మూడున్నర గంటల్లో 7 బిల్లులు పాస్‌

ABN , First Publish Date - 2020-09-23T06:55:25+05:30 IST

సాగు బిల్లులపై విపక్షాల వాకౌ ట్‌, సభా బహిష్కరణ కేంద్రానికి ఊతమిచ్చింది. ప్రశ్నించే గళాలు లేకపోవడంతో 7 కీలక

మూడున్నర గంటల్లో  7 బిల్లులు పాస్‌

విపక్షాలు లేకపోవడంతో మమ.


న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: సాగు బిల్లులపై విపక్షాల వాకౌ ట్‌, సభా బహిష్కరణ కేంద్రానికి ఊతమిచ్చింది. ప్రశ్నించే గళాలు లేకపోవడంతో 7 కీలక బిల్లులకు ఎన్‌డీఏ ప్రభుత్వం రాజ్యసభలో ఆమోద ముద్ర వేయించుకుంది. కాంగ్రెస్‌, లెఫ్ట్‌, ఎన్సీపీ, ఆప్‌, ఎస్పీ, డీఎంకే మొదలైన పార్టీల గెర్హాజరుతో మూడున్నర గంటల్లోనే వీటిని మమ అనిపించింది. బీజేడీ, అన్నాడీఎంకే, వైసీపీ, టీడీపీ, జేడీయూ మొదలైన మిత్రపక్షాల ఎంపీలున్నా బిల్లులపై చర్చలో పాల్గొనలేదు. కొన్ని బిల్లులపై చర్చే జరగలేదు. లోక్‌సభ ఈ బిల్లులను 3 రోజుల కిందటే ఆమోదించింది.


ఇప్పుడు ఆమోదం పొందిన బిల్లుల్లో దేశంలో వేలాది మంది పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చే బిల్లు కూడా ఉంది. దీని ప్రకారం ఇకపై రిటర్న్స్‌ ఫైలింగ్‌లో, ఆధార్‌-పాన్‌ లింకింగ్‌లో డెడ్‌లైన్‌ పెంచడానికి అవకాశమిచ్చే నిబంధనలున్నాయి. ప్రధానమంత్రి జాతీయ సహాయనిధికి విరాళాలపై ఇచ్చే పన్ను మినహాయింపులు పీఎం కేర్స్‌కూ వర్తించే బిల్లు ఉంది. సూరత్‌, భాగల్పూర్‌, రాయ్‌చూర్‌, భోపాల్‌, అగర్తలాల్లోని ఐఐఐటీలకు ఇకపై స్వతంత్రంగా బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ డిగ్రీలను ప్రదానం చేసే అధికారం ఇచ్చే బిల్లును ఆమోదించింది.


విశాఖలో ఓ ఐఐఐటీ నెలకొల్పాలని వైసీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి కోరగా.. పీపీపీ కింద ఉన్న ట్రిపుల్‌ ఐటీల్లో ఫీజుల భారాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని టీడీపీ ఎంపీ కె.రవీంద్రకుమార్‌ కోరారు. జాతీయ ఫోరెన్సిక్‌ శాస్త్ర విశ్వవిద్యాలయం, జాతీయ రక్షా విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులను కూడా రాజ్యసభ ఆమోదించింది. ఈ రెండూ గుజరాత్‌లోనే ఏర్పాటవుతాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఉన్న ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ వర్సిటీనే అప్‌గ్రేడ్‌ చేసి జాతీయ స్థాయి వర్సిటీగా మారుస్తారు.


ఇక పోలీసింగ్‌, అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాల్లో మెరుగైన శిక్షణ, సాంకేతిక విధానాల బోధనకు జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు హోంశాఖ సహాయమంత్రి జి కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలోని వేలాది సహకార బ్యాంకులు ఇక రిజర్వ్‌ బ్యాంకు పర్యవేక్షణ కిందకు వస్తాయి. బ్యాంకింగ్‌ నియంత్రణ సవరణ బిల్లు-2020గా పిలిచే ఈ బిల్లు కింద- బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిర్వహించే సహకార బ్యాంకులన్నీ వస్తాయి.

పీఎంసీ బ్యాంకు కుంభకోణం దరిమిలా కేంద్రం జూన్‌ 26న ఆర్డినెన్స్‌ తెచ్చింది. ఇపుడు దాని స్థానే తెచ్చిన బిల్లు ద్వారా డిపాజిటర్ల ప్రయోజనాలు కాపాడడం వీలవుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.


Updated Date - 2020-09-23T06:55:25+05:30 IST