200మంది బాధితులు సేఫ్‌

ABN , First Publish Date - 2021-05-07T17:02:26+05:30 IST

ఆక్సిజన్‌ కొరతతో రోజూ దేశంలోని పలు చోట్ల కొవిడ్‌ బాధితులు అకాలమరణం చెందుతున్నారు. ఐదు రోజులక్రితం చామరాజనగర్‌ జిల్లాసుపత్రిలో ఆక్సిజన్‌ కొరతతో 24మంది మృత్యువాత చెందిన విషయం తెలిసిందే.

200మంది బాధితులు సేఫ్‌

- తప్పిన భారీ ముప్పు

- కేసీ జనరల్‌ ఆస్పత్రి లో ‘ఆపరేషన్‌ ఆక్సిజన్‌’ 

- రాత్రికి రాత్రే జంబో సిలిండర్ల తరలింపు


బెంగళూరు: ఆక్సిజన్‌ కొరతతో రోజూ దేశంలోని పలు చోట్ల కొవిడ్‌ బాధితులు అకాలమరణం చెందుతున్నారు. ఐదు రోజులక్రితం చామరాజనగర్‌ జిల్లాసుపత్రిలో ఆక్సిజన్‌ కొరతతో 24మంది మృత్యువాత చెందిన విషయం తెలిసిందే. బెంగళూరులోని మల్లేశ్వరం కేసీ జనరల్‌ ఆసుపత్రిలో బుధవారం రాత్రి అదే పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి వైద్యులు, డీసీఎం అశ్వత్థనారాయణ రాత్రంతా కార్యాచరణ జరిపి 200 మంది కొవిడ్‌ బాధితులను కాపాడారు. ఏ మాత్రం పొరపాటు జరిగియున్నా 200 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. కేసీ జనరల్‌ ఆసుపత్రిలో వంద పడకల ఐసీయూ వెంటిలేటర్‌, వంద ఆక్సిజన్‌ సహిత పడకలపై కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి ఆక్సిజన్‌ ఖాళీ అవుతుండడాన్ని గుర్తించారు. రాత్రి 11 గంటలకు ప్రాక్సి ఎయిర్‌ అనే కంపెనీ ఆక్సిజన్‌ను సమకూర్చాల్సి ఉండేది. బళ్ళారి నుంచి రావాల్సిన సదరు సంస్థ ట్యాంకర్‌ రాత్రి 12 గంటలైనా ఆసుపత్రికి చేరుకోలేదు. ఇక్కడికి రాకుండానే ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిందనే అంశం మరింత బెంబేలెత్తించింది. ఆక్సిజన్‌ను పర్యవేక్షించే వైద్యాధికారి డాక్టర్‌ రేణుకాప్రసాద్‌కు సాంకేతిక సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఆమె ప్రాక్సీ ఎయిర్‌ సంస్థ ప్రతినిధులతో చర్చించే ప్రయత్నాలు ఫలించలేదు. రాత్రి 12.30 గంటలకు ఉపముఖ్యమంత్రి డాక్టర్‌ అశ్వత్థనారాయణకు సమాచారం చేరవేశారు. వెంటనే ఆయన రంగంలోకి దిగి యూనివర్శల్‌ కంపెనీ నుంచి ఆక్సిజన్‌ను సమకూర్చారు. మల్లేశ్వరం పోలీసులతో మాట్లాడి జీరో ట్రాఫిక్‌ ద్వారా 20 జంబో సిలిండర్లను తెప్పించారు. తెల్లవారు 4.45 గంటలదాకా వైద్యులు, సాంకేతిక సిబ్బంది, వాహనం డ్రైవర్‌, యూనివర్శల్‌ కంపెనీ ప్రతినిధులు వరకు ప్రయత్నించి ఎట్టకేలకు ఆక్సిజన్‌ను సకాలంలో ఆసుపత్రికి చేరేలా చేశారు. మరోవైపు 200 మంది బాధితులపైనా వైద్యులు ప్రత్యేక ప ర్యవేక్షణ చేశారు. ఇలా అందరికీ ఆక్సిజన్‌ను అందించగలిగారు. డీసీఎం అశ్వత్థనారాయణ చొరవ, డాక్టర్లు సకాలంలో స్పందించిన విధానంపై బాదితుల బంధువులు కొనియాడారు. కాగా తెల్లవారు తర్వాత లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్‌ కూడా యూనివర్శల్‌ కంపెనీ నుంచి వచ్చింది.

Updated Date - 2021-05-07T17:02:26+05:30 IST