.


‘వరల్డోమీటర్‌’ ప్రకారం.. అక్టోబరు 17న 62,092, నవంబరు 17న 38,532, డిసెంబరు 17న 26,762, జనవరి 17న 13,962 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఫిబ్రవరి 1న 8579, అదే నెల 15న 9,086 కేసులే నమోదయ్యాయి. ఆ తర్వాత .. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో కేసుల గ్రాఫ్‌ ఒక్కసారిగా పైకి పోయింది. కొవిడ్‌ రోగుల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. కొత్త కేసుల సంఖ్య మార్చి 24న 50వేలు (53,419) దాటగా, 11 రోజుల్లోనే ఇది కాస్తా రెట్టింపై 1.03 లక్షలకు చేరడం వైరస్‌ ఉధృతికి నిదర్శనంగా నిలుస్తోంది. 



మూడు రోజులకు.. లక్ష కొత్త కేసులు

మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌, కర్ణాటక, కేరళ, పంజాబ్‌ రాష్ట్రాల్లో కేసులు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో గత 48 రోజుల (ఫిబ్రవరి 16 - ఏప్రిల్‌ 4) వ్యవధిలో రోజువారీ నమోదయ్యే కొవిడ్‌ కేసుల సంఖ్య 9వేల నుంచి ఏకంగా లక్షకు ఎగబాకింది. ఇదేకాలంలో క్రియాశీల (యాక్టివ్‌) కేసుల సంఖ్య కూడా 6.04 లక్షలు పెరిగింది. ఫిబ్రవరి 15 నాటికి దేశంలో 1.33 లక్షల క్రియాశీల కేసులు ఉండగా, సోమవారం (ఏప్రిల్‌ 5) ఉదయం సమయానికి అవి 7.37 లక్షలు దాటాయి.


ఇక దేశంలో మొత్తం కేసుల సంఖ్య కూడా గత ఏడు వారాల్లో గణనీయంగా పెరిగాయి. ఫిబ్రవరి 15 నాటికి మొత్తం కొవిడ్‌ కేసులు 1.09 కోట్లు ఉండగా, ఇప్పుడవి 1.25 కోట్లకు చేరాయి. అంటే 48 రోజుల్లో 16 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయన్న మాట. ఈ లెక్కన ప్రతి మూడు రోజులకు దేశంలో దాదాపు లక్ష కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. 




‘మహా’ కల్లోలం.. 

కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైందని సాంక్రమిక వ్యాధి నిపుణులు జనవరి నుంచే హెచ్చరిస్తున్నప్పటికీ.. దాని తీవ్రత ఎంతలా ఉందనేది మహారాష్ట్రలో భారీగా నమోదైన కేసుల ద్వారా స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ప్రస్తుతం రోజువారీ కొత్త కొవిడ్‌ కేసులు భారీగా నమోదవుతున్న రాష్ట్రాల్లో ఇది మొదటిస్థానంలో ఉంది. ఆదివారమిక్కడ 57వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దేశంలోని క్రియాశీల కొవిడ్‌ కేసుల్లో 60 శాతం (4.30 లక్షలు) ఒక్క మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం.


జనవరి 21 నాటికి రాష్ట్రంలో మొత్తం 20 లక్షల కేసులు నమోదవగా.. అవి మార్చి 19 నాటికి 24 లక్షలకు, మార్చి 31 నాటికి  28 లక్షలకు, ఏప్రిల్‌ 4 నాటికి 30 లక్షలకు చేరాయి. ఈ లెక్కన 72 రోజుల్లోనే 10 లక్షల కేసులు పెరిగాయి. ఈ రాష్ట్రంలో మొదటి లక్ష కేసులు నమోదవడానికి 95 రోజుల సమయం పట్టగా, తొలి 10 లక్షల కేసులకు 132 రోజుల సమయం పట్టింది. గత రెండున్నర నెలల్లో ఆ వ్యవధి బాగా తగ్గింది.


మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 4 మధ్యకాలంలో.. అంటే నాలుగు రోజుల్లోనే రెండు లక్షల కొత్త కేసులు నమోదవడాన్ని బట్టి, అక్కడ వైరస్‌ వ్యాప్తి ఎంత వేగంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఫిబ్రవరిలో మెట్రో రైళ్లను ప్రారంభించినప్పటి నుంచి కేసుల సంఖ్య బాగా పెరిగిందని పరిశీలకులు అంటున్నారు. మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్‌ చేసుకోవడం వంటి జాగ్రత్త చర్యలను పాటించడంలో ప్రజల నిర్లక్ష్యంగా కూడా ఓ ముఖ్య కారణమని పేర్కొన్నారు. 

- సెంట్రల్‌ డెస్క్‌




రోజువారీ కేసులు పెరిగాయి ఇలా..  

తేదీ కొత్త కేసులు

జనవరి 1 17,080

జనవరి 15 15,151

జనవరి 31 11,528

ఫిబ్రవరి 15 9,139

ఫిబ్రవరి 28 15,616

మార్చి 15 24,437

మార్చి 31 72,182

ఏప్రిల్‌ 4 1.03 లక్షలు


ఒక్కరోజులో భారీ కేసులు..

అమెరికా

3.08 లక్షలు (జనవరి 8, 2021)


భారత్‌ 

1.03 లక్షలు (ఏప్రిల్‌ 4, 2021)


బ్రెజిల్‌ 

97,586  (మార్చి 25, 2021)


Updated Date - 2021-04-06T08:20:43+05:30 IST