రైతులకు రూ.3 లక్షల రుణమాఫీ

ABN , First Publish Date - 2022-09-06T08:54:35+05:30 IST

గుజరాత్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ సోమవారం ప్రకటించారు.

రైతులకు రూ.3 లక్షల రుణమాఫీ

10 లక్షల ఉద్యోగాలు..బాలికలకు ఉచిత విద్య.. ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఫ్రీ కరెంటు

గుజరాత్‌ ప్రజలకు రాహుల్‌ గాంధీ హామీ 


అహ్మదాబాద్‌, సెప్టెంబరు 5: గుజరాత్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ సోమవారం ప్రకటించారు. వ్యవసాయ ఆధారిత, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా యువతకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. గుజరాత్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ సోమవారం రాష్ట్రంలో పర్యటించారు. బూత్‌ స్థాయి పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అహ్మదాబాద్‌లో పరివర్తన్‌ సంకల్ప్‌ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ‘కాంగ్రె్‌సకు అధికారమిస్తే ప్రతి ఇంటికి 300 యూనిట్ల దాకా ఉచితంగా కరెంటు ఇస్తాం. వంటగ్యాస్‌ సిలిండర్‌ను రూ.500కే ఇస్తాం. పాల ఉత్పత్తిదారులకు రూ.5 ప్రోత్సాహకం ఇస్తాం. రాష్ట్రంలో  3వేలకు పైగా ఇంగ్లిష్‌ మీడియం బడులను నిర్మిస్తాం. బాలికలకు ఉచితంగా విద్యనందిస్తాం’ అని రాహుల్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. సర్దార్‌ పటేల్‌ వారసత్వాన్ని బీజేపీ అవమానిస్తోందని ఆరోపించారు. పటేల్‌ తన జీవితాంతం రైతు ల కోసం పోరాడితే.. బీజేపీ రైతు వ్యతిరేకిగా మారిందన్నారు. ఓ వైపు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పటేల్‌ విగ్రహాన్ని నిర్మించిన బీజేపీ, మరోవైపు ఆయన ఆదర్శాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. గుజరాత్‌ మోడ ల్‌ అంటే ముగ్గురు నలుగురు పారిశ్రామికవేత్తలు పరిపాలించడమేనా అని విమర్శించారు. గుజరాత్‌లోని ముంద్రా తీరంలో ఇటీవలి కాలంలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడిన విషయాన్ని రాహుల్‌ ప్రస్తావించారు. 


కాంగ్రె్‌సలో విభేదాల్లేవు: జైరాం రమేశ్‌

కాంగ్రె్‌సలో ఎలాంటి విభేదాల్లేవని, తమది అత్యంత ప్రజాస్వామిక పార్టీ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ నేతలు ఎవరైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇటీవలే పార్టీ నుంచి వెళ్లిపోయిన ఆజాద్‌ కాంగ్రె్‌సపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.  

Updated Date - 2022-09-06T08:54:35+05:30 IST