Abn logo
Mar 27 2020 @ 04:55AM

17 బైకులు సీజ్‌

బనగానపల్లె పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోఽధానికి 144 సెక్షన్‌ విధించినా బైకులపై 17 మంది వాహనదారులను అదుపులోకి తీసుకొని మోటార్‌వాహనాలను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌రెడ్డి గురువారం తెలిపారు. నిబంధనలను ఉల్లంఘింస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.  


నందికొట్కూరు రూరల్‌: కరోనా ప్రభావంతో తెలంగాణ నుంచి రాయలసీమ ప్రాంతానికి రాక పోకలు బందు చేస్తూ నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామ ప్రజలు కంచె, బారికేడ్లు ఏర్పాటు చేశారు. గురువారం అల్లూరు గ్రామ ప్రజలు మాట్లాడుతూ  తమ గ్రామం కృష్ణా, తుంగభద్ర నదీ తీర ప్రాంతం, తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో ఆ రాష్ట్ర ప్రజలు ఎక్కువగా మాగ్రామం నుంచే రాయలసీమ ప్రాంతానికి  రాక పోకలు సాగిస్తున్నారని తెలిపారు. అంతేగాక ఈ మధ్య కాలంలో తుంగభద్ర నదిపై కొత్తగా బ్రిడ్జి కూడా నిర్మించడంతో పోకలు ఎక్కువయ్యాయి అంటున్నారు. 


బన గానపల్లె:

కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో తమ గ్రామంలోకి రావద్దని చిన్నరాజుపాలెం గ్రామ తండా యువకులు రోడ్డుకు అడ్డంగా కంప వేశారు. గురువారం ఉదయం తమ గ్రామంలోకి రాకుండా కంపను అడ్డం వేసి కాపాలాగా ఉన్నారు.


 కొలిమిగుండ్ల:

మా ఊరికి రాకండి, మేము కూడా మీ ఊరికి రాము అంటూ ఆ గ్రామాల ప్రజలు రహదారులకు గొర్విమానుపల్లె గ్రామస్తులు గ్రామానికి వచ్చే దారికి ముళ్లకంపలను అడ్డు పెట్టారు. అలాగే తుమ్మలపెంట గ్రామస్తులు కూడా దారికి ముళ్లకంప, రాళ్లు అడ్డుపెట్టారు. 


 కొలిమిగుండ్లలో మండలం తుమ్మలపెంట్ల, గొర్విమానుపల్లె గ్రామాలకు చెందిన ఐదు మందిని అదుపులోకి తీసుకొని వారు ప్రయాణిస్తున్న ఐదు బైకులను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి గురువారం తెలిపారు. ఈ రెండు గ్రామాల నుంచి మోటారుసైకిళ్లపై ఐదుగురు అవుకు మండలం కొండమనాయునిపల్లె గ్రామానికి వెళ్తుండగా వారిని అదుపులోకి తీసుకొని మోటారుసైకిళ్లను సీజ్‌ చేసినట్లు ఆయన తెలిపారు.  


ఆలూరు:

కొత్తవారు ఎవరూ తమ గ్రామాలకు రావొద్దని గురువారం ఆలూరు మండలంలోని కురుకుంద, అరికెర గ్రామ ప్రజలు రోడ్లపై ముళ్లకంచెలు వేసి రాకపోకలను నిలుపుదల చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 


 ఆస్పరి:

లాక్‌డౌన్‌ పాటిస్తున్న ప్రస్తుత సమయంలో కొత్తవారిని ఎవరినీ తమ గ్రామంలోకి రానివ్వబోమంటూమని గురువారం ఆస్పరి మండలంలోని హలిగేర గ్రామ యువకులు రోడ్డుకు ముళ్లకంచె అడ్డువేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటిద్దామని వైసీపీ నాయకుడు లక్ష్మన్న కోరారు.


కొత్తపల్లి:

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన లాక్‌ డౌన్‌ను అతిక్రమించిన 10 మందికి జరిమానా విధించినట్లు కొత్తపల్లి ఎస్‌ఐ నవీన్‌ బాబు తెలిపారు. గురువారం మండలంలోని ఆయా గ్రామాల్లో 10 మంది వ్యక్తులు మోటర్‌ బైకలపై తిరుగుతూ నిబంధనలు తుంగలో తొక్కడంతో 5350 రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు. 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున ఇల్లు విడిచి బయటకు రావద్దని ప్రజలకు ఎస్‌ఐ సూచించారు.


పత్తికొండ:

లాక్‌డౌన్‌తో పత్తికొండ పట్టణం నిర్మానుష్యంగా మారింది. ఉదయం 5 నుంచి 7గంటల వరకు కూరగాయలు, నిత్యావసరాల కొనుగోలకు ప్రజలకు అవకాశం కల్పించిన పోలీసులు ఆ తర్వాత రహదారులపై రాకపోకలను నిషేధించారు. పలు కాలనీలలో హోటళ్లు, దుకాణాలు తెరవడంతో ప్రజలు గుంపులుగా సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో సీఐ ఆదినారాయణ సిబ్బందితో కల్లుపెంటవీధి, అంజనేయనగర్‌ప్రాంతాలలో పర్యటించారు. ముగ్గురిని అరెస్టు చేసి కేసు చేశారు.


