రోజూ 4వేల కేసులు రావొచ్చు

ABN , First Publish Date - 2021-05-11T05:18:04+05:30 IST

జిల్లాలో మున్ముందు రోజూ 4వేల పాజిటివ్‌ కేసులు రావచ్చని కలెక్టర్‌ వీరపాండియన్‌ అన్నారు.

రోజూ 4వేల కేసులు రావొచ్చు

  1. బాధితులు త్వరగా కోలుకుని ఇంటికెళ్లాలి   
  2. కలెక్టర్‌ వీర పాండియన్‌ 8 అధికారులతో సమీక్ష



కర్నూలు(కలెక్టరేట్‌), మే 10:
జిల్లాలో మున్ముందు రోజూ 4వేల పాజిటివ్‌ కేసులు రావచ్చని కలెక్టర్‌ వీరపాండియన్‌ అన్నారు. కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించి వారు త్వరగా కోలుకునేలా చేసి ఇంటికెళ్లేందుకు కృషి చేయాలన్నారు. కొవిడ్‌ నియంత్రణ, చికిత్సపై ఆయన కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మెడికల్‌ ఆక్సిజన్‌ దుర్వినియోగానికి పాల్పడినా, బ్లాక్‌ మార్కెటింగ్‌ చేసినా, ఎక్కువ సంఖ్యలో సిలిండర్లు దాచి పెట్టినా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాధితులు హోం ఐసొలేషన్‌ కన్నా కొవిడ్‌ హాస్పిటల్స్‌, కేర్‌ సెంటర్స్‌లోనే ఎక్కువమంది ఉన్నారన్నారు. బాధితులు త్వరగా కోలుకునేందుకు డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది కృషి చేయాలన్నారు. పరిశ్రమల శాఖ, డ్రగ్‌ కంట్రోల్‌, పోలీసు, ఆర్‌అండ్‌ బీ, ఎలక్ట్రికల్‌, రవాణా తదితర శాఖల అధికారులతో పాటు కర్ణాటక, ఒరిసా అధికారులతో తాను, జేసీ (రెవెన్యూ) వ్యక్తిగతంగా సమన్వయం చేసుకుంటూ మెడికల్‌ ఆక్సిజన్‌ను తెప్పిస్తున్నామన్నారు. జీజీహెచ్‌లో అదనంగా మరో 1 ఎంటీపీఎస్‌ఏ మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ నెలకొల్పామని, ప్రైవేటు కొవిడ్‌ హాస్పిటళ్లలో కూడా వీటిని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఆక్సిజన్‌ అవసరం అయితే నోడల్‌ అధికారి ద్వారా కనీసం 4 గంటల ముందు వార్‌ రూమ్‌కు ఇండెంట్‌ ఇవ్వాలన్నారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ రెండో డోసు అవసరం ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలని సూచించారు. పోలీసు అధికారుల సహకారంతో కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని ఆర్డీవోలను, మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. నంద్యాల శాంతిరామ్‌ హాస్పిటల్‌, కర్నూలు విశ్వభారతి కొవిడ్‌ హాస్పిటల్స్‌ ఇంకా సిబ్బందిని పెంచుకోవాలన్నారు. ల్యాబ్‌ టెస్టింగ్‌ ఫలితాలు 24 గంటల్లో ఇవ్వాలని డీఎంహెచ్‌వో, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో జేసీ (రెవెన్యూ) రాంసుందర్‌ రెడ్డి, జేసీ (సంక్షేమం) శ్రీనివాసులు, నగర పాలక కమిషనర్‌ డీకే బాలాజీ, నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, డీఆర్వో పుల్లయ్య, డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య, ఆర్‌డీవోలు, జిల్లా నోడల్‌ కమిటీల అధికారులు కొవిడ్‌ హాస్పిటల్స్‌ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.    

Updated Date - 2021-05-11T05:18:04+05:30 IST