ఎయిడెడ్‌ విద్యార్థుల సర్దుబాటుకు 8 బృందాలు

ABN , First Publish Date - 2021-10-17T06:32:22+05:30 IST

ఎయిడెడ్‌ విద్యా సంస్థల విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా సర్దుబాటు చేసేందుకు శనివారం మరో ముందడుగు పడింది.

ఎయిడెడ్‌ విద్యార్థుల సర్దుబాటుకు 8 బృందాలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 16 : ఎయిడెడ్‌ విద్యా సంస్థల విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా సర్దుబాటు చేసేందుకు శనివారం మరో ముందడుగు పడింది. జిల్లాలో మొత్తం 317 ఎయిడెడ్‌ విద్యాసంస్థలు ఉండగా, వీటిలో 41 మినహా మిగతా పాఠశాలలన్నింటినీ ప్రభుత్వానికి అప్పగించేందుకు (టీచర్లు, విద్యార్థులను మాత్రమే) సంబంధిత యాజమాన్యాలు, కరస్పాండెంట్‌లు అంగీకరించిన విష యం విదితమే. ఈ సమయంలో సానుకూలత వ్యక్తం చేసిన టీచర్లను ఇప్పటికే డీఈవో పూల్‌ పరిధిలోకి తీసుకురాగా, తదుపరి ప్రక్రియలో భాగంగా విద్యార్థులను సమీప ప్రభుత్వ పాఠశాలల్లోకి సర్దుబాటు చేయడానికి జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారం భించింది. మండలాలు, పట్టణాల వారీగా వివిధ ఆవాస ప్రాంతాల్లో (హేబిటేషన్లు) ఉన్న ఎయిడెడ్‌ పాఠశాలలను మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఐదు కిలోమీటర్ల పరిధిలోని హైస్కూళ్ళల్లోకి సర్దుబాటు చేయడానికి మొత్తం 8 బృందాలను నియమించారు. నిర్ణీత దూరంలో ప్రభుత్వ పాఠశాలలు లేకపోతే ఆవాస ప్రాంతాల వారీగా కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయడానికి ఈ బృందాలు సిఫార్సు చేస్తాయి. ఇక విలీనానికి అంగీకారం తెలపని 41 ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడి ఒప్పించేందుకు ప్రయత్నిస్తాయి. డీఈవో పూల్‌లోకి చేరిన ఎయిడెడ్‌ టీచర్లకు నవంబరులో కౌన్సెలింగ్‌ నిర్వహించడం ద్వారా వారికి ప్రభుత్వ పాఠశాలల్లో బదిలీ స్థానాలను కేటాయించి తిరిగి డిప్యుటేషన్లపై సంబంధిత ఎయిడెడ్‌ పాఠశాలల్లోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు కొనసాగిస్తారు.

Updated Date - 2021-10-17T06:32:22+05:30 IST