50వేల మంది రోడ్డున!

ABN , First Publish Date - 2021-08-23T05:10:05+05:30 IST

గ్రానైట్‌ పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాలిషింగ్‌ ఫ్యాక్టరీల నిర్వహణ పెనుభారంగా మారింది. కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ప్రభుత్వం రాయల్టీ బండ వేసింది. గతం కంటే 50శాతం మేర పెంచింది. అదే సమయంలో క్వారీల నిర్వాహకులు ముడిరాయి ధరను భారీగా పెంచేశారు. మరోవైపు సముద్ర రవాణా చార్జీలు భారంగా మారడంతో స్లాబుల కొనుగోలుకు బయ్యర్లు ఆసక్తిచూపడం లేదు. దీంతో నిల్వలు పేరుకుపోతున్నాయి. ఇప్పటికే ఫ్యాక్టరీలను అరకొరగా నడుపుతున్న కొందరు ఇక మావల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు.

50వేల మంది రోడ్డున!
మండలం వేమవరం వద్ద పనులు లేక మూతపడిన గ్రానైట్‌ ఫ్యాక్టరీ (ఇన్‌సెట్లో) అమ్మకాలు లేక నిలిచిపోయిన గ్రానైట్‌ స్లాబులు

మూతపడుతున్న గ్రానైట్‌ పరిశ్రమలు

ఇప్పటికే 500 వరకూ క్లోజ్‌

రాయల్టీని భారీగా పెంచిన ప్రభుత్వం 

భారంగా మారిన డీజిల్‌ ధరలు

స్లాబులు కొనుగోలుకు ముందుకు రాని బయ్యర్లు

ఫ్యాక్టరీలలో పేరుకుపోతున్న నిల్వలు

అదేసమయంలో విజిలెన్స్‌ దాడులు

ఆందోళనలో యజమానులు

బల్లికురవ, ఆగస్టు 19 :

గ్రానైట్‌ పరిశ్రమ మూసివేత దిశగా నడుస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సవాలక్ష సమస్యలతో సతమతమవుతోంది. పన్నులు, వివిధ రకాల చార్జీలు పెరిగిపోవడం ఫ్యాక్టరీల నిర్వాహకులకు గుది బండగా మారింది. వీటికితోడు నిర్వహణ ఖర్చులు కూడా అధికమవడంతో కటింగ్‌ పరిశ్రమలు నడపలేక యజమానులు చేతులెత్తేస్తున్నారు. దీంతో కార్మికులు, యంత్రాల రన్నింగ్‌తో ఎప్పుడూ సందడి వాతావరణం ఉండే బల్లికురవ, మార్టూరు, చీమకుర్తి, గ్రోత్‌సెంటర్‌ తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. పరిశ్రమ ఈ దుస్థితికి రావడానికి ప్రధానంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కారణమవుతున్నాయి. నిబంధనలు కఠినతరం చేయడంతో ముడిరాయి దొరకడం లేదు. లాక్‌డౌన్‌ సమయం నుంచి స్లాబుల నిల్వలు పేరుకుపోగా, ప్రభుత్వం రాయల్టీని భారీగా పెంచింది. డీజిల్‌ ధర దడపుట్టిస్తోంది. కటింగ్‌కు వాడే అక్సిజన్‌ గ్యాస్‌కు కొరత ఏర్పడింది. ఈ సమయంలో మైనింగ్‌, విజిలెన్స్‌ అధికారుల దాడులు పెరిగాయి. మామూళ్ల మోత అధికమైంది. ఈ పరిణామాలతో ఇప్పటికే జిల్లాలో 500 ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. మరికొన్ని అదే దశగా నడుస్తున్నాయి. దీంతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న 50వేలమంది కార్మికుల ఉపాధికి గండం ఏర్పడింది. వారంతా రోడ్డునపడే ప్రమాదం పొంచి ఉంది. 


