రేషన్‌ బియ్యం భారీగా పట్టివేత

ABN , First Publish Date - 2021-09-29T05:50:13+05:30 IST

మండలంలోని చినదొడ్డిగల్లులో తరలించడానికి సిద్ధంగా వున్న 24 టన్నుల రేషన్‌ బియ్యం పట్టుకున్నట్టు ఎస్‌ఐ డి.వెంకన్న తెలిపారు.

రేషన్‌ బియ్యం భారీగా పట్టివేత
స్వాధీనపర్చుకున్న రేషన్‌ బియ్యం,కేసు నమోదు చేస్తున్న పోలీసులు

నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లులో 24 టన్నులు స్వాధీనం

లారీ, మినీవ్యాన్‌  సీజ్‌, ముగ్గురిపై కేసు నమోదు


నక్కపల్లి, సెప్టెంబరు 28: మండలంలోని చినదొడ్డిగల్లులో తరలించడానికి సిద్ధంగా వున్న 24 టన్నుల రేషన్‌ బియ్యం పట్టుకున్నట్టు ఎస్‌ఐ డి.వెంకన్న తెలిపారు. దీనికి సంబంధించి మంగళవారం ఆయన ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ, చినదొడ్డిగల్లు గ్రామం నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు రేషన్‌ బియ్యం తరలిస్తున్నట్టు సమాచారం అందిందని చెప్పారు. దీంతో సిబ్బంది కలిసి గ్రామానికి వెళ్లగా... ఒక లారీ, ఒక మినీ వ్యాన్‌లోకి బియ్యం లోడింగ్‌ చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా 24 టన్నుల బియ్యం (960 బస్తాలు... ఒక్కొక్కటి 25 కిలోలు) పట్టుకున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి చినదొడ్డిగల్లుకు చెందిన బొల్లం అప్పారావు, కాకినాడకు చెందిన లారీ డ్రైవర్‌ నీలి సత్యనారాయణ, మినీ వ్యాన్‌ డ్రైవర్‌ రామకృష్ణలపై కేసు నమోదు చేసి, రెండు వాహనాలను సీజ్‌ చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని తదుపరి చర్యల నిమిత్తం పౌరసరఫరాల శాఖ ధికారులకు అప్పగించామని ఎస్‌ఐ వెంకన్న చెప్పారు.


కొంగసింగిలో 700 కిలోల రేషన్‌ బియ్యం పట్టివేత

ఇద్దరిపై కేసు నమోదు, ఆటో సీజ్‌

కృష్ణాదేవిపేట, సెప్టెంబరు 28 : గొలుగొండ మండలం కొంగసింగి శివారులో ఆటోలో తరలిస్తున్న 700 కిలోల రేషన్‌ బియ్యాన్ని డ్వాక్రా మహిళలు మంగళవారం తెల్లవారుజామున పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించి కృష్ణాదేవిపేట ఎస్‌ఐ ఎ.సూర్యనారాయణ వివరాలు వెల్లడిస్తూ... కొంగసింగి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కొంకిపూడి రమణ గ్రామంలో రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి తూర్పుగోదావరి జిల్లా కోటనందూరులోని రైస్‌బిల్లుకు తరలిస్తున్నట్టు చెప్పారు. ఇతనితోపాటు ఆటో డ్రైవర్‌ నూకరాజుపై కేసు నమోదు చేశామని, బియ్యం స్వాధీనం చేసుకుని ఆటోని సీజన్‌ చేశామని పేర్కొన్నారు. కాగా రేషన్‌ బియ్యం కొనుగోళ్ల గురించి గ్రామ వలంటీర్లకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో తామే పట్టుకుని పోలీసులకు అప్పగించామని డ్వాక్రా మహిళలు తెలిపారు. 


Updated Date - 2021-09-29T05:50:13+05:30 IST