246 పాఠశాలల తరలింపు

ABN , First Publish Date - 2021-10-22T04:54:49+05:30 IST

నూతన విద్యావిధానంలో భాగంగా ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలంటూ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ వి.చినవీరభద్రుడు గురువారం ఆదేశాలు జారీ చేశారు.

246 పాఠశాలల తరలింపు
హైస్కూల్‌లో విలీనం కానున్న మామిడిపల్లి ప్రాథమిక పాఠశాల

ఒకటి నుంచి ఎన్‌ఈపీ అమలు

3 నుంచి 5 తరగతుల విలీనం

ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ

సాలూరు రూరల్‌, అక్టోబరు 21:నూతన విద్యావిధానంలో భాగంగా ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలంటూ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ వి.చినవీరభద్రుడు గురువారం ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఇప్పటికే జిల్లాలో కసరత్తు జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 246 పాఠశాలల నుంచి 3,4,5 తరగతులు విలీనం కానున్నాయి. 250 మీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో ఈ నెల 31 నాటికి విలీనం చేయాలనే ఆదేశాలు రావడంతో ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు కసరత్తు వేగవంతం చేస్తున్నారు. పాఠశాలల విలీనానికి తొలుత మూడు కిలోమీటర్ల పరిధిలో మ్యాపింగ్‌ చేశారు. అనంతరం కాస్త సవరించారు. తొలిదశలో 250 మీటర్ల పరిమితిని విధించడంతో ఆ విధంగా మ్యాపింగ్‌ చేశారు. ఈ మ్యాపింగ్‌లో 246 పాఠశాలలను గుర్తించారు. ఉన్నత పాఠశాలల్లో విలీనంతో వచ్చే నెల ఒకటి నుంచి తరగతుల నిర్వహణకు విద్యాశాఖ ఆదేశించింది. ఈమేరకు సంబంధిత అధికారులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. నెలాఖరుకు తరగతుల బోధన, మధ్యాహ్న భోజన పథకం అమలు, హాజరు తదితర అన్ని పనులు పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఒకరిద్దరు ఉపాధ్యాయులే బోధిస్తున్నందున 18 సబ్జెక్టులను చెప్పలేకపోతున్నారని అధికారవర్గాలు అంటున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎన్‌ఈపీ (న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ)లో భాగంగా 3 నుంచి 5 తరగతులకు సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులు, 1,2 రెండు తరగతులకు ప్రత్యేక ఉపాధ్యాయులు బోధించేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల దూరంలో ఉన్న 246 పాఠశాలలను తొలిదశలో విలీనం చేయనున్నారు. ఆ పాఠశాలల్లో ఉన్న 1,2 రెండు తరగతులు మాత్రం అక్కడే కొనసాగుతాయి. 1, 2 తరగతులు బోధించేందుకు ఎస్జీటీలను 1:30 నిష్పత్తిలో నియమించనున్నారు. ఎస్జీటీల్లో జూనియర్‌ను 1,2 తరగతుల బోధనకు పంపుతారు. సీనియర్‌ ఎస్జీటీకి 3 నుంచి 10 తరగతుకు బోధించే అర్హతలు లేకుంటే జూనియర్‌కు ఆ అర్హతలుంటే వారిని వినియోగించనున్నారు. 3 నుంచి 10తరగతులకు ఉన్నత పాఠశాల్లో సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులు, ప్రాథమిక తరగతుల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు బోధించనున్నారు. ఉన్నత పాఠశాలల్లో 3 నుంచి 10తరగతులకు సరిపడా వసతి లేకుంటే ప్రాథమిక పాఠశాలల తరగతి గదుల్లో 3, 4, 5 తరగతులను సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులతో నిర్వహించనున్నారు. విలీన ప్రక్రియను శరవేగంగా పూర్తి చేయడానికి అధికారులు సమాయత్తమయ్యారు. 

ఎన్‌ఈపీకి వ్యతిరేకం

3,4,5 తరగతుల విలీనానికి మేం వ్యతిరేకం. ఎన్‌ఈపీలో ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. విలీనం వల్ల ఉన్నత పాఠశాలలో వసతి సమస్య, సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులపై పనిభారం పెరుగుతుంది. విలీనాన్ని ఆపస్‌ వ్యతిరేకించింది. విలీన చర్యలను నిలిపేయాలి. 

- జాగాన రామునాయుడు, ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం (ఆపస్‌) రాష్ట్ర సహాధ్యక్షుడు



Updated Date - 2021-10-22T04:54:49+05:30 IST