 గ్రానైట్‌ పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాలిషింగ్‌ ఫ్యాక్టరీల నిర్వహణ పెనుభారంగా మారింది. కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ప్రభుత్వం రాయల్టీ బండ వేసింది. గతం కంటే 50శాతం మేర పెంచింది. అదే సమయంలో క్వారీల నిర్వాహకులు ముడిరాయి ధరను భారీగా పెంచేశారు. మరోవైపు సముద్ర రవాణా చార్జీలు భారంగా మారడంతో స్లాబుల కొనుగోలుకు బయ్యర్లు ఆసక్తిచూపడం లేదు. దీంతో నిల్వలు పేరుకుపోతున్నాయి. ఇప్పటికే ఫ్యాక్టరీలను అరకొరగా నడుపుతున్న కొందరు ఇక మావల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. మరికొందరు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో ఆదుకోవాల్సింది పోయి చార్జీల బాదుడుకు దిగడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే రాయల్టీని భారీగా పెంచుతూ అదనపు పన్నులు విధిస్తున్నారని వాపోతున్నారు. గత ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో గ్రానైట్‌ పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంటానని చెప్పిన జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఊసే మరిచారని వ్యాఖ్యానిస్తున్నారు.  


జిల్లాలో 1,500 పాలిషింగ్‌ యూనిట్లు 

జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ, మార్టూరు, గుళ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌, సంతమాగులూరు మండలం గురిజేపల్లి గ్రామాల పరిధిలో సుమారు 1,500 గ్రానైట్‌ కటింగ్‌ పాలిషింగ్‌ యూనిట్లు  ఉన్నాయి.  కరోనా ప్రభావంతో గత ఏడాది ఆరంభం నుంచి గ్రానైట్‌ పరిశ్రమ కష్టాల్లో పడింది. పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవటంతో గత కొంత కాలంగా దాదాపు 50 శాతం వరకు ఫ్యాక్టరీల్లో పనులు నిలిచిపోయాయి. ఇదేసమయంలో నెలన్నర ప్రభుత్వం రాయల్టీని భారీగా పెంచింది. గతంలో అడుగుకు రూ.8 ఉన్న రాయల్టీ ఇప్పుడు రూ.13 చెల్లించాల్సి వస్తోంది. ఇది ఫ్యాక్టరీల నిర్వాహకులకు శరాఘాతంలా మారింది.

పెరిగిన ముడిరాయి ధర

ముడిరాయి ధర కూడా ఇటీవల భారీగా పెరిగింది. గతంలో మీటరు రూ.17వేలు ఉండగా, వివిధ కారణాలతో క్వారీల నిర్వాహకులు దాన్ని రూ.20వేలకు పెంచారు. ఫ్యాక్టరీల వారు ముడిరాయిని క్వారీలో కొనుగోలు చేసి తీసుకువచ్చి దాన్ని స్లాబులుగా కట్‌ చేసి విక్రయిస్తారు. ప్రస్తుతం ముడిరాయి ధర పెరగడం, గతం కంటే రాయల్టీ 50శాతం అధికంగా చెల్లించాల్సి రావడం భారంగా మారింది. దీంతో అనేక మంది పనులు నిలిపివేస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీల్లో పనులు చేస్తున్న పొరుగు రాష్ట్రాల కార్మికులకు ఉపాధి చూపలేకపోతుండటంతో వారు తిరిగి వెళ్లిపోతున్నారు


సముద్ర రవాణా చార్జీలు భారీగా పెంపు

గ్రానైట్‌ స్లాబుల ఎగుమతి సముద్ర రవాణా ద్వారా జరుగుతోంది. అయితే వాటి చార్జీలు (ఓషన్‌ ఫ్రైట్‌ చార్జీలు) భారీగా పెరిగాయి. దీంతో ఇతర దేశాల బయ్యర్లు ఇక్కడి స్లాబులు కొనుగోలు చేయడం లేదు. దీంతో ఫ్యాక్టరీల్లో నిల్వలు పేరుకుపోతున్నాయి. గతంలో ఉన్న ధరలను అమలు చేయాలని కోరుతున్నా ఎవ్వరూ పట్టించుకోవటం లేదని ఫ్యాక్టరీల నిర్వాహకులు వాపోతున్నారు. 

