Abn logo
Oct 14 2021 @ 01:22AM

బొగ్గుకు ఢోకా లేదు!

మంగళవారానికే 20 లక్షల టన్నులు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి 

న్యూఢిల్లీ, అక్టోబరు 13: బొగ్గు నిల్వల కొరత కారణంగా.. విద్యుత్‌ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోందని వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. విద్యుదుత్పత్తి ప్లాంట్లకు బొగ్గు సరఫరాను పెంచినట్టు బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. మంగళవారం నాటికే బొగ్గు సరఫరా 20 లక్షల టన్నులు దాటిందని, ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. విద్యుదుత్పత్తి సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని ట్విటర్‌లో హామీ ఇచ్చారు. ఇదిలావుంటే, గడిచిన రెండు రోజుల్లో రోజుకు 1.62 మిలియన్‌ టన్నులకు తగ్గకుండా బొగ్గును సరఫరా చేసినట్టు కోల్‌ ఇండియా అధికారులు తెలిపారు. మరోవైపు మూడో దఫా బొగ్గు గనుల వేలానికి ఇదే సరైన సమయమని బొగ్గు గనుల శాఖ కార్యదర్శి ఏకే జైన్‌ అన్నారు. బొగ్గు ఉత్పత్తి ఎక్కువగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో కేంద్ర మంత్రి జోషి పర్యటిస్తున్నారు. దేశంలో బొగ్గు కొరత ఏర్పడిందన్న వార్తల నేపథ్యంలో ఆయన క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని గేవ్రా, డిప్కా, కుస్ముండా బొగ్గు క్షేత్రాలను పరిశీలించారు. అనంతరం జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌తో సమావేశమై చర్చించారు. ఇక .. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నవరత్న కంపెనీ ఎన్‌ఎల్‌సీ ఈ ఏడాది ఒడిసా గనుల్లో బొగ్గు ఉత్పత్తిని 10 మిలియన్‌ టన్నులకు పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. 


ఉత్పత్తి పెరుగుతుంది: ఐసీఆర్‌ఏ

విద్యుదుత్పత్తి సంస్థలకు బొగ్గు విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం లేదని, ఈ నెలలో బొగ్గు ఉత్పత్తి క్రమంగా పెరుగుతుందని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ ఐసీఆర్‌ఏ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక.. బొగ్గు పంపిణీని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ భారత అల్యూమినియం పరిశ్రమల సంఘం(ఏఏఐ), కోల్‌ ఇండియా లిమిటెడ్‌(సీఐఎల్‌) చైర్మన్‌ ప్రమోద్‌ అగర్వాల్‌కు ఏఏఐ లేఖ రాసింది. దేశంలో బొగ్గు కొరత ఏర్పడిందన్న వార్తలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తోసిపుచ్చారు. ఆ వార్తలు పూర్తిగా నిరాధారమని నొక్కి చెప్పారు. దేశంలో మిగులు విద్యుత్‌ ఉందని తెలిపారు.