కరోనా కలవరం

ABN , First Publish Date - 2020-07-08T10:28:01+05:30 IST

పెద్దాపురం, పట్టణ, రూరల్‌ ప్రాంతాల్లో మంగళవారం 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని మున్సిపల్‌ కమిషనర్‌ జి.శేఖర్‌ తెలిపారు.

కరోనా కలవరం

జిల్లాలో పెరుగుతున్న  కరోనా వైరస్‌ కేసుల సంఖ్య ప్రజలను కలవరపెడుతోంది. ఏ ప్రాంతంలో  ఏ వార్త వినాల్సి వస్తుందోనని ప్రజలు కంగారుపడుతున్నారు


పెద్దాపురంలో 16 పాజిటివ్‌లు

పెద్దాపురం, జూలై 7: పెద్దాపురం, పట్టణ, రూరల్‌ ప్రాంతాల్లో మంగళవారం 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని మున్సిపల్‌ కమిషనర్‌ జి.శేఖర్‌ తెలిపారు. పట్టణ పరిధిలోని వక్కలంకవారి వీధిలో 10, బంగారమ్మగుడివీధి 1, చల్లావారి వీధి 1, వరహాలయ్యపేట 1, 12వ వార్డులో 1 పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. రూరల్‌ పరిధిలోని కట్టమూరులో రెండు కేసులు నమోదయ్యాయి.  రూరల్‌ పరిధిలో ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి, ఈవోపీఆర్డీ కరక హిమమహేశ్వరి పర్యవేక్షణలో పంచాయతీ సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు.


గంగవరంలో 10 మంది ఉద్యోగులకు...

తహశీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న 10 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని పీహెచ్‌సీ వైద్యులు అనూష, ఆనంద సత్యతేజ తెలిపారు. గత నెల 25న తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఒక ఉద్యోగికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఈనెల 2న 30 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 10 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మిగిలినవారి రిపోర్టులు రావాల్సి ఉంది. పాజిటివ్‌ వచ్చినవారు గోకవరం ఇద్దరు, రంపచోడవరం నలుగురు, రాజవొమ్మంగిలో ఒకరు, కుసుమరాయి, నెల్లిపూడి, మొల్లేరుల్లో ఒకరు ఉన్నారు.


యానాంలో 8 మందికి...

యానాంలో 8 మందికి పాజిటివ్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వీరిలో ముగ్గురు ఇటీవల హైదరాబాద్‌ నుంచి వచ్చారు. మిగిలిన ఐదుగురు ఓఎన్జీసీ సంస్థలో పనిచేస్తున్నారు. దరియాలతిప్ప, దోమ్మెటిపేట, కురసాంపేట, సుబద్రనగర్‌, గోపాల్‌నగర్లను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. 


శివకోటిలో ఒకే కుటుంబంలో ఐదుగురికి 

శివకోటిలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తూర్పుపాలెంలో ఒక యువకుడు కరోనాతో మృతిచెందాడు. ఇతడి స్నేహితుడు ఈ కుటుంబంతో సాన్నిహిత్యంగా ఉండటంతో ఐదుగురికి వైరస్‌ సోకింది. మండలంలో కేసు సంఖ్య 17కి చేరాయి.


 ఏలేశ్వరంలో మరో 4 కేసులు

మండలంలో మరో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు మండల ప్రధాన వైద్యాధికారి ఏవీ రమణ తెలిపారు. లింగంపర్తి గ్రామంలో ఒకటి, ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలోని దిబ్బలపాలెం, పాత స్టేట్‌బ్యాంక్‌ కాలనీ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. దీంతో ఏలేశ్వరంలో మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణమోహన్‌, లింగంపర్తి కార్యదర్శి మోహన్‌కుమార్‌ అత్యవసర పారిశుధ్య పనులు చేపట్టారు. 


కొత్తపేటలో కూడా...

మండలంలో నలుగురికి కరోనా పాజిటివ్‌ రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పలివెలలో ఇద్దరికి, అవిడిలో ఒకరికి, కండ్రిగలో ఒకరికి వైరస్‌ సోకింది. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టారు.


రాజమహేంద్రిలో రెండేసి చొప్పున...

10, 37వ డివిజన్లలో రెండేసి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 50 కంటైన్మెంట్‌ జోన్లను అధికారులు ప్రకటించారు.


సీతానగరంలో ముగ్గురికి...

మండలంలోని సింగవరంకాలనీలో ఒకరు, ఇనుగంటివారిపేటలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో కంటైన్మెంట్‌ జోన్‌ ఏర్పాటు చేశారు.