పెరిగిన విజిలెన్స్‌ తనిఖీలు

వివిధ రకాల చార్జీల బాదుడుతో ఽగ్రానైట్‌ ఫ్యాక్టరీల నిర్వహణ కష్టంగా ఉన్న తరుణంలో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలను విస్తృతం చేశారు. ఇప్పటికే చీమకుర్తి ప్రాంతంలోని పలు ఫ్యాక్టరీలపై దాడులు నిర్వహించారు. ప్రధానంగా వారు స్లాబుల నిల్వలను పరిశీలిస్తున్నారు. త్వరలో అన్ని ఫ్యాక్టరీల్లో వీరు సోదాలు చేయనున్నారు.  లెక్కల్లో తేడాలు ఉంటే భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. దీంతో ‘మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు’ అన్నచందంగా కష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీలపై విజిలెన్స్‌ తనిఖీల ప్రభావం తీవ్రంగా పడనుంది. 

50వేల మంది కార్మికులపై తీవ్ర ప్రభావం

గ్రానైట్‌ కటింగ్‌ పాలిషింగ్‌ యూనిట్లు మూతపడితే వాటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన 50వేల మందిపై ఆ ప్రభావం పడనుంది. వారికి ఉపాధి దూరమవుతోంది. జిల్లాలోని గ్రానైట్‌ ఫ్యాక్టరీల్లో స్థానికులతోపాటు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల వారు కూడా పనిచేస్తున్నారు. కరోనా, రాయల్టీ, ముడిరాయి ధరల పెంపు, ఎగుమతులు నిలిచిపోవడం వంటి కారణాలతో వారికి ఇప్పటికే పూర్తిస్థాయిలో ఉపాధి లభించడం లేదు. విజిలెన్స్‌ దాడులతో ఫ్యాక్టరీలు పూర్తిగా మూతపడితే కార్మికుల పరిస్థితి దయనీయంగా మారే అవకాశం ఉంది. 


ఫ్యాక్టరీ నడపడం కష్టంగా ఉంది

కరోనా ప్రభావం, రాయల్టీ పెంపుతో ఫ్యాక్టరీని నడపడం కష్టమవుతోంది. నేను పొరుగు జిల్లా నుంచి బల్లికురవ మండలానికి వచ్చి కటింగ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశా. ఇప్పుడు తీవ్ర నష్టాలు వస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో రాయల్టీ చాలా తక్కువగా ఉంది. ఇక్కడ మాత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా రాయల్టీ విధిస్తున్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.

 - గోవర్దన్‌రెడ్డి, గ్రానైట్‌ ఫ్యాక్టరీ యజమాని, వేమవరం


అమ్మకాలు నిలిచిపోయాయి

పెరిగిన రాయల్టీ చెల్లించి స్లాబులు కట్‌ చేసినా కొనుగోలుకు బయ్యర్లు రావడం లేదు. ఓషన్‌ ఫ్రైట్‌ చార్జీలు భారీగా పెరగడం ఇందుకు కారణమైంది. ఈ సమయంలో విజిలెన్స్‌ దాడులు కూడా మాలో ఆందోళన కల్గిస్తున్నాయి. ఫ్యాక్టరీలలో పనులు లేకపోవటంతో కార్మికులు వారి స్వగ్రామాలకు వెళ్లిపోతున్నారు. చిన్నచిన్న పరిశ్రమలు నిర్వహించే వారి పరిస్థితి చాలా ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం రాయల్టీ తగ్గిస్తే కొంత ఉపశమనంగా ఉంటుంది. 

- వడ్లమూడి అరవిందకుమార్‌, గ్రానైట్‌ ఫ్యాక్టరీ యజమాని, ఉప్పుమాగులూరు


Updated Date - 2021-08-23T05:10:05+05:30 IST