792 ప్రమాదాలు.. 387 మరణాలు

ABN , First Publish Date - 2021-01-18T05:24:46+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో రోజు రోజుకూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. జిల్లాలో గతేడాది 792 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 387 మంది చనిపోయారు. 779 మంది గాయపడ్డారు.

792 ప్రమాదాలు.. 387 మరణాలు
కంది-శంకర్‌పల్లి రహదారిపై జరిగిన ప్రమాదంలో గాయపడిన వ్యక్తి (ఫైల్‌)

 జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు

 జాగ్రత్తలు పాటించకుండా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడమే కారణం

 రవాణ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి రహదారి భద్రత వారోత్సవాలు 

 ప్రచారంలో యువత పైనే ప్రత్యేక దృష్టి


కంది, జనవరి 17: సంగారెడ్డి జిల్లాలో రోజు రోజుకూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. జిల్లాలో గతేడాది 792 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 387 మంది చనిపోయారు. 779 మంది గాయపడ్డారు. ఇవన్నీ ఎక్కువగా హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ ధరించక, ఆటోల్లో లెక్కకు మించి ఎక్కడం, మద్యం తాగి, సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడుపుతూ ఇతర పనులు చేస్తున్నప్పుడు జరిగినవే. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించినా, గాయపడినా వారు పడే ఆవేదన అంతా ఇంతా కాదు. రోడ్డు ప్రమాద వార్త విన్న ఆ కుటుంబం మొత్తం ఒక్కసారిగా కృంగిపోతుంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీకోకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా వాహనాలను నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా యువత నిబంధనలు పాటించకుండా, మద్యం సేవించి, ఫోన్‌లో మాట్లాడుతూ, హెల్మెట్‌ ధరించకుండా బైక్‌లు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో జరిగిన ఆ లోటు ఎవ్వరూ పూడ్చలేనిది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, కుటుంబ సభ్యులు తమ కోసం ఎదురు చూస్తూ ఉంటారనే విషయాన్ని మరువొద్దని రవాణా శాఖా అధికారులు సూచిస్తున్నారు. ప్రమాదాల నివారణకు రవాణ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించనున్నారు. రహదారి భద్రత అవగాహన కార్యక్రమాల ద్వారా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రవాణా శాఖా అధికారులు కృషి చేస్తున్నారు. 


యువత ఉరుకులు.. పరుగులు..


యువత ఎక్కువగా ఉరుకులు, పరుగులుగా తమ వాహనాలపై ప్రయాణాలు చేస్తున్నారు. కొందరు యువకులు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా వాడాల్సిన హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ పెట్టుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా వ్యవహరించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మరికొందరు సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ, దిక్కులు చూస్తూ అజాగ్రత్తగా, అత్యంత వేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారు. మూల మలుపుల వద్ద, ఇతర వాహనాలను ఓవర్‌టేక్‌ చేసేటప్పుడు ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. 


జెండా ఊపి ప్రారంభించనున్న కలెక్టర్‌, ఎస్పీ


సంగారెడ్డి రూరల్‌/కంది, జనవరి 17: జిల్లాలో సోమవారం నుంచి రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నామని ఉమ్మడి జిల్లా ఉప రవాణా కమిషనర్‌ శివలింగయ్య తెలిపారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు సంగారెడ్డిలోని కలెక్టరేట్‌ ప్రాంగణంలో కలెక్టర్‌ హన్మంతరావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. రహదారి భద్రతా సామగ్రి ద్వారా, ప్రచార రఽథాల ద్వారా, బైక్‌ ర్యాలీల ద్వారా, వాల్‌ పోస్టర్‌లు, కరపత్రాల ద్వారా వాహన దారులకు అవగాహన కల్పించనున్నామని శివలింగయ్య పేర్కొన్నారు.


Updated Date - 2021-01-18T05:24:46+05:30 IST