వైరస్‌ స్వైర విహారం

ABN , First Publish Date - 2021-03-30T07:25:47+05:30 IST

దేశంలో వైరస్‌ స్వైర విహారం చేస్తోంది. పరీక్షలు తగ్గినా.. కేసుల పెరుగుదల మాత్రం ఆగడం లేదు. తాజాగా ఆదివారం 9 శాతం పెరుగుదలతో 68,020 కేసులు నమోదయ్యాయి. 9,13,319 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు మాత్రమే

వైరస్‌ స్వైర విహారం

ఒక్కరోజులో 68 వేల కేసులు

మహారాష్ట్రలో 40వేలు

కర్ణాటకలో ర్యాలీలపై నిషేధం


న్యూఢిల్లీ, మార్చి 29: దేశంలో వైరస్‌ స్వైర విహారం చేస్తోంది. పరీక్షలు తగ్గినా.. కేసుల పెరుగుదల మాత్రం ఆగడం లేదు. తాజాగా ఆదివారం 9 శాతం పెరుగుదలతో 68,020 కేసులు నమోదయ్యాయి. 9,13,319 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు మాత్రమే నిర్వహించినా.. కేసులు మాత్రం భారీగా పెరిగాయి. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 1,20,39,644కి చేరింది. 291 మంది కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 1,61,843కి పెరిగింది. ఇక ఒక్కరోజులో మరో 32,522 మంది కొవిడ్‌ నుంచి కోలుకుని ఇళ్లకు చేరగా.. మొత్తం రికవరీల సంఖ్య 1.13 కోట్లకు చేరింది. దేశంలో ప్రస్తుతం 5,21,808 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో కేసుల పెరుగుదలను మహారాష్ట్ర తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అక్కడ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వైరస్‌ మరింత తీవ్రమవుతోంది. ఒక్కరోజులో రికా ర్డు స్థాయిలో 40,414 మందికి వైరస్‌ సోకింది. 108 మంది చనిపోయారు.  


కర్ణాటకలో ర్యాలీలు, ఆందోళనలపై నిషేధం

కర్ణాటకలో కేసుల భారీగా పెరుగుతున్న వేళ.. ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని రకాలైన ర్యాలీలు, ఆందోళనలపై 15 రోజుల పాటు నిషేధం విధించారు. మాస్కులు ధరించని, భౌతికదూరం పాటించని, కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్ణాటకలో ఈ ఏడాదిలో తొలిసారిగా 3 వేలకు పైబడి కేసులు నమోదయ్యాయి. పంజాబ్‌లో ఆదివారం 2,870 మంది వైరస్‌ బారిన పడగా.. 2,583 మంది కోలుకున్నారు. అలాగే 59 మంది మృతి చెందారు. ఆ తర్వాత వరుసగా మధ్యప్రదేశ్‌ (2,276), గుజరాత్‌ (2,270), కేరళ (2,216), తమిళనాడు (2,194), చత్తీ్‌సగఢ్‌ (2,153) రాష్ట్రాలు నిలిచాయి. 


ఈ రాష్ట్రాలే ప్రధానంగా వైరస్‌ వ్యాప్తిని ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతానికి 10 రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. కుంభమేళాకు సన్నద్ధమవుతున్న ఉత్తరాఖండ్‌లో కరోనా కలకలం రేపింది. రిషికేశ్‌లోని తాజ్‌ రిసార్ట్స్‌లో 72 మంది సిబ్బందికి కరోనా సోకగా.. ఆ హోటల్‌ను అధికారులు మూడు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు. దీంతో.. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ అప్రమత్తమైంది. కుంభమేళాకు తరలి వచ్చే భక్తులపైన కఠిన ఆంక్షలు విధించింది. కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి చేసింది. కాగా, కరోనా వేళ.. భారత సైన్యం తన ఉదారతను చాటుకుంది. పొరుగున ఉన్న నేపాల్‌ సైన్యానికి లక్ష డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అందించింది. మరోవైపు పాకిస్థాన్‌లో కరోనా థర్డ్‌వేవ్‌ మొదలైంది. ఏప్రిల్‌ 1 నుంచి లాహోర్‌లో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ సడలింపులు మొదలయ్యాయి. మొదటి విడతగా ఇల్లు విడిచి బయటకు రాకూడదన్న నిబంధనను తొలగించింది. 

Updated Date - 2021-03-30T07:25:47+05:30 IST