Abn logo
Oct 23 2021 @ 16:32PM

20 లక్షల ఉద్యోగాలు.. విద్యుత్ బిల్లుల మాఫీ: యూపీలో ప్రియాంక గాంధీ హామీలు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ జోరు పెంచింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నేడు (శనివారం) మూడు ‘ప్రతిగ్య యాత్రలు’ ప్రారంభించారు. ఈ మూడు యాత్రలు వేర్వేరు మార్గాల గుండా బయలుదేరుతాయి. ఇందులో ఒకటి బారాబంకి నుంచి బుందేల్‌ఖండ్, రెండోది సహరాన్‌పూర్ నుంచి మథుర, మూడోది వారణాసి నుంచి రాయబరేలి చేరుకుంటాయి. నవంబరు 1 వరకు ఇవి కొనసాగుతాయి. 

బారాబంకిలో యాత్ర ప్రారంభం సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే రుణమాఫీ, 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యుత్ బిల్లుల మాఫీ, కరోనా బాధితులకు రూ. 25 వేల పరిహారం ఇస్తామని ప్రకటించారు.


ఈ ఎన్నికల్లో 40 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తామని ప్రియాంక ఇది వరకే ప్రకటించారు. అలాగే, 12వ తరగతి విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్లు, గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారికి ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రియాంక తాజాగా ప్రకటించారు.


ఇటీవలి లఖింపూర్ ఖేరీ ఘటనపై మాట్లాడుతూ.. కేంద్రమంత్రి కుమారుడు వాహనంతో రైతులను తొక్కించి చంపేశాడని, అతడిని అరెస్ట్ చేయడంలో చాలా రోజులపాటు ప్రభుత్వం మీనమేషాలు లెక్కించిందని మండిపడ్డారు. దీనిని బట్టి ప్రభుత్వం రైతులకు ఇచ్చే ప్రాధాన్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని అన్నారు. 


యూపీలో ప్రియాంక ఇచ్చిన హామీలు..

* 12వ తరగతి విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్లు, గ్రాడ్యుయేషన్ చదువుతున్న అమ్మాయిలకు స్కూటీలు 

* రైతు రుణాల మాఫీ 

* చత్తీస్‌గఢ్‌లోలానే యూపీలోనూ గోధుమలు, వరికి రూ. 2500 ధర. చెరకు క్వింటాల్‌కు రూ. 400 మద్దతు ధర 

* కరోనా కాలం నాటి విద్యుత్ బిల్లుల పూర్తిగా మాఫీ. అలాగే, ప్రతి ఒక్కరి బిల్లు సగానికి తగ్గింపు 

* కరోనా సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పేదకు రూ. 25 వేల ఆర్థిక సాయం 

* 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు కృషి. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ  

ఇవి కూడా చదవండిImage Caption