పోలీస్‌ స్టేషనలో 16 ఎడ్ల బండ్లు!

ABN , First Publish Date - 2021-10-16T05:30:00+05:30 IST

పరిగి మండలం పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి గృహనిర్మాణాల కోసం ఎడ్లబండ్లపై ఇసుకను తీసుకొస్తుండగా పరిగి పోలీసులు ప్రతాపం చూపారు.

పోలీస్‌ స్టేషనలో 16 ఎడ్ల బండ్లు!
పోలీసులు సీజ్‌ చేసిన ఎద్దుల బండ్లు

పరిగి, అక్టోబరు 16: పరిగి మండలం పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి గృహనిర్మాణాల కోసం ఎడ్లబండ్లపై ఇసుకను తీసుకొస్తుండగా పరిగి పోలీసులు ప్రతాపం చూపారు. 16 ఎడ్లబండ్లను బీరలింగేశ్వరస్వామి ఆలయం వద్ద అదుపులోకి తీసుకుని తహసీల్దార్‌ ముందు వాటి యజమానులను హాజరుపరిచారు. ఇదిలా ఉండగా పోలీసులు అధికార పార్టీ నాయకుల అండదండలతో 16 ఎడ్లబండ్లపై ప్రతాపం చూపారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణాల పేరుతో అధికార పార్టీ నాయకులు ట్రాక్టర్ల ద్వారా రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ఇసుకను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకోలేదన్నారు. కానీ తమలాంటి వారిపై కక్షగట్టి పోలీసులకు పట్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికార పార్టీ మండల ఇనచార్జ్‌ సూచనల మేరకే పోలీసులు ప్రవర్థిస్తున్నారని వారు ఆరోపించారు. కొడిగెనహళ్లి, ఊటకూరు, శ్రీరంగరాజులపల్లి వద్ద ఉన్న ఇసుక రీచలలో 10వేల క్యూబెక్‌ మీటర్లు కలెక్టర్‌ అనుమతిచ్చారు. అయితే ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించకుండా ఇతరులకు ఇసుకను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పేదలకు న్యాయం చేయాలని ఎడ్లబండ్ల యమాజనులు కోరారు. పరిగి ఎస్‌ఐ శ్రీనివాసులును వివరణ కోరగా అక్రమ మద్యం, పేకాట, ఇసుక అక్రమరవాణా చేసే ఏ పార్టీ నాయకులనైనా వదిలేది లేదని అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. 



Updated Date - 2021-10-16T05:30:00+05:30 IST