పారిపోయేందుకు యత్నిస్తూ పట్టుబడిన తబ్లిగి సభ్యులు

ABN , First Publish Date - 2020-04-05T21:30:28+05:30 IST

మలేసియా పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఎనిమిది మంది ఆదివారంనాడు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద ..

పారిపోయేందుకు యత్నిస్తూ పట్టుబడిన తబ్లిగి సభ్యులు

న్యూఢిల్లీ: మలేసియా పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఎనిమిది మంది ఆదివారంనాడు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద  పట్టుబడ్డారు. వీరందరినీ మలేసియా జాతీయులుగా గుర్తించారు. ఇటీవల నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగి జమాత్ సదస్సులో వీరంతా పాల్గొని, ఆచూకీ తెలియకుండా తప్పించుకుని తిరుగుతున్నట్టుగా అనుమానిస్తున్నారు. 


ఇండియా నుంచి మలేసియాకు సహాయ సామగ్రితో మిలిందో ఎయిర్ వేస్ విమానం బయలుదేరుతున్న విషయం తెలుసుకున్న ఆ ఎనిమిదిమంది ఆ విమానంలో పారిపోవాలని ప్లాన్ చేశారు. ఢిల్లీలో తలో చోటా దాక్కున్న వీరంతా ఆదివారంనాడు విమానాశ్రయం వద్దకు చేరుకున్నట్టు ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. కాగా, మార్చి మొదట్లో నిజాముద్దీన్ సదస్సుకు వీరంతా హాజరైనట్టు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వీరిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అనంతరం తదుపరి చర్యల కోసం ఢిల్లీ పోలీసులకు, ఆరోగ్య శాఖ అధికారులకు అప్పగించనున్నారు.


నిజాముద్దీన్‌ వెస్ట్‌లో మార్చి 1 నుంచి 15 వరకూ జరిగిన తబ్లిగి జమాత్ సదస్సులో ఇండోనేసియా, మలేసియా దేశాలకు చెందిన వారితో సహా 2000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఈ సదస్సులో పాల్గొన్న వందలాది మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు వైద్య పరీక్షల్లో నిర్దారణ కావడంతో సౌత్ ఢిల్లీ, ఆ పరిసరాలను దాదాపు సీల్ చేశారు. నిజాముద్దీన్ నుంచే వివిధ రాష్ట్రాలకు కరోనా వైరస్ విస్తరించడం దేశంలో సంచలనమైంది. ఈ క్రమంలనే తబ్లిగి జమాత్ సదస్సుకు హాజరైన 960 మంది విదేశీయులను హోం శాఖ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో పాటు వారి టూరిస్ట్ వీసాలు కూడా రద్దు చేసింది.

Updated Date - 2020-04-05T21:30:28+05:30 IST