ఖాతాలు తెరవండి..డబ్బులేస్తాం..

ABN , First Publish Date - 2021-12-03T05:47:07+05:30 IST

నానా పాట్లు పడి సర్పంచ్‌ గిరీ దక్కించుకున్న వారికి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. పదవి చేపట్టిన నాటి నుంచి పంచాయతీల అభివృద్ధికి ఒక్క పని కూడా చేయలేక పోయారు.

ఖాతాలు తెరవండి..డబ్బులేస్తాం..

పంచాయతీలకు ప్రభుత్వం తాజా ఉత్తర్వులు

కేంద్రం ఆదేశాలతో బ్యాంకుల్లో ప్రత్యేక అకౌంట్లు 

15వ ఆర్థిక సంఘం నిధులపై కొత్త మెలిక

బ్యాంకుల చుట్టూ పంచాయతీలు

కొత్త ఖాతాలు తెరిచేందుకు తిప్పలు


(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

నానా పాట్లు పడి సర్పంచ్‌ గిరీ దక్కించుకున్న వారికి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. పదవి చేపట్టిన నాటి నుంచి పంచాయతీల అభివృద్ధికి ఒక్క పని కూడా చేయలేక పోయారు. సొమ్ముల్లేక పోవడంతో పల్లెల్లో పనులేవీ ముందుకు సాగలేదు. రోడ్లు ఛిద్రమైనా, తాగునీటికి ఇబ్బంది అయినా, డ్రెయిన్లు పూడుకుపోయి నీరు పైకి ఎగద న్నుతున్నా కనీసం మరమ్మతులు చేయించుకోవడానికి పైసా లేదు. మంత్రుల చుట్టూ తిరిగారు.. ఎమ్మెల్యేలను ప్రాధేయ పడ్డారు. ఈలోపు వచ్చి 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా ప్రభుత్వం క్షణాల్లో మళ్లించేసింది. వీటి కోసమే ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న సర్పంచ్‌లకు షాక్‌ ఇచ్చింది. గెలిచినవారంతా వీధికెక్కి పోరాటం చేస్తే వీరికి మరో పరీక్ష పెట్టారు. పంచాయతీల పేరున ప్రత్యేక ఖాతా తెరిస్తే తాము ఖాళీ చేసిన నిధులన్నింటినీ తిరిగి ఇస్తామంటూ సర్కార్‌ కొత్త మెలిక పెట్టింది. ఇప్పుడు వీరంతా ఇదే పనిలో బిజీగా ఉన్నారు.


ఎందుకీ గందరగోళం 

గ్రామ సీమల అభివృద్ధికి కేంద్రం ఏటా ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తుంటుంది. ఎక్కడికక్కడ స్థానిక అవసరాలను గుర్తించి పనులు జరిగేలా చూస్తుంది. గ్రామాల అభివృద్ధికి  రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇచ్చి చాలా కాలమైంది. ఎమ్మెల్యేలను, మంత్రులను దీనిపై నిలదీస్తే మీ పరిధిలో పన్నులు వసూలు చేసి రాబడి రాబట్టండంటూ ఒక ఉచిత సలహా పడవేస్తున్నారు. ఆఖరుకు జిల్లాస్థాయి అధికారుల దగ్గర నుంచి డివిజన్‌ స్థాయి వరకు ప్రాధేయపడినా గ్రామాలకు నయాపైసా వచ్చే పరిస్థితుల్లేవు. ఈ తరుణంలోనే 15వ ఆర్థిక సంఘం నిధులు మార్గదర్శక సూత్రాలకనుగుణంగా పంచాయతీ ఖాతాల్లో పడ్డాయి. పంచాయతీ పాలక వర్గాలు అభివృద్ధి పనులపై చర్చిస్తున్నారు. కానీ, ఒక్కసారిగా సీన్‌ తిరగబడింది. కేంద్రం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం లాగేసింది. గత నెలలో ఖాతాలను ఖాళీ చేసింది. ముందుగా ఏదో సాంకేతిక లోపం అనుకున్నారు. ఇంకొందరైతే ప్రభుత్వమే కదా తీసుకుంది.. ఇవాళ కాకపోతే రేపు వస్తాయనుకున్నారు. కానీ అసలు విషయం ఆ తర్వాత బయటపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను నొక్కేసిన విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదు. కానీ పత్రికల్లో ఈ విషయం బయటపడడంతో పార్టీకి అతీతంగా సర్పంచ్‌లంతా ఆందోళనకు దిగారు. ఆర్థిక సంఘం ద్వారా జిల్లాకు వచ్చిన దాదాపు రూ.70 కోట్లను ప్రభుత్వం మళ్లించింది. దీనిపై గడచిన పక్షం రోజులుగా సర్పంచ్‌లంతా వీధులకెక్కు తున్నారు. అధికార పక్ష అనుకూలురైన సర్పంచ్‌లు మాత్రం వీధులకెక్కితే తమ పార్టీ ఎమ్మెల్యేలు నొచ్చు కుంటారోనని వెనుకంజ వేశారు. కానీ ఎమ్మెల్యేలకు సైతం ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు దెబ్బ తగిలింది. సర్పంచ్‌ లకు సర్ది చెప్పలేక సతమతమయ్యారు. వాస్తవానికి ఈ నిధులు పంచాయతీల్లో పారిశుధ్య సేవలకు, ఇతరత్రా అవసరాలకు ఖర్చు చేయాల్సి ఉంది. కాని ప్రభుత్వమే నేరుగా నిధులు మళ్లించి సర్పంచ్‌లకు షాక్‌ ఇచ్చింది.


బ్యాంకు ఖాతాల తిప్పలు

రాష్ట్ర ప్రభుత్వం హైజాక్‌ చేసిన పంచాయతీ నిధులను తిరిగి ఇస్తామంటూ సర్కార్‌ ప్రకటించింది. దీనిపై కేంద్రం నుంచి ఆదేశాలు రావడంతో బుధవారం హడావుడి ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీల పేరున ఖాతాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని, ఇకపై ఆయా పంచాయతీల అకౌంట్లకే నిధులు జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తెలియజేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌  శశిధర్‌ పంచాయతీలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులను వాడుకోవడానికి వీలుగా ప్రతీ పంచాయతీ ఒక ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలని ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 876 గ్రామ పంచాయతీల్లో సగానికి సగం ఖాతాలు తెరిచేందుకు ప్రయత్నించలేదు. అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌లు మాత్రం దాదాపు 50 మంది హడావుడిగా ఖాతాలు తెరిచారు. పంచాయతీ పేరిట మాత్రమే ఖాతా తెరవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉంటే సర్పంచ్‌ను కూడా జత చేసి జాయింట్‌ అకౌంట్‌ తెరిచేం దుకు ఇంకొందరు ప్రయత్నించారు. ఎట్టి పరిస్థితు ల్లోనూ సాధ్యమైనంత తొందరగా ఖాతాలు తెరిచేలా సహకరిం చాలని గురువారం ఆయా బ్యాంకులకు ప్రభుత్వం తరపున వర్తమానాలు వెళ్లాయి. ‘ఇప్పటికే ఒకింత గందరగోళం ఉంది. ఎవరైతే గ్రామ పంచాయతీ పేరిట ఖాతా ఆరంభించాలనుకుంటారో సంబంధిత పత్రాలతో మీ దగ్గరకు వస్తారు. సకాలంలో ఖాతా తెరిచేలా చూడండి’ అంటూ మేనేజర్లకు సంక్షిప్త సందేశాలు పంపారు. ఖాతా తెరిచేందుకు మరో 400 పంచాయతీలు దరఖాస్తులు పొంది, మిగతా ప్రక్రియను పూర్తి చేసేందుకు  ప్రయత్నాలు చేస్తున్నాయి. 


Updated Date - 2021-12-03T05:47:07+05:30 IST