కరోనా అనుమానిత కేసులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని 14రోజులపాటు పరిశీనలో ఉంచేందుకు పత్తికొండ మోడల్‌పాఠశాలలో 100 పడకల క్వారంటైన్‌ను ఏర్పాటు చేశారు. పత్తికొండ ఇన్‌చార్జి తహసీల్దార్‌ శ్రీదేవి, పంచాయితీ ఈవో కృష్ణకుమార్‌తో పాటు సిబ్బంది క్వారంటైన్‌ ఏర్పాట్లను పరిశీలించారు. క్వారంటైన్‌ సిబ్బందితో మాట్లాడారు. 


పత్తికొండటౌన్‌:

పత్తికొండ పట్టణంలో ఎస్సీ కాలనీలో ఇతరులు ప్రవేశించకుండా, వాహనాల రాకపోకల నియంత్రణకు ఆ కాలనీవాసులు ప్రధా న రహదారులకు అడ్డుకట్ట వేశారు. ఇతరులు తమ వీధిలోకి రావద్దని కోరారు.


చిప్పగిరి:

లాక్‌డౌన్‌ అమలులో ఉన్నా నిబంధనలు పాటించని 40 మంది వాహనదారులకు రూ.15 వేలు జరిమానా విధించామని ఎస్‌ఐ తెలిపారు. ఈ డబ్బును ప్రభుత్వ ఖజానాలో జమ చేశామన్నారు. ప్రయాణికులను ఎక్కించుకొని తిరిగిన ఇద్దరు ఆటో డ్రైవర్లపై కేసు నమోదు చేసి ఆటోలను స్వాధీనం చేసుకున్నామన్నారు.


దేవనకొండ:

  మండలంలోని వెంకటాపురం గ్రామ యువకులు తమ గ్రామంలోకి ఇతరులు రాకుండా ఉండేందుకు దారికి అడ్డంగా కంపచెట్లను వేశారు.  


ఆదోని రూరల్‌: 

తమ వీధిలోకి ఎవరూ రాకూడదని ఆదోని చిన్నమార్కెట్‌ వీధి వాసులు అంబులెన్స్‌ను అడ్డంగా ఉంచారు. మండలంలోని కపటి గ్రామ యువకులు గ్రామ శివారులో కంపచెట్లను నరికి రోడ్డుకు అడ్డంగా ఉంచారు.  


హాలహర్వి: 

మండలంలోని బిలేహాల్‌ గ్రామస్థులు తమ గ్రామంలోకి ఇతర గ్రామస్థులను రానివ్వకుండా రోడ్డుకు అడ్డంగా కంపచెట్లును ఉంచారు.  


సంజామల:

మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రజలు బయటికి రాకుండా స్వీయ నిర్భంధంలో ఉన్నారు. దీంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. గ్రామ సరిహద్దుల్లో పోలీసులు పహారా కాస్తూ ద్విచక్ర వాహనాలను సైతం వెళ్లనివ్వకుండా చర్యలు తీసుకున్నారు. ఎస్‌ఐ ప్రియతమ్‌రెడ్డి మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. కొత్త ప్రాంతాల నుంచి వచ్చిన వారు, అనుమానిత వ్యక్తులు ఉంటే వెంటనే వారిని వైద్యశాలలకు తరలించాలని ఆదేశించారు.    


కోవెలకుంట్ల:

కరోనా వైరస్‌ను నియంత్రించడానికి ప్రతి ఒక్కనై సహకరించాలని కోవెలకుంట్ల సీఐ సుబ్బరాయుడు కోరారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పట్టణంలో కోవెలకుంట్ల సీఐ ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుంచి పోలీసులు గస్తీ నిర్వహించారు. ప్రధాన కూడళ్ల వద్ద ఇతర ప్రాంతాల నుంచి వాహనాలు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి ప్రయాణికులు పట్టణాలకు రాకపోవడం, ఇళ్లల్లో నుంచి ప్రజలు కూడా బయటికి రాకుండా 144 సెక్షన్‌ విధించడంతో ప్రధాన వీధులు నిర్మానుష్యంగా మారాయి. అనాలు, నిరుపేద వృద్దులు, ఆసరా లేని వారికి భోజనాలకు ఇబ్బంది పడకుండా కోవెలకుంట్ల సీఐ మానవతా భోజనం ప్యాకెట్లు తెప్పించి స్వయంగా అందించారు. 


మద్దికెర:

మండలంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కిరాణ, కూరగాయల షాపులు తెరిచి ఉంచారు. ప్రజలు నిత్యవసరాలకు తప్ప ఇళ్లకే పరిమితమయ్యారు. గురువారం ఎస్‌ఐ మస్తాన్‌వలి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది నిరంజన్‌ప్రసాద్‌, అక్బర్‌బాషా, రామ్మోహన్‌ల నేతృత్వంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వివరాలను సేకరించి వైద్య నిమిత్తం పత్తికొండకు తరలించారు. అన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలు చేశారు. 144 సెక్షన్‌కు విరుద్ధంగా తిరిగే వారిపై లాఠీచార్జీ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement