ఒకే రోజు 67 వేల కేసులు

ABN , First Publish Date - 2020-08-14T07:11:52+05:30 IST

అటు అత్యధిక సంఖ్యలో కేసులు.. ఇటు భారీగా మరణాలు.. ఇదీ దేశంలో కరోనా తీరు. గురువారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 67 వేల మంది వైరస్‌ బారినపడగా...

ఒకే రోజు 67 వేల కేసులు

  • 24 లక్షలకు చేరిన కరోనా బాధితులు 


న్యూఢిల్లీ, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): అటు అత్యధిక సంఖ్యలో కేసులు.. ఇటు భారీగా మరణాలు.. ఇదీ దేశంలో కరోనా తీరు. గురువారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 67 వేల మంది వైరస్‌ బారినపడగా, 942 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఇదే సమయంలో 56,383 మంది కోలుకున్నారని తెలిపింది. బుధవారం రికార్డు స్థాయిలో 8.30 లక్షల పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. బాధితుల సంఖ్య 24 లక్షలకు చేరగా, మరణాలు 47 వేలు దాటాయి. కరోనా మృతుల సంఖ్యలో బ్రిటన్‌ను దాటి భారత్‌ ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరింది. అమెరికా, బ్రెజిల్‌, మెక్సికోల్లో మనదగ్గర కంటే ఎక్కువ మరణాలున్నాయి. దేశంలో రికవరీ రేటు 70.77కి చేరిందని, మరణాల రేటు 1.96కి తగ్గిందని కేంద్రం వివరించింది.


మార్చి 11వ తేదీ నుంచి రాష్ట్రాలకు 3 కోట్ల ఎన్‌ 95 మాస్క్‌లు, 1.28 కోట్ల పీపీఈ కిట్లు, 10 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను ఉచితంగా అందించినట్లు తెలిపింది. బిహార్‌లో ప్రస్తుతం కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 4 వేలమంది వైరస్‌ బారినపడ్డారు. ఒడిశాలో రెండు వేల కేసులు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో కొన్నిరోజులుగా బాధితుల సంఖ్య 4,500పైనే ఉంటోంది. తమిళనాడులో మరో 5,835 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కరోనా నెగిటివ్‌ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. మహారాష్ట్రలో గురువారం 11,813 కొత్త కేసులు రికార్డయ్యాయి. కాగా, కరోనా మరణాలను యూకే భారీగా తగ్గించింది. వైర్‌సతో మృతిచెందినవారి జాబితా నుంచి 5,377 మరణాలను తొలగించింది. దీంతో నిన్నటివరకు యూకేలో మృతుల సంఖ్య 46,706 ఉండగా, తాజాగా 41,329 అయింది. కాగా, బ్రెజిల్‌ నుంచి వస్తున్న చికెన్‌ వింగ్స్‌లో కరోనా వైరస్‌ ఉన్నట్టు చైనా ఆరోపించింది.  



రామ మందిర ట్రస్ట్‌ చీఫ్‌కు వైరస్‌

అయోధ్య రామాలయ ట్రస్ట్‌ అధ్యక్షుడు మహంత్‌ నృత్యగోపాల్‌ దాస్‌ (80)కు కరోనా సోకింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సూచన మేరకు ఆయన గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. ఆయన కాంటాక్ట్‌లను గుర్తిస్తున్నట్లు మథుర కలెక్టర్‌ సర్వగ్య రామ్‌ తెలిపారు. ఈ నెల 5వ తేదీన రామాలయ భూమిపూజలో ప్రధాని మోదీతో కలిసి నృత్యగోపాల్‌ వేదిక పంచుకున్నారు. ఇందులో యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎ్‌సఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ కూడా పాల్గొన్నారు. కాగా, నృత్యగోపాల్‌ బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు మథురలో అభిషేకాలు నిర్వహించడం గమనార్హం. 


Updated Date - 2020-08-14T07:11:52+05:30 IST