వరి కోతలు షురూ..

ABN , First Publish Date - 2020-04-08T10:11:03+05:30 IST

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో గోదావరి జలా లు సిరిసిల్ల జిల్లాకు చేరి ఈసారి రైతుల పంట పండింది. రైతులు వరిసాగును పెంచుకున్నారు.

వరి కోతలు షురూ..

జిల్లాలో 212 కొనుగోలు కేంద్రాలు 

రైతులకు కూపన్ల పంపిణీకి ఏర్పాట్లు

జిల్లాలో 1,32,992 ఎకరాల్లో వరి సాగు 

రేపటి నుంచి ప్రారంభానికి సన్నాహాలు 


(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో గోదావరి జలా లు సిరిసిల్ల జిల్లాకు చేరి ఈసారి రైతుల పంట పండింది. రైతులు వరిసాగును పెంచుకున్నారు. వరికోతలు మొదలయ్యే క్రమంలోనే కరోనా ఎఫెక్ట్‌తో ఆందోళన మొదలైంది. కొనుగోళ్లపై డైలామా ఏర్పడింది. ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోళ్లు చేస్తామని ప్రకటించడంతో రైతులు ఊరట చెందారు. లాక్‌డౌన్‌ కరోనా భయంతో వ్యవసాయ కూలీలు కోతలకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో హార్వేస్టర్ల ద్వారా రైతులు వరికోతలు మొదలు పెట్టారు.


జిల్లా వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి ధాన్యం గింజను రైతు లు అమ్ముకునే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈనెల 9 నుంచి కొనుగోళ్లు ప్రారంభించడానికి అధికారులు సిద్ధమయ్యారు. ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత రావడంతో యాసంగి వరికోతల జోరు మొదలైంది. జిల్లాలో  141 హార్వేస్టర్లు ఉన్నాయి. ఇప్పటికే అవి ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో తిరిగి వాటిని రప్పించుకునే పనిలో జిల్లా రైతులు సిద్ధమయ్యారు. హార్వేస్టర్లకు డిమాండ్‌ కూడా పెరిగింది. లాక్‌డౌన్‌లో హార్వేస్టర్లకు ఎలాంటి ఇబ్బంది కలిగించమని అధికారులు చెప్పడంతో నిర్వాహకులు కూడా ఉత్సాహంగా వరికోతలకు ముందుకు వస్తున్నారు. 


జిల్లాలో 1,32,992 ఎకరాల్లో వరిసాగు 

జిల్లా వ్యాప్తంగా గతంలో కంటే ఎక్కువగా వరిసాగు చేశారు. రబీలో 32,992 ఎకరాల్లో వరిసాగు చేయగా.. 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా జిల్లావ్యాప్తంగా 212 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రం ఉండే విధంగా చర్యలు తీసుకున్నా రు. కరోనా నియంత్రణలో భాగంగా కొనుగోలు కేం ద్రాల వద్ద సబ్బులు, నీళ్లు, అందుబాటులో ఉంచనున్నారు. ముందుగానే రైతులకు కూపన్లు పంపి ణీ చేయనున్నారు.


దీని ప్రకారమే రైతులు ధాన్యా న్ని తీసుకవచ్చి అమ్ముకునే విధంగా చర్యలు చేపట్టారు. జిల్లాలో వరిసాగులో సిరిసిల్లలో 2607 ఎకరాలు సాగు కాగా.. వీర్నపల్లిలో 6679 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 15,112 ఎకరాలు, గంభీరావుపేటలో 15,527 ఎకరాలు, ముస్తాబాద్‌లో 15,543 ఎకరాలు, తంగళ్లపల్లిలో 13,527 ఎకరాలు, ఇల్లంతకుంటలో 15,235 ఎకరాలు, వేములవాడ అర్బన్‌లో 4,096 ఎకరాలు, వేములవాడలో 8638 ఎకరాలు, చందుర్తిలో 9886 ఎకరాలు, రుద్రంగిలో 3232 ఎకరాలు, కోనరావుపేటలో 10850 ఎకరాలు, బోయినపల్లిలో 12144 ఎకరాలు సాగు చేశారు. దిగుబడి అధికంగా వచ్చినా వరికోతలు విషయం లో ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. 


రైతులు ఆందోళన చెందవద్దు.. కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

జిల్లాలో వరిధాన్యం అమ్ముకోవడంలో రైతులు ఆందోళన చెందవద్దు. ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం. రైతులకు టోకెన్లు ఇచ్చి.. మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం. మద్దతు ధర కంటే తక్కువకు దళారులకు అమ్మి మోసపోవద్దు. రైతులకు అందుబాటులో గ్రామాల్లోనే కొనుగోలు చేస్తాం. కరోనా వైర స్‌ కట్టడిలో భాగంగా కేంద్రాల వద్ద జాగ్రత్తలు పాటించాలి.

Updated Date - 2020-04-08T10:11:03+05:30 IST