హత్యకేసులో నిందితురాలికి పాజిటివ్‌  

హత్యకేసులో నిందితురాలికి పాజిటివ్‌ రావడంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. సీహెచ్‌.గున్నేపల్లికి చెందిన వాండ్రపు రామకృష్ణ (26) హత్యకేసులో ఏ-3 నిందితురాలు కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చెందిన 33ఏళ్ల యువతిని సెంట్రల్‌జైలుకు పంపేముందు పరీక్షలు చేయ గా మంగళవారం వచ్చిన ఫలితాల్లో పాజిటివ్‌ నిర్ధారణ అయింది. హత్య కేసు విషయమై ముమ్మిడివరం, అమలాపురం పోలీ్‌సస్టేషన్లలో ఆమెను పోలీసులు విచారించారు. తర్వాత ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. దీంతో ముమ్మిడివరం, అమలాపురం పోలీసు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.


పాజిటివ్‌లతో హార్లిక్స్‌ ఫ్యాక్టరీ మూసివేత

ధవళేశ్వరం జాతీయ రహదారిపై ఉన్న హార్లిక్స్‌ ఫ్యాక్టరీని కరోనా నేపథ్యంలో మంగళవారం తాత్కాలికంగా మూసివేశారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు కరోనా సోకడం, మరింతమంది కార్మికులు వైరస్‌ లక్షణాలతో భాదపడుతుండడంతో జిల్లా ఉన్నతాధికారుల సూచనల మేరకు, యూనియన్ల ఒత్తిడితో ఫ్యాక్టరీని మూసివేశారు. 


అమెరికా, హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారికి...

అమెరికా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. ఐపోలవరం మండలం కేశనకుర్రులో నలుగురికి పాజిటివ్‌ రావడంతో వారి కాంటాక్ట్‌తో అతడికి వైరస్‌ సోకింది. అలాగే హైదరాబాద్‌ నుంచి వచ్చిన కుండలేశ్వరం పంచాయతీ కుంచెనపల్లికి చెందిన యువతికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయా మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


ఉపాధ్యాయుడికి పాజిటివ్‌

అంబాజీపేట మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పేరూరు తాడిగుంటమెరకకు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. 


ఆలమూరు, కొప్పవరంలో తొలికేసులు

ఆలమూరులో తొలి కరోనా కేసు నమోదైంది. పాజిటివ్‌ వచ్చిన యువకుడు ఓఎన్జీసీ సైట్‌లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్నాడు. అలాగే అనపర్తి మండలం కొప్పవరంలో కూడా తొలి కరోనా కేసు నమోదైంది.


మామిడాడలో పాజిటివ్‌ వ్యక్తి ద్వారా ఇద్దరికి...

జి.మామిడాడలో 2 పాజిటివ్‌లు నమోదైనట్టు పెద్దాడ పీహెచ్‌సీ వైద్యురాలు ప్రియాంక తెలిపారు. వీరు గతంలో జి.మామిడాడలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని కలవడం ద్వారా వైరస్‌ సోకినట్టు గుర్తించారు. 


ఇద్దరు జట్టు కూలీలకు...

రాజానగరం పీహెచ్‌సీ పరిధిలోని చక్రద్వారబంధం గ్రామానికి చెందిన ఇద్దరికి  కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వీరు రాజమహేంద్రవరం ఎఫ్‌సీఐ గొడౌన్స్‌లో జట్టు కూలీలుగా పనిచేస్తున్నారు. రాజానగరంలో ఒక మహిళకు పాజిటివ్‌ వచ్చినట్టు డాక్టర్‌ రవికుమార్‌ చెప్పారు. 


చికిత్స పొందుతూ మృతి...పరీక్ష చేస్తే కరోనా పాజిటివ్‌

పురుగు మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందగా, మృతదేహానికి పరీక్ష చేస్తే కరోనా వైరస్‌ ఉందని తేలింది. పెనుమళ్ళకు చెందిన సుబ్బరాజు కుటుంబానికి, వియ్యపురాలు కుటుంబానికి కొద్దిరోజులుగా వివాదం కొనసాగుతుంది. సోమవారం  గ్రామానికి చెందిన కందుకూరి లక్ష్మీనరసింహమూర్తి ఇంటి వద్ద  ఈ వివాదంపై ఇరు కుటుంబాలవారు సమావేశమయ్యారు. ఈ సందర్భంలో పెద్దమనిషిగా వ్యవహరిస్తున్న లక్ష్మీనరసింహమూర్తి సుబ్బరాజును తిట్టడంతో పాటు మూర్తి భార్య ఉమాదేవి అతడి చెంపపై కొట్టింది. ఈ క్రమంలో వియ్యపురాలు అడపా చంద్రకళ సుబ్బరాజు కుమారుడిని కొట్టింది.


మనస్థాపానికి గురైన సుబ్బరాజు సోమవారం సాయంత్రం పురుగుమందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు అతడిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. లక్ష్మీనరసింహమూర్తి, కందుకూరి ఉమ, వియ్యపురాలు అడపా చంద్రకళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గొల్లపాలెం ఎస్‌ఐ పవన్‌కుమార్‌ తెలిపారు. మరోపక్క సుబ్బరాజు మృతదేహానికి జీజీహెచ్‌లో కొవిడ్‌ పరీక్ష చేయగా వైరస్‌ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు కొందరు నా యకులు ప్రయత్నిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2020-07-08T10:28:01+05:30 IST