4 వారాలు కీలకం

ABN , First Publish Date - 2021-04-07T06:54:50+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి గతంలో కంటే మరింత తీవ్రతతో వేగంగా వ్యాపిస్తోందని కేంద్ర ప్రభుత్వం

4  వారాలు  కీలకం

  • వైరస్‌ వ్యాప్తి తీవ్రం.. రెండో దశలో గతం కంటే వేగంగా మహమ్మారి
  • మహారాష్ట్ర, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఆందోళనకరం
  • పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో అధిక సంఖ్యలో మరణాలు
  • ఉధృతి ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రాలకు 50 బృందాలు
  • కట్టడిలో ప్రజల భాగస్వామ్యమే ముఖ్యం: కేంద్రం
  • రాష్ట్రాలు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు పెంచాలని సూచన
  • చాపకింద నీరులా కరోనా సెకండ్‌వేవ్‌ 
  • గత నెలరోజుల్లో 4.5 రెట్లు పెరిగిన మరణాలు
  • నిబంధనలు పాటించకుంటే చేయిదాటే ప్రమాదం 


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6: దేశంలో కరోనా మహమ్మారి గతంలో కంటే మరింత తీవ్రతతో వేగంగా వ్యాపిస్తోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. రాబోయే నాలుగు వారాలు అత్యంత కీలకమని.. సెకండ్‌ వేవ్‌ కట్టడిలో ప్రజా భాగస్వామ్యమే ముఖ్యమని పేర్కొంది. దేశంలో కరోనా పరిస్థితిపై మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌, నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ (ఆరోగ్యం) మాట్లాడారు.


మహారాష్ట్ర, పంజాబ్‌, ఛత్తీ్‌సగఢ్‌లో పరిస్థితి తీవ్రంగా ఉందని, జనాభా, విస్తీర్ణంలో చిన్న రాష్ట్రాలైన ఛత్తీ్‌సగఢ్‌, పంజాబ్‌లలో మరణాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని రాజేశ్‌ భూషణ్‌ అన్నారు. దేశంలో యాక్టివ్‌ కేసులు అధికంగా ఉన్న 10 జిల్లాల్లో ఛత్తీ్‌సగఢ్‌లోని దుర్గ్‌ కూడా ఒకటని పేర్కొన్నారు. మిగతా 9 జిల్లాల్లో ఏడు మహారాష్ట్రలో, కర్ణాటక, ఢిల్లీలో ఒక్కోటి ఉన్నాయని తెలిపారు. కాగా, కేసులు అధికంగా నమోదవుతూ, మరణాలు అధికంగా ఉన్న ఈ రెండు రాష్ట్రాలతో  పాటు మహారాష్ట్రకు 50 అత్యున్నత బృందాలను పంపినట్లు రాజేశ్‌ భూషణ్‌ వివరించారు.


 ఇందులో 30 బృందాలు మహారాష్ట్రలో, 11 ఛత్తీ్‌సగఢ్‌లో, 9 పంజాబ్‌లో పర్యటిస్తాయని పేర్కొన్నారు. టీకా పంపిణీలో గుజరాత్‌, బెంగాల్‌ ముందున్నాయని తెలిపారు. మహారాష్ట్రలో ఫిబ్రవరి 10- 16 తేదీల మధ్య రోజువారీ సగటు కేసులు 3,051 ఉండగా.. మార్చి 31-ఏప్రిల్‌ 6కు 44 వేలకు, మరణాలు 32 నుంచి 250కి పెరిగాయన్నారు. పాజిటివ్‌ రేటు 6.21 నుంచి 24.41కు చేరిందన్నారు. రాష్ట్రాలు ఆర్టీపీసీఆర్‌ పరీక్షల సంఖ్య పెంచాలని కేంద్రం సూచించింది. మహారాష్ట్రలో కొద్ది వారాలుగా మొత్తం టెస్టుల్లో 60 శాతమే ఆర్టీపీసీఆర్‌ టెస్టులు ఉంటున్నాయని వీటి సంఖ్య 70 శాతంపైగా ఉండేలా చూడాలని చెప్పినట్లు రాజేశ్‌ భూషణ్‌ పేర్కొన్నారు.




అవసరమైన వారికే టీకా

అందరికీ టీకా ఎందుకు ఇవ్వడం లేదని చాలామంది ప్రశ్నిస్తున్నారని.. మరణాల నిరోధం, ప్రజారోగ్య వ్యవస్థను కాపాడుకోవడం అనే అంశాలను విషయాలను వ్యాక్సిన్‌ పంపిణీ విషయంలో లక్ష్యాలుగా పెట్టుకున్నామని రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. దీని ఉద్దేశం అడిగినవారందరికీ టీకా ఇవ్వడం కాదని.. అవసరమైనవారికే ఇవ్వడమని వివరించారు. కాగా, నిర్దేశిత సమయం కంటే ముందుగానే ముగించకుంటే.. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళా సూపర్‌ స్ర్పెడర్‌గా మారొచ్చని కేంద్ర ఉన్నతాఽధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సాధువులు, మత పెద్దల సహకారంతో.. ప్రభుత్వం ఓ కమిటీని నియమించనున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఒక్కసారిగా కేసుల పెరుగుదలతో పరిస్థితి తీవ్రమైందని వీకే పాల్‌ పేర్కొన్నారు.


Updated Date - 2021-04-07T06:54:50+05:30